Food: ఆహారంతోనే ఆరోగ్యం ముడిపడి ఉంది..! అదెలా అంటే..!
ABN, First Publish Date - 2023-05-02T11:45:23+05:30
వయసు, దైనందిన జీవితం, నిద్ర వేళలు, ఆరోగ్య సమస్యలు... వీటి ఆధారంగా ఆహార నియమాలను పాటించాలి. తీసుకునే ఆహారంలో పోషకాల పరిమాణం
వయసు, దైనందిన జీవితం, నిద్ర వేళలు, ఆరోగ్య సమస్యలు... వీటి ఆధారంగా ఆహార నియమాలను పాటించాలి. తీసుకునే ఆహారంలో పోషకాల పరిమాణం పట్ల కూడా అవగాహన కలిగి ఉండాలి. ఉదయం నిద్ర లేచిన గంటలోగా అల్పాహారం తీసుకోవడంతో పాటు రాత్రి నిద్రకు రెండు గంటల లోపు రాత్రి భోజనం ముగించాలి. భోజనంలో ప్రొటీన్లు, పిండిపదార్థాలు, పీచు, విటమిన్లు, మినరల్స్ మొదలైన పోషకాలు సరిపడా ఉంటున్నాయో, లేదో గమనించుకోవాలి. మరీ ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, క్లిష్టమైన పిండి పదార్థాలకు ప్రాముఖ్యం ఇవ్వాలి.
నిద్ర లేచిన గంట లోపే...
రాత్రి చివరి భోజనం తర్వాత కొనసాగిన ఉపవాసాన్ని ఉదయం నిద్ర లేచిన గంట లోపే బ్రేక్ చేయాలి. రాత్రి భోజనం 8 గంటలకు చేసి ఉంటే, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు తప్పనిసరిగా ఆ 12 గంటల ఉపవాసాన్ని బ్రేక్ చేసుకోవాలి. అయితే అందుకు కాఫీ, టీలను కాకుండా నానబెట్టిన బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరం లాంటి డ్రై ఫ్రూట్స్ ఎంచుకోవాలి. వ్యాయామం చేసే వాళ్లు ఒక పండు తినవచ్చు. జిమ్‌కు వెళ్లేవాళ్లు ఎక్కువ క్యాలరీలు అవసరం ఉన్నవాళ్లు అరటి పండు తినవచ్చు. వాకింగ్ చేసేవాళ్లు డ్రై ఫ్రూట్స్, నట్స్ తినవచ్చు. అయితే ఇలా తీసుకునే పదార్థాలను అల్పాహారంగా పరిగణించకూడదు. రోజును మొదలుపెట్టడానికి అవసరమైన శక్తి సమకూర్చే కీలక ఆహారంగానే భావించాలి. ఈ శక్తి కాఫీ, టీ లాంటి ప్రాసె్‌సడ్ ఫుడ్‌తో కాకుండా సహజసిద్ధమైన పోషకాలను అందించే నట్స్, డ్రై ఫ్రూట్స్ నుంచి మాత్రమే అందేలా చూసుకోవాలి. తర్వాత ఎవరికి వారు వారికి నచ్చిన స్థానిక అల్పాహారాన్ని తీసుకోవచ్చు.
భోజనం ఎలాగంటే...
అన్నం, పప్పు, కూర, పచ్చడి, పెరుగు... ఇదే తెలుగువారి ప్రధాన భోజనం. అయితే పూర్తిగా వండిన పదార్థాలతో పాటు కొన్ని పచ్చి కూరగాయలను కూడా భోజనంలో చేర్చుకోవాలి. తెల్ల బియ్యానికి బదులుగా దంపుడు బియ్యం, కొర్రలు, రాగులు, సామలు, ఊదలు, గోధుమలు వీటిలో ఏదో ఒకటి ప్రధాన ఆహారంగా ఉండాలి. అలాగే పొట్టుతో కూడిన కందిపప్పు, పెసరపప్పు, సెనగలు ఎంచుకోవాలి. భోజనంలో ప్రొటీన్లు, పిండిపదార్థాలు సమానంగా ఉండేలా చూసుకోవాలి. పీచులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. నీటితో కూడిన కూరగాయలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే భోజనాన్ని మొదట సలాడ్‌తో మొదలుపెట్టాలి. ఆ తర్వాత పప్పు, కూర, చివర్లో పెరుగుతో ముగించాలి. ఇలాంటి ఆహార శైలి పాటించగలిగితే, శరీరంలోకి చేరే క్యాలరీలు, పోషకాల గురించి చింతించే అవసరం ఉండదు. దానంతట అదే పోషక భర్తీ జరిగిపోతుంది.
బరువు పెరగాలంటే...
బరువు పెరగాలంటే ప్రొటీన్ ఎక్కువగా తింటూ కండర పరిమాణాన్ని పెంచే వెయిట్ ట్రైనింగ్ వ్యాయామాలు చేయడం అవసరం. లావుగా ఉన్నవాళ్లు కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్లైన నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తూ ఉండే పాలిష్ పట్టని ధాన్యాలు, బ్రౌన్ రైస్, జొన్నలు మొదలైనవి తీసుకోవాలి. అలాగే ప్రతి మూడు గంటల కోసారి తక్కువ పరిమాణంలో ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవలసి ఉంటుంది.
పండ్లు ఎప్పుడు తినాలంటే....
సాధారణంగా భోజనం తర్వాత పండ్లు తింటూ ఉంటాం. కాని నిజానికి పండ్లలోని పోషకాలను శరీరం పూర్తిగా శోషించుకోవాలంటే భోజనానికీ, భోజనానికీ మధ్య పండ్లను తినే అలవాటు చేసుకోవాలి. ఉదయం అల్పాహారిని ముందు కూడా పండ్లు తినవచ్చు. పండ్లూ, నట్స్ కూడా కలిపి తినవచ్చు. వీలైతే ఒకసారికి ఒకే రకం పండును తినాలి. పైనాపిల్, ద్రాక్ష లాంటి పండ్లు ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వాటిని మిగతా పండ్లతో కలిపి తినాలి.
కాఫీలు, టీ, గ్రీన్ టీ పరిమితంగా....
వీటిలో సహజసిద్ధ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నా సరే, వాటిలోని కెఫీన్ నేరుగా రక్తంలో కలిసి గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతుంది. శరీరంలో శక్తి సహజసిద్ధంగా పునరుత్తేజం పొందాలి. కెఫీన్‌తో శక్తిని అందుకోవడం సరి కాదు. పైగా చక్కెర కలిపిన కాఫీలు, టీలు, తేనె కలిపిన గ్రీన్ టీలు... వీటికి వ్యసనపరులుగా మారడానికి వాటిలోనే తీపే కారణం. వాటిని తాగే అలవాటున్నవాళ్లకు తీపిని తొలగించి ఇస్తే, అంతే ఇష్టంగా తాగలేరు. ఈ నిజాన్ని అర్థం చేసుకుని ఉదయం, సాయంత్రం రోజుకు రెండు పూటలా రెండు కప్పులకు వాటిని పరిమితం చేయాలి.
Updated Date - 2023-05-02T11:45:23+05:30 IST