Durga Temple: బెజవాడ దుర్గమ్మ గుడికి ఇష్టానుసారంగా ప్రభుత్వ జీవోలు
ABN, First Publish Date - 2023-10-08T17:30:59+05:30
విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానాన్ని కనకదుర్గ దేవస్థానం అంటూ పదేపదే జగన్ ప్రభుత్వం ఇష్టానుసారం జీవోలు ఇస్తోంది.
విజయవాడ: విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానాన్ని కనకదుర్గ దేవస్థానం అంటూ పదేపదే జగన్ ప్రభుత్వం ఇష్టానుసారం జీవోలు ఇస్తోంది. దేవస్థానం పేరును కూడా ఉత్తర్వుల్లో సరిగా ఇవ్వడం లేదు. పదేపదే ఇదే విధంగా జీవోలుస్తుండడంపై అమ్మవారి భక్తులు అభ్యంతరం తెలుపుతున్నారు. దీనికి తోడు వారానికి ఒక ఈఓను మారుస్తూ అమ్మవారి గుడి పైన కూడా జగన్ సర్కార్ ప్రయోగాలు చేస్తోంది. ఎన్టీఆర్ జిల్లా డీఆర్‌ఓగా ఉన్న డిప్యూటీ కలెక్టర్ ఎం.శ్రీనివాస్‌ను ఈ నెల 1వ తేదీన దుర్గా మళ్లేశ్వరస్వామి దేవస్థానికి ఈఓగా నియమిస్తూ జీఓ ఆర్టీ నెంబరు 1944 సాదరణ పరిపాలన శాఖ జీవో విడుదల చేసింది. ఆ జీవోలో కూడా దేవస్థానం పేరును శ్రీ కనకదుర్గ దేవస్థానంగా సాధారణ పరిపాలన శాఖ పేర్కొంది. తాజాగా ఆ జీఓని సవరిస్తూ శ్రీకాళహస్తి ఆర్డీఓగా పనిచేస్తున్న కేఎస్ రామారావును శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి ఈఓగా నియమిస్తూ నేడు ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ మేరకు జీఓ ఆర్టీ నెంబరు 1975ను సాదరణ పరిపాలన శాఖ విడుదల చేసింది. వెంటనే విధుల్లో జాయిన్ కావాలంటూ కేఎస్ రామారావుకు ఉత్తర్వుల్లో ఆదేశించింది. దసరాకు కొన్ని రోజుల ముందే వరుస బదిలీలతో అమ్మవారి కొండపై గందరగోళం నెలకొంది. అమ్మవారి దేవస్థానాన్ని రాజకీయాలకు వేదికగా మారుస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దసరా ముందు ప్రయోగాలు చేసి అమ్మవారి భక్తులను ఇబ్బందులకు గురి చేస్తారా అంటూ మండిపడ్డారు. ఇప్పటికే ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ మెంబర్ సెక్రటరీగా ఉన్న ఎం. శ్రీనివాసరావును వారం క్రితం ఈఓగా ఏపీ ప్రభుత్వం నియమించింది. ఆ శాఖ నుంచి ఆయనను రిలీవ్ చేసేందుకు అంగీకరించకపోవడంతో ఈఓగా బాధ్యతలు స్వీకరించలేదని సమాచారం. దీంతో తప్పు సరిదిద్దుకునేందుకు మరో జీఓ ఇచ్చి ఈఓగా కేఎస్ రామారావును నియమిస్తూ తాజా ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈ హడావుడి, తొందరపాటు బదిలీల వెనుక మాజీ, ప్రస్తుత మంత్రుల మధ్య ఈగోతో ఇలా పదే పదే జీవోలు మారుస్తు ఇస్తున్నారని కొండపై చర్చ జరుగుతోంది.
Updated Date - 2023-10-08T22:27:29+05:30 IST