Pawan Kalyan: మత్స్యకారుల సంక్షేమం, ఉపాధి కల్పనపై వైసీపీ సర్కార్‌కు చిత్తశుద్ధి ఏది?
ABN, First Publish Date - 2023-11-21T10:36:23+05:30
మత్స్యకారుల సంక్షేమం... ఉపాధి కల్పనపై వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
అమరావతి: మత్స్యకారుల సంక్షేమం... ఉపాధి కల్పనపై వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) ప్రశ్నించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కడలిని, కాయా కష్టాన్ని నమ్ముకొని ఆటుపోట్లతో జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు ప్రపంచమత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడి సంపూర్ణ ఆనందంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో ఆ దిశగా అడుగులు వేస్తామన్నారు. రాష్ట్రంలో ఇన్‌ల్యాండ్ ఫిషింగ్‌కు అనువుగా ఎన్నో జలవనరులు ఉన్నాయని.. కానీ మన మత్స్యకారులకు తగిన జీవనోపాధి లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోతున్నారని అన్నారు. మత్స్యకారుల సంక్షేమం, ఉపాధి కల్పనపై రాష్ట్ర పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పుకొచ్చారు.
గుజరాత్, కేరళ తీరాల్లో ప్రతి 30 కిలోమీటర్లకు ఒక జెట్టీ ఉండటంతో మత్స్యకారుల ఉపాధికి, వేటకి సౌలభ్యం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో మాత్రం జెట్టీలు నిర్మిస్తామని... హార్బర్లు కట్టేస్తామని మాటలు మాత్రమే ఈ ప్రభుత్వం చెబుతోందని విమర్శించారు. ముఖ్యమంత్రి అధికార నివాసానికి రూ.451 కోట్లు వెచ్చించేందుకు నిధులు విడుదల చేసే ప్రభుత్వం.. మత్స్యకారులకు జెట్టీలు, హార్బర్లు నిర్మాణానికి మాత్రం ఆసక్తి చూపటం లేదన్నారు. రుషికొండపై నిర్మితమవుతున్న రాజమహల్ కోసం చేస్తున్న ఖర్చుతో ఒక హార్బర్ నిర్మించవచ్చన్నారు. ఏడు జెట్టీలు నిర్మాణం చేయవచ్చన్నారు. ఈ ప్రభుత్వానికి మత్స్యకారుల ఉపాధి, సంక్షేమం అనేవి ప్రాధాన్యం కాదన్నారు. రుషికొండ కొట్టేసి మహల్ నిర్మించుకోవడమే ముఖ్యం అని తేటతెల్లమవుతోందన్నారు. మత్స్యకారులకు సంబంధించిన సంక్షేమ పథకాల అమలులో కూడా నిబంధనల పేరుతో కోతలు వేస్తున్నారని మండిపడ్డారు. వలలు, డీజిల్ రాయితీలపైనా శ్రద్ధ లేదన్నారు. ఉమ్మడి ప్రభుత్వంలో మత్స్యకారులకు ఉపాధి కల్పనపై ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
Updated Date - 2023-11-21T10:36:24+05:30 IST