Chandrababu Naidu: జగన్ మోసపూరిత నవరత్నాలు ఇస్తున్నాడు.. చంద్రబాబు ధ్వజం
ABN, Publish Date - Dec 28 , 2023 | 08:52 PM
ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ధ్వజమెత్తారు. చిత్తూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ మోసపూరిత నవరత్నాలు..
Chandrababu Naidu: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ధ్వజమెత్తారు. చిత్తూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ మోసపూరిత నవరత్నాలు ఇస్తున్నాడని విరుచుకుపడ్డారు. కుప్పంలో రౌడీయిజం, భూధందాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. జగన్ అండతో నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ అక్రమ మైనింగ్ చేస్తున్నారని అన్నారు. టీడీపీ త్వరలోనే అధికారంలోకి వస్తుందని, తమ ప్రభుత్వం ఏర్పడగానే రౌడీలను అణిచివేస్తామని చెప్పారు. రైతులపై వైసీపీ జెడ్పీటీసీ కృష్ణమూర్తి దాడి చేయడం అన్యాయమని అన్నారు.
తాము అధికారంలోకి రాగానే 10 లక్షల లీటర్ల పాలును ఉత్పత్తి చేసే పరిశ్రమను తీసుకొస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్ అందరికీ అమలయ్యేలా తాను మాటిస్తున్నానన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే.. అంతమందికి సంవత్సరానికి గాను రూ.15,000 ఇస్తామన్నారు. తామిచ్చిన మాట ప్రకారం మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇస్తామని తెలిపారు. జాబ్ క్యాలెండర్ తెస్తామని వైసీపీ వాళ్లు హామీ ఇచ్చారని, మరి ఆ క్యాలెండర్ వచ్చిందా? ఉద్యోగాలు వచ్చాయా? అని ప్రశ్నించారు. కుప్పంలో వైసీపీ నాయకులు ఏమీ చేయలేకపోయారని తూర్పారపట్టారు. నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చే బాధ్యతని తాను తీసుకుంటానని, నిరుద్యోగ భృతి నెలకు రూ.3000 తప్పకుండా ఇస్తానని, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనదేనని మాటిచ్చారు. అందరి జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని, ప్రతి ఒక్కరి భవిష్యత్తుని మెరుగుపరుస్తానని చెప్పారు.
రైతే రాజుగా ఉండాలన్న చంద్రబాబు.. హంద్రినీవాను శ్రీశైలం నుంచి రామకుప్పం మండలం దాకా తీసుకొస్తానని అన్నారు. రైతు బాగుంటేనే బంగారు పంటలు పండుతాయన్నారు. సంపద సృష్టించే విధానాన్ని తీసుకొస్తానన్నారు. మైక్రో ఇరిగేషన్‌కు వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. రైతుల కోసం ఒక ప్రణాళిక తయారు చేస్తానని, ఒక్కొక్క రైతుకు రూ.20,000 ఇస్తానని చెప్పారు. తనకు రుణం తీర్చుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. బీసీలతో పాటు అన్ని కులాలకు న్యాయం చేస్తానన్నారు. మంచినీళ్లు ఇవ్వని దుస్థితి వైసీపీ ప్రభుత్వానిదని దుయ్యబట్టారు. టీడీపీ హయంలో ఎన్టీఆర్ సుజల నీరును అందించామని గుర్తు చేశారు. ఈసారి తాము అధికారంలోకి వస్తే.. ప్రతి ఇంటికి నీటి కుళాయిలు అందిస్తామని హామీ ఇచ్చారు. సుపరిపాలన తప్పకుండా తీసుకొస్తామని బల్లగుద్ది మరీ చెప్పారు.
రాష్ట్ర ప్రజల ఖర్చులు తగ్గి, ఆదాయం పెరిగేలా ప్రణాళికలు తెస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. వైసీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్ & డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటాయన్నారు. రోడ్లు చాలా అధ్వాన్నంగా తయారయ్యాయని మండిపడ్డారు. ఇంతకుముందు తాము అధికారంలో ఉన్నప్పుడు సంపదని సృష్టించామని, అదే పని మళ్లీ చేస్తామని చెప్పుకొచ్చారు. 35 సంవత్సరాల్లో ఎప్పుడూ చేయని విధంగా పేదలకు మరింత సంక్షేమ పథకాలు అందిస్తానని ప్రతిజ్ఞ చేశారు. పేదల ఆదాయాన్ని పెంచడమే టీడీపీ ధ్యేయమని తేల్చి చెప్పారు.
Updated Date - Dec 28 , 2023 | 08:52 PM