అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ABN, Publish Date - Jan 23 , 2025 | 01:37 AM
అర్హులైన వారందరి సంక్షేమ పథకాలు అందిస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గంగాధర మండలం నారాయణపూర్‌లో బుధవారం నిర్వహించి గ్రామ సభకు ఆయన హాజరయ్యారు.
గంగాధర/ తిమ్మాపూర్ (మానకొండూర్), జనవరి 22 (ఆంధ్రజ్యోతి): అర్హులైన వారందరి సంక్షేమ పథకాలు అందిస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గంగాధర మండలం నారాయణపూర్‌లో బుధవారం నిర్వహించి గ్రామ సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయానికి తొమ్మిది లక్షల రేషన్‌కార్డులు, 2.7 కోట్ల లబ్ధిదారులుండేవారన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అదనంగా లబ్ధి పొందింది 40 వేల మంది మాత్రమేనని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరంలోపే రాష్ట్రంలో అదనంగా 40 లక్షల మందికి కొత్త రేషన్‌కార్డులు జారీ చేస్తుందని తెలిపారు. నారయణపూర్ ప్రాజెక్టును ప్రాధాన్య ప్రాజెక్టుల్లో చేర్చి 70 కోట్ల రూపాలు మంజూరు చేస్తామన్నారు. సంవత్సరంలో ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ముంపు ప్రజలకు తప్పకుండ న్యాయం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో రేషన్ కార్డులపై ఇస్తున్న దొడ్డు బియ్యం బాక్ మార్కెట్‌కు తరలుతున్నాయన్నారు. ప్రజలందరూ నాణ్యమైన భోజనం చేయాలని త్వరలో ప్రతి వ్యక్తికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం అందించబోతున్నట్లు వెల్లడించారు. జనవరి 26 నుంచి కొత్త రేషన్‌కార్డు ప్రక్రియ మొదలుపెట్టి అర్హులైన వారందరికి అందిస్తామన్నారు.
ఫ ఆదరణను చూసి ఓర్వలేకే ప్రతిపక్షాల విమర్శలు
- మంత్రి పొన్నం ప్రభాకర్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజలు ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దని, ఇచ్చిన హామీలు తప్పకుండా అమలు చేస్తామన్నారు.
- ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ మెట్ట ప్రాంతమైన చొప్పదండికి ఎల్లంపల్లి జలాలను నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా అందిన ఘనత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డిదన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సమస్యను వివరించగానే లేనివిధంగా జనవరిలోనే ఎల్లంపల్లి నీటిని విడుదల చేశారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, ప్రపుల్‌దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్‌యాదవ్, జడ్పీ సీఈవో శ్రీనివాస్, సీఈ సుధాకర్‌రెడ్డి, చొప్పదండి మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ, గంగాధర, చొప్పదండి ఏఎంసీ చైర్మన్లు జాగిరపు రజిత శ్రీనివాస్‌రెడ్డి, మహేష్, తహసీల్దార్ అనుపమ, ఎంపీడీవో రాము, ఎంపీవో జనార్దన్‌రెడ్డి, యూత్‌కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్, నియోజకవర్గ అధ్యక్షుడు వొడ్నాల యగ్నేష్ పాల్గొన్నారు.
ఫ రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
తిమ్మాపూర్ (మానకొండూర్): రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తిమ్మాపూర్ మండలంలోని రేణికుంటలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ రేషన్ కార్డులను అందజేస్తామని తెలిపారు. జాబితాలో పేర్లు లేనివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పంట వేసినా వేయకపోయిన వ్యవసాయానికి యోగ్యంగా ఉన్న భూములకు రైతు భరోసా అందుతుందన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ తమది పేదల ప్రభుత్వమని అన్నారు. గతంలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు ఫారం సరిగ్గా నింపక పోవడం వల్ల ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు లేకుండా పోయిందని, అలాంటి వారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. గ్రామ సభ పూర్తి అయిన తర్వాత ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మికిరణ్, ట్రైనీ కలెక్టర్ అజయ్‌యాదవ్, ఆర్డీవో మహేశ్వర్, డీఆర్డీవో పీడీ శ్రీధర్ పాల్గొన్నారు.
ఇస్తారుపల్లిని ముంపు గ్రామంగా ప్రకటించాలి
-సభలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌కు విన్నపం
గంగాదర, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): నారాయణపూర్ గ్రామ పరిధిలో ఇస్తారుపల్లిని ముంపుగ్రామంగా ప్రకటించాలని ఆ గ్రామ మహిళలు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కోరారు. బుధవారం నారాయణపూర్ గ్రామ సభకు హాజరైన ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రసంగిస్తుండగా ఇస్తారుపల్లికి చెందిన మహిళలు తమ బాధను వినిపించారు. దీంతో మహిళల సమస్యను విన్న మంత్రి సమస్య గురించి మాట్లాడబోతున్నానని తెలిపారు. అక్కడే ఉన్న పోలీసులు మహిళలను సముదాయించేందుకు ప్రయత్నించారు. దీంతో కొద్ది సేపు మహిళకు పోలీసులకు వాగ్వాదం జరిగింది. మంత్రి స్పందిస్తూ ముంపు గ్రామాలన్నింటికి న్యాయం చేస్తామని తెలిపారు.
Updated Date - Jan 23 , 2025 | 01:37 AM