బదిలీల్లో దళారులు
ABN, Publish Date - Jan 23 , 2025 | 01:32 AM
విద్యాశాఖలో ప్రభుత్వం పరస్పర (మ్యూచువల్) బదిలీలకు అవకాశం ఇవ్వడంతో కొందరు దీన్ని సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల నూతన ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టగా పాఠశాలల్లో కాస్త సిబ్బంది కొరత తీరింది.
జగిత్యాల, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): విద్యాశాఖలో ప్రభుత్వం పరస్పర (మ్యూచువల్) బదిలీలకు అవకాశం ఇవ్వడంతో కొందరు దీన్ని సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల నూతన ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టగా పాఠశాలల్లో కాస్త సిబ్బంది కొరత తీరింది. గతంలో 317 జీవో ద్వారా ఇతర జిల్లాలకు వెళ్లిన వారు పరస్పర బదిలీలతో సొంత ప్రాంతాలకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు ఉపాధ్యాయులు బేరాలకు దిగుతున్నారు. కొందరు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అక్కడ ఉన్న వారికి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు నజరానా ఇచ్చి ఒప్పించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం కొందరు మధ్యవర్తులు ఇరువురి మధ్య బేరసారాలు చేసి ఒప్పించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఫస్పౌస్ బదిలీలకు 37 మంది దరఖాస్తు
ప్రభుత్వం 2021 డిసెంబర్‌లో జీవో నంబర్ 317 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం బదిలీల ప్రక్రియ చేపట్టింది. ఈ జీవో ప్రకారం కొంత మంది ఉపాధ్యాయులు జగిత్యాల జిల్లా నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మిగిలిన ప్రాంతాలకు వెళ్లారు. ఆయా జిల్లాల నుంచి పలువురు ఉపాధ్యాయులు జగిత్యాల జిల్లాకు వచ్చారు. అనంతరం ఒకే శాఖ పరిధిలోని ఉద్యోగులు పరస్పర బదిలీలకు దరఖాస్తు చేసుకునేలా 2023లో ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో కొంత మంది సద్వినియోగం చేసుకున్నారు. ఈనెల 16వ తేదీన ప్రభుత్వం మరోసారి పరస్పర బదిలీలకు అనుమతి ఇవ్వడంతో ఆశావహులు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. జిల్లాలోని 37 మంది ఉపాధ్యాయులకు స్పౌస్ బదిలీ కోసం అనుమతి లభించింది. ఇందులో జగిత్యాల జిల్లా నుంచి ఇతర జిల్లాలకు 35 మంది ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లడానికి సిద్ధమవగా, ఇతర జిల్లాల నుంచి జగిత్యాలకు రావడానికి ఇద్దరు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా నుంచి 63 మంది ఉపాధ్యాయులు పరస్పర బదిలీ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. సంబంధిత దరఖాస్తులను పరిశీలించడం, అండర్ టేకింగ్ పత్రాలను తీసుకునే ప్రక్రియ చేపట్టారు.
ఫసీనియారిటీ కోల్పోవడంపై ఆందోళన
పరస్పర బదిలీల్లో భాగంగా ఒక లోకల్ కేడర్ నుంచి మరో లోకల్ కేడర్‌కు వెళ్తే సీనియారిటీ మొత్తం కోల్పోతారని గతంలో జారీ చేసిన జీవోలో ప్రభుత్వం పేర్కొంది. కొందరు ఉపాధ్యాయులు ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంతో బదిలీల ప్రక్రియ నిలిచిపోయింది. హైకోర్టు ఇచ్చే తుది తీర్పునకు కట్టుబడి ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో పరస్పర బదిలీలకు తాత్కాలికంగా న్యాయ చిక్కులు తొలగినట్లయింది. అలాగే కోర్టు తుది తీర్పునకు కట్టుబడి ఉంటామని సమ్మతిపత్రం ఇచ్చిన ఉపాధ్యాయుల దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అయితే ఆయా టీచర్ల నుంచి అండర్ టేకింగ్ తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లాలో పనిచేస్తూ ఇతర జిల్లాల్లో బదిలీలకు దరఖాస్తు చేసుకున్న టీచర్లు ఇక్కడి జిల్లా పాత సర్వీస్, సీనియారిటీని కోల్పోతారు. వారు వెళ్లే జిల్లాలో కొత్తగా సర్వీస్, అక్కడి టీచర్ల కేడర్‌లో చివరి జూనియర్‌గా సర్వీస్‌గా పరిగణిస్తారు. వేరే జిల్లాల నుంచి జగిత్యాలకు వచ్చిన వారి పరిస్థితి అలానే ఉంటుంది. ఈ విధంగా పాత సర్వీసును కోల్పోయేందుకు, కొత్త జిల్లాలో కొత్త సర్వీసుకు ఒకే చెబుతూ అంగీకారంగా అండర్ టేకింగ్‌ను డీఈవో కార్యాలయంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఆయా టీచర్ల సర్వీస్ బుక్స్‌ను కూడా పరిశీలిస్తారు. దానిని ఉన్నతాధికారులు పరిశీలించాక పరస్పర బదిలీలు చేపట్టనున్నట్లు సమాచారం.
ఉపాధ్యాయులు ఒత్తిడి లేకుండా పనిచేసేలా చూడాలి
-అంబటి భూమేశ్వర్, టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
గత ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోతో ఉపాధ్యాయులు చెల్లాచెదురు అయ్యారు. స్థానికంగా ఉంటే ఒత్తిడి లేకుండా పని చేస్తారు. మంచి ఫలితాలు వస్తాయి. ప్రభుత్వం సంబంధిత జీవో ద్వారా ఇబ్బంది పడిన వారందరికీ న్యాయం చేయాలి.
ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు బదిలీలు
- రాము, జిల్లా విద్యాశాఖ అధికారి
ప్రభుత్వ విడుదల చేసిన ఉత్తర్వులు మేరకు పరస్పర బదిలీలు చేస్తాం. అయితే ఇరు ప్రాంతాల ఉపాధ్యాయుల అంగీకార పత్రాలు పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం ఉంటుంది. ఇబ్బందులు ఎదురు కాకుండా ఉన్నతాధికారుల సూచనలు తీసుకుంటాం.
Updated Date - Jan 23 , 2025 | 01:32 AM