కౌలు రైతులకు ఏదీ భరోసా!
ABN, Publish Date - Jan 29 , 2025 | 01:33 AM
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా కౌలు రైతులకు భరోసా లేకుండా పోయింది. ఈ సీజన్ నుంచి రైతులకు రైతు భరోసా, కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను వర్తింపజేస్తూ కౌలు రైతుల గురించి ప్రభుత్వం ఊసె త్తక పోవడంతో ఆందోళనకు గురవుతున్నారు.
- పెట్టుబడి సాయం ఊసెత్తని ప్రభుత్వం
- ఆరుగాలం శ్రమించినా దక్కని ఫలాలు
- అడ్డగోలుగా పెరిగిన కౌలు, పెట్టుబడులు
- ఈ సీజన్ నుంచే రైతు భరోసా ఇవ్వాలి
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా కౌలు రైతులకు భరోసా లేకుండా పోయింది. ఈ సీజన్ నుంచి రైతులకు రైతు భరోసా, కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను వర్తింపజేస్తూ కౌలు రైతుల గురించి ప్రభుత్వం ఊసె త్తక పోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే కౌలు రైతులకు సైతం రైతు భరోసా పథకాన్ని వర్తింపజేసి ఎకరానికి 7,500 చొప్పున ఏడాదికి రూ.15 వేలు అందజేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. గత బీఆర్‌ఎస్ ప్రభు త్వం రైతులకు మాత్రమే రైతుబంధు ద్వారా ఎకరానికి రూ.5 వేల చొప్పున ఏడాదికి రూ.10 వేలు ఇచ్చింది. కౌలు రైతులను విస్మరించడంతో పాటు కూలీలకు సైతం ఎలాంటి సాయాన్ని అందజేయ లేదు. దీంతో కౌలు రైతులు, రైతు కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా కౌలు రైతులకు భరోసా కల్పించినప్పటికీ, ఇప్పటి వరకు సాయాన్ని అందించే విషయమై ప్రభుత్వం ఏడాది గడిచినా పట్టించుకోకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ యాసంగి సీజన్ నుంచి రైతు భరోసా పథకాన్ని ఆరంభించింది. ఎకరానికి 7,500 రూపాయలకు బదులు 6 వేలు ఇస్తున్నది. ఈ నెల 26వ తేదీ నుంచి డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట పథకాన్ని ఆరంభించి వారి ఖాతాల్లో సీజన్‌కు రూ.6 వేల చొప్పున ఏడాదికి రూ.12 వేలు జమ చేస్తామని ప్రకటించింది. ఈ పథకం కింద 2023-24లో 20 రోజులు ఉపాధి పని దినాలకు వెళ్లిన వారై ఉండి, ఎలాంటి భూములు లేని వారికి మాత్ర మే రైతు భరోసా అందిస్తున్నది. మార్చి నెలాఖరు లోగా రైతులు, కూలీల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయనున్నారు. అయితే కౌలు రైతులను విస్మ రించడంతో వాళ్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన వానాకాలం సీజన్‌లో రైతులు పండించిన సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇచ్చింది. దీంతో సన్న రకాలు పండించిన కౌలు రైతులకు కాస్త ఊరట లభించింది.
ఫ అడ్డగోలుగా పెరిగిన కౌలు ధరలు..
కౌలు రైతులకు ప్రభుత్వం రైతు భరోసా కింద పెట్టుబడి సాయం ఇస్తుందని, సన్న రకాలకు బోనస్ ఇస్తుండడంతో ఈ యాసంగి సీజన్‌లో పట్టాదారులు కౌలు ధరలను పెంచారు. ఇప్పటి వరకు అన్ని రకాల నీటి వసతి ఉండి వరి సాగయ్యే భూములకు ఎకరా నికి ఒక పంటకు 10 నుంచి 15 వేల రూపాయల కౌలు చెల్లించారు. ప్రస్తుతం ఆ ధరలను 16 నుంచి 18 వేల రూపాయల వరకు పెంచారు. మరికొందరు పట్టాదారులు సన్న వరి పండిస్తే దానికింద వచ్చే బోనస్‌లో సగం ఇస్తేనే కౌలు కొనసాగిస్తానని, లేదంటే కౌలు రద్దు చేస్తానని హెచ్చరించడంతో చేసేదేమి లేక కొంత మంది కౌలు రైతులు కౌలు ధరలను పెంచారు. వానాకాలం పంట కంటే యాసంగి సీజన్‌లో వరి పంట దిగుబడులు అధికంగా వస్తాయి. జిల్లాలో కౌలు రైతులు 10 వేల మందికి పైగా ఉన్నారని సమాచారం.
ఫ ఆరుగాలం శ్రమించినా దక్కని ఫలం..
కౌలు రైతులు ఆరుగాలం శ్రమించి చమటోడ్చి పంటలు పండించినా కష్టం అంతా కౌలు కింద పట్టాదారులకే చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, తెగుళ్లు వచ్చి పంటలు దెబ్బతిన్నా పట్టాదారులకు కౌలు చెల్లించాల్సిందే. జిల్లాలో కొన్ని చొట్ల ముందుగానే కౌలు సొమ్ము చెల్లించిన వారికే పట్టాదారులు భూములను కౌలుకు ఇస్తున్నారు. విత్తనాలు, ఎరువుల ధరలతోపాటు ట్రాక్టర్లతో దున్నడం, హార్వేస్టర్ కిరాయి, కలుపు తీత, వరినాట్లు వేసేందుకు కూలీ ధరలు పెరగడంతో పెట్టుబడులు అధికమయ్యాయి. పంట నష్టపోతే ప్రభుత్వం ఇచ్చే పరిహారం పట్టాదారులకే ఇస్తారు. బ్యాంకులో పంట రుణాలు, ఇతరత్రా సబ్సిడీ పథ కాలు వారికే వర్తింపజేస్తున్నారు. దీంతో కౌలు రైతు లకు చెమట చుక్కలు తప్ప ఏమీ మిగలడం లేదు. అప్పుల పాలై పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎన్నికల సంద ర్భంగా ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకు తమకు కూడా ఇదే సీజన్ నుంచి రైతు భరోసా అందజే యాలని కౌలు రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Updated Date - Jan 29 , 2025 | 01:33 AM