RTI Act: పత్తాలేని పౌరాస్త్రం
ABN, Publish Date - Jan 08 , 2025 | 05:51 AM
ప్రభుత్వం నుంచి జవాబుదారీతనం, పారదర్శకత కోరుకునే పౌరులకు బ్రహ్మాస్త్రమైన సమాచార హక్కు చట్టం తెలంగాణలో పత్తా లేకుండా పోయింది.
రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం సమాధి!
చిన్నపాటి సమాచారానికి నెలల నిరీక్షణ
భర్తీకి నోచుకోని సమాచార కమిషన్
సుప్రీంకోర్టు ఆదేశాలూ బేఖాతరు
లక్షకు పైగా దరఖాస్తుల పెండింగ్
హైదరాబాద్, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం నుంచి జవాబుదారీతనం, పారదర్శకత కోరుకునే పౌరులకు బ్రహ్మాస్త్రమైన సమాచార హక్కు చట్టం తెలంగాణలో పత్తా లేకుండా పోయింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో వచ్చిన ఈ చట్టంపై గొప్పలు చెప్పే రాష్ట్ర పాలకులు అమలులో మాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నా.. రాష్ట్రంలో సహచార హక్కు కమిషన్ రెండేళ్లుగా ఏర్పాటు కాలేదంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కమిషన్ ఏర్పాటు, నియామకాలను ప్రస్తుత, గత ప్రభుత్వాలు సరిగా పట్టించుకోకపోవడంతో లక్షల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. సమాచార హక్కు చట్టం ఉద్దేశ్యం కూడా నెరవేరడం లేదు.
రెండేళ్లలో రెండుసార్లు నోటిఫికేషన్..
నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు ప్రైవేటు లీజుకు సంబంధించి ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పంద వివరాలు అందించండి.. ఎంపీ, టీపీపీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సమాచార హక్కు చట్టం కింద హెచ్‌ఎండీఏకు ఈ దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు అధికారులు స్పందించకపోవడంతో ఆయన ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. అంతేనా.. తాము అధికారంలోకి వస్తే సమాచార హక్కు చట్టాన్ని రాష్ట్రంలో పక్కా అమలు చేస్తామని అప్పట్లో ప్రకటించారు. ఆయన అధికారం చేపట్టి ఏడాది పూర్తయినా సమాచార కమిషన్ నియామకం జరగలేదు. నిర్దిష్ట సమయంలోగా ఖాళీగా ఉన్న సమాచార కమిషనర్ పోస్టులను భర్తీ చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏడాది క్రితమే ఆదేశించింది. కానీ, నియామకాల అంశం అతీగతి లేకుండానే ఉంది. నిజానికి, సమాచార కమిషనర్ల నియామకంపై గత ప్రభుత్వం 2023 జూన్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతరం 2023 డిసెంబరులో ప్రభుత్వం మారడం, తర్వాత మళ్లీ సాధారణ ఎన్నికల నేపథ్యంలో నియామక ప్రక్రియ ఆలస్యమైంది. అయితే, ఓ ప్రధాన కమిషనర్, ఆరుగుర కమిషనర్ల నియామకానికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం గత జూన్‌లో మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసింది. చాలా మంది దరఖాస్తు చేసుకోగా.. రాజకీయ జోక్యం లేకుండా నియామకాలు జరగాలని సీఎం రేవంత్ అప్పట్లో అధికారులను ఆదేశించారు. ఆ దిశగా కసరత్తు చేసిన అధికారలు ఓ జాబితాను సిద్ధం చేసి ఇంటెలిజెన్స్ విచారణ కూడా చేపట్టారు. కానీ, నియామక ప్రక్రియ పూర్తి కాలేదు. అయితే, సమాచార కమిషన్ నియామకాల అంశంపై సుప్రీంకోర్టు మంగళవారం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. నియామక ప్రక్రియను ప్రారంభించామని, త్వరలో పూర్తి చేస్తామని ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేసింది. దీంతో త్వరలోనే కమిషనర్ల నియామకాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సంవత్సరాలుగా నిరీక్షణ..
సమాచార హక్కు చట్టం అమలులో తెలంగాణ అధమస్థాయిలో ఉంది. సమాచారం కోసం పౌరులు ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2023 ఫిబ్రవరి నుంచి కమిషనర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ విభాగంలో కోరిన ఏ సమాచారమైనా గరిష్ఠంగా 30 రోజుల్లో ఇవ్వాలి. లేనిపక్షంలో అతడి పైఅధికారికి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అక్కడా 30 రోజుల్లో రాకుంటే రాష్ట్ర సమాచార కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ఇలా రాష్ట్ర కమిషన్ వద్ద లక్షకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. మరోవైపు సమాచార చట్టం సక్రమంగా అమలు కాకుండా గత ప్రభుత్వం కూడా అడ్డుకుంది. పౌరుల దరఖాస్తులకు సమాచారం ఇచ్చే ముందు రాష్ట్ర స్థాయిలో అనుమతి తీసుకోవాలని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశాలిచ్చారు. ఈ నిర్ణయం తీవ్ర విమర్శల పాలైంది.
చట్టంలో ఏముంది?
సమాచార హక్కు చట్టం-2005 సెక్షన్ 7(1) ప్రకారం.. ప్రభుత్వ శాఖలకు సంబంధించి పౌరులు కోరిన సమాచారాన్ని గరిష్ఠంగా 30 రోజుల్లోపు ఇవ్వాలి. వ్యక్తి జీవితం, స్వేచ్ఛకు సంబంధించిన అంశమైతే అత్యవసర సమాచారంగా భావించి గరిష్ఠంగా 48 గంటల్లోపు ఇవ్వాలి.
అధికారి 30 రోజుల్లో సమాచారం ఇవ్వని పక్షంలో పౌరులు సెక్షన్ 19 (1) ప్రకారం పైఅధికారికి దరఖాస్తు చేసుకోవచ్చు.
అక్కడ కూడా 30రోజుల్లో సమాచారం రానిపక్షంలోసెక్షన్ 19(3) ప్రకారం సెకండ్ అప్పీలేట్ అథారిటీ అయిన రాష్ట్ర సమాచార కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
సమాచారాన్ని సకాలంలో ఇవ్వడంలో విఫలమైన ప్రజా సమాచార అధికారిపై సెక్షన్-20 కింద గరిష్ఠంగా రూ. 25వేల జరిమానా, క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం సమాచార కమిషన్‌కు ఉంది.
Updated Date - Jan 08 , 2025 | 05:51 AM