LRS scheme: 5 రోజులు.. 4 వేల దరఖాస్తుల ఆమోదం
ABN, Publish Date - Mar 06 , 2025 | 04:57 AM
దరఖాస్తుదారుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. గత అయిదు రోజుల్లో నాలుగు వేల మంది దరఖాస్తుదారులు మాత్రమే నిర్ణీత ఫీజు చెల్లించి తమ దరఖాస్తులకు ఆమోదం పొందారు. అంటే రోజుకు సగటున 800 మంది. మార్చి 31వ తేదీ వరకు గడువు ఉంది.
ఎల్‌ఆర్‌ఎ్‌సకు స్పందన అంతంతే.. నెలాఖరు దాకా రాయితీ
‘ఆటోమేటిక్ ఫీజు’ కింద పెండింగులో 19 లక్షల దరఖాస్తులు
111 జీవో ఫామ్‌ల్యాండ్‌కు వర్తించని క్రమబద్ధీకరణ పథకం
హైదరాబాద్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఎల్‌ఆర్‌ఎస్ (లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం) పెండింగ్ దరఖాస్తులను వేగంగా క్లియర్ చేయటానికి ప్రభుత్వం 25 శాతం రాయితీ ఇచ్చినా.. దరఖాస్తుదారుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. గత అయిదు రోజుల్లో నాలుగు వేల మంది దరఖాస్తుదారులు మాత్రమే నిర్ణీత ఫీజు చెల్లించి తమ దరఖాస్తులకు ఆమోదం పొందారు. అంటే రోజుకు సగటున 800 మంది. మార్చి 31వ తేదీ వరకు గడువు ఉంది. కాగా, 4 వేల దరఖాస్తుల్లో రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఎల్‌ఆర్‌ఎస్ ఆమోదం పొందినవి 235. మిగిలినవి పంచాయతీ, మున్సిపాలిటీల ద్వారా ఆమోదం పొందాయి. రాయితీ పథకం అమల్లోకి రాకముందు 14 వేల దరఖాస్తులు ఆమోదం పొందగా.. పథకం అమలైన తర్వాత తాజాగా మరో 4 వేలు ఆమోదం పొందాయి. మొత్తమ్మీద, 18 వేల ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు ఆమోదం లభించింది. ఇప్పటి వరకూ ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.150 కోట్ల ఆదాయం లభించింది. కాగా, ప్రస్తుతం ఆటోమేటిక్ ఫీజు జనరేట్ అయిన దరఖాస్తులే సుమారు 19 లక్షల వరకు ఉన్నాయి. ఇందులో సగం పరిష్కారం కావాలన్నా రోజుకు కనీసం 30 వేల దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉంటుందని ఓ అధికారి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
కటాఫ్ తేదీలోపు 25.68 లక్షల దరఖాస్తులు
వాస్తవానికి ఎల్‌ఆర్‌ఎ్‌సకు ప్రభుత్వం 2020 ఆగస్టు 26వ తేదీని కటాఫ్ తేదీగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ గడువులోగా వచ్చిన దరఖాస్తులు 25.68 లక్షలు. ఇప్పుడు సవరించిన మార్గదర్శకాల ప్రకారం.. కటాఫ్ తేదీలోపు లేఅవుట్‌లో ప్లాట్ కొనుగోలు చేసి నాడు ఎల్‌ఆర్‌ఎ్‌సకు దరఖాస్తు చేయనివారికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే రాయితీ వర్తించేలా వెసులబాటు ఇచ్చింది. అయినప్పటికీ పెద్దగా స్పందన లేదు. కాగా, 2020లో ఎల్‌ఆర్‌ఎస్ కోసం వచ్చిన 25.68 లక్షల దరఖాస్తుల్లో ప్రభుత్వ భూములు, నిషేధిత భూములకు సంబంధించినవి 2.50 లక్షలు. జలవనరులకు 200 మీటర్ల సమీపంలో ఉన్నవి సుమారు 4 లక్షలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం వీటిని ఆమోదించాలా లేదా అనే నిర్ణయం తీసుకుంటారు.
ఫామ్ ల్యాండ్స్ క్రమబద్ధీకరణ లేదు
111 జీవో పరిధిలో ఉండే ఫామ్ ల్యాండ్స్‌కు సంబంధించి ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్ధీకరణకు అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. లేఅవుట్ క్రమబద్ధీకరణ విషయంలో, 10 శాతం సేల్ డీడ్ కాగా మిగిలిపోయిన ప్లాట్లకు సంబంధించి ప్రస్తుతం అవకాశం ఉందని పేర్కొన్నారు. అంటే, 2020లో దరఖాస్తుచేసుకోని వారికి కూడా రిజిస్ట్రేషన్‌తోపాటు ఎల్‌ఆర్‌ఎ్‌సకు అవకాశం ఇస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు బుధవారం వచ్చిన దరఖాస్తులు కేవలం 95 మాత్రమే. అవగాహన సదస్సులు పెడుతున్నా దరఖాస్తుదారులు ఆసక్తి చూపడం లేదని అధికారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Parvesh Verma: తీహార్ నుంచి ఇక ఆయన తిరిగి రాకపోవచ్చు.. కేజ్రీవాల్ అవినీతిపై పర్వేష్ వర్మ
Congress: కేరళ కాంగ్రెస్ నేతల భేటీకి థరూర్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Mar 06 , 2025 | 04:57 AM