Hyderabad: చోరీలకు.. సరిపోదా గురువారం!
ABN, Publish Date - Feb 05 , 2025 | 05:34 AM
హైదరాబాద్, గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ వద్ద కాల్పులు జరిపి పోలీసులకు చిక్కిన ఘరానా దొంగ బత్తుల ప్రభాకర్‌ది కూడా దాదాపు ఇదే పద్ధతి. కళాశాలలు, విద్యాసంస్థలే లక్ష్యంగా దొంగతనాలు చేసే ప్రభాకర్...
సోమ, మంగళ, బుధవారాల్లో ప్లానింగ్.. గురువారాలు దొంగతనాలు.. వీకెండ్‌లో జల్సాలు
హైటెక్ దొంగ బత్తుల ప్రభాకర్ స్టయిలే వేరు
ప్రిజమ్ పబ్ వద్ద కాల్పులు జరిపి పోలీసులకు చిక్కిన ప్రభాకర్
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): ఇటీవల వచ్చిన ‘సరిపోదా శనివారం’ సినిమా గుర్తుందా? అందులో కథానాయకుడు నాని... కేవలం శనివారం మాత్రమే తన కోపాన్ని బయటకు ప్రదర్శిస్తాడు, ఫైటింగులు చేస్తాడు.. హైదరాబాద్, గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ వద్ద కాల్పులు జరిపి పోలీసులకు చిక్కిన ఘరానా దొంగ బత్తుల ప్రభాకర్‌ది కూడా దాదాపు ఇదే పద్ధతి. కళాశాలలు, విద్యాసంస్థలే లక్ష్యంగా దొంగతనాలు చేసే ప్రభాకర్... సరిపోదా గురువారం అన్నట్టు.. వారంలో గురువారం రోజున మాత్రమే తన కళను ప్రదర్శిస్తాడు. సోమ, మంగళ, బుధవారాల్లో దొంగతనానికి పధకం వేస్తుంటాడు. వారాంతాలు.. శుక్ర, శని, ఆదివారాలు పబ్‌లు చుట్టూ తిరుగుతూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. అంతేనా.. ఎలాగైనా రూ.335 కోట్లు కొల్లగొట్టడం, వంద మంది అమ్మాయిలతో జల్సా చేయడం ప్రభాకర్ జీవిత లక్ష్యాలు. వీటిని నెరవేర్చుకునేందుకు ప్రభాకర్.. ‘ధూమ్’ సినిమా స్థాయిలో పెద్ద సెటప్ కూడా పెట్టుకున్నాడు. తాను నివాసముండే ఫ్లాట్‌లోని ఓ గదిలో గోడకి తన తదుపరి లక్ష్యాలు, అవి నెరవేర్చుకునే మార్గాలకు సంబంధించిన ఫొటోలతో కూడిన మ్యాప్‌లను ఏర్పాటు చేసుకున్నాడు. విచారణలో ప్రభాకర్‌కు సంబంధించిన ఇలాంటి విషయాలన్నీ బయటికొస్తుంటే పోలీసులే ముక్కున వేలేసుకుంటున్నారు.
ఒకేసారి రూ.3 కోట్లు మొత్తం రూ.335 కోట్లు.
ప్రభాకర్ కేవలం నగదు దొంగతనాలే చేస్తుంటాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా కళాశాలలు, విద్యా సంస్థల్లో చోరీలు చేస్తాడు. సోమ, మంగళ, బుధవారాల్లో రెక్కీ చేసి గురువారం దొంగతనం చేస్తుంటాడు. కనీసం రూ.10 లక్షలు దొరుకుతాయి అనుకుంటేనే డ్యూటీ ఎక్కుతాడు. ఒక్క దోపిడీలో రూ.3కోట్లు కొల్లగొట్టాలని, జీవితకాలంలో రూ.335 కోట్లు దోచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభాకర్ 80 వరకు కళాశాలల్లో చోరీలు చేశాడు. కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులపై కన్నేశాడు. హైదరాబాద్‌లోని 2 కార్పొరేట్ ఆస్పత్రులపై స్కెచ్ కూడా సిద్ధం చేసుకున్నాడు.
ఫోన్ ఉంటుంది.. కానీ నో సిమ్
ప్రభాకర్ ఓ సెల్‌ఫోన్ వాడతాడు కానీ అందులో సిమ్ కార్డు ఉండదు. చోరీల కోసం రెక్కీకి వెళ్లినప్పుడు తనకు కావాల్సిన ఫొటోలు తీసేందుకు ఆ సెల్ ఫోన్ వాడతాడు. అలాగే, చోరీ చేసే గదిలో చీకటిగా ఉంటే సెల్‌ఫోన్‌లోని టార్చ్‌లైట్‌ను వాడతాడు. ఇక, గచ్చిబౌలిలో నెలకు రూ.50వేలు అద్దె చెల్లిస్తూ ఓ ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లో ఉంటున్న ప్రభాకర్.. ఆ ఫ్లాట్‌లోని ఓ గదిని డెన్‌గా మార్చేశాడు. సినిమాలో చూపించే విధంగా దోపిడీకి స్కెచ్‌లు,. చోరీకి వెళ్లడానికి రూట్ మ్యాప్, దోపిడీకి టార్గెట్ చేసిన లొకేషన్స్‌కు సంబంధించి ఆ గదిలో ప్రత్యేక ఏర్పాటు చేసుకున్నాడు. వంట చేసి పెట్టేందుకు ఓ వంట మనిషిని కూడా పెట్టుకున్న ప్రభాకర్.. కొత్తవాళ్లను ఫ్లాట్‌లోకి రానివ్వడు.
కారు, బ్యాంకు ఖాతాలు స్నేహితుల పేరు మీదే..
ఊళ్లో తనకు చేపలు, రొయ్యల చెరువుల వ్యాపారులున్నాయని చెప్పుకునే ప్రభాకర్.. ఖరీదైన బ్రాండెడ్ దుస్తులు వేసుకుని తిరుగుతూ, రూ. 40వేల విలువైన మద్యం తాగుతూ దర్పం ప్రదర్శించేవాడు. స్నేహితుడి పేరిట కొనుగోలు చేసిన స్కోడా కారులో తిరిగేవాడు. డబ్బు అవసరమైనా, ఆన్‌లైన్ లావాదేవీలు చేయాలన్నా పబ్‌ల్లో పరిచయమైన స్నేహితుల బ్యాంకు ఖాతాలు వాడేవాడు. ఇక, రెండుసార్లు బిహార్ వెళ్లి రెండు తుపాకులు తెచ్చుకున్న ప్రభాకర్... ఓఆర్‌ఆర్ సమీపంలోని అటవీ ప్రాం తాల్లోకి వెళ్లి తుపాకీ పేల్చడం సొంతంగా నేర్చుకున్నాడు. 500 బుల్లెట్లు కొనుగోలు చేసి శిక్షణకు 100 రౌండ్ల దాకా వాడేశాడు. తొమ్మిదో తరగతి వరకే చదివిన ప్రభాకర్ తెలివికి ఆశ్చర్యపోతున్న పోలీసులు.. అతడిని లోతుగా విచారించడానికి కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు.
లక్ష్యం.. 100 మంది అమ్మాయిలు
జల్సారాయుడైన ప్రభాకర్ డబ్బు ఎరగా వేసి నచ్చిన అమ్మాయిని తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి వారితో గడిపి సరదా తీరాక పంపేస్తుంటాడు. ఇలా నచ్చిన 100 మందితో గడపాలనేది ప్రభాకర్ లక్ష్యం. ఇందులో భాగంగా ఇప్పటిదాకా 40 మంది అమ్మాయిలను ట్రాప్ చేసినట్టు ప్రభాకర్ పోలీసులకు చెప్పాడు. డబ్బు, అమ్మాయిల విషయంలో తన లక్ష్యాలను ప్రతిబింబించేలా తన ఛాతీపై రెండు టాటూలు కూడా వేయించుకున్నాడు ప్రభాకర్. ఏపీకి చెందిన ఓ అమ్మాయి వారోనికోసారి ప్రభాకర్ ఫ్లాట్‌కు వచ్చివెళ్లేదని, ప్రతీసారి రూ.30వేలు చొప్పున తీసుకెళ్లేదని పోలీసులు గుర్తించారు.
మరిన్ని వార్తల కోసం..
PM Modi: ఎవర్నీ వదిలిపెట్టలేదు.. ఆటాడుకున్న పీఎం
Maha Kumbh Mela 2025: కుంభమేళాకు ప్రధాని మోదీ.. పవిత్ర స్నానంతోపాటు ప్రత్యేక పూజలు
Delhi Elections: ఎన్నికలకు సిద్ధం.. 35,000 మంది పోలీసులు, సీసీ టీవీ నిఘా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Feb 05 , 2025 | 05:34 AM