తెలిసినవారే ‘తోడేళ్లు’
ABN, Publish Date - Jan 01 , 2025 | 04:21 AM
చుట్టుపక్కల వారో.. దూరపు చుట్టాలో..! తెలిసినవారే తోడేళ్లుగా మారుతున్నారు..! పరిచయస్తులే కదా? అని నమ్మితే అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు..! బాలికలు, యువతులు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో 2024లో నమోదైన కేసులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది.
రాష్ట్రంలో 2,945 అత్యాచార ఘటనలు.. ఐదేళ్లలో అత్యధికం
2,912 కేసుల ఛేదన.. బాధితులకు నిందితులు పరిచయస్థులే
15-18 ఏళ్లలోపు వయసు బాలికలపై 1,970 అఘాయిత్యాలు
హైదరాబాద్, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): చుట్టుపక్కల వారో.. దూరపు చుట్టాలో..! తెలిసినవారే తోడేళ్లుగా మారుతున్నారు..! పరిచయస్తులే కదా? అని నమ్మితే అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు..! బాలికలు, యువతులు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో 2024లో నమోదైన కేసులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. ఏడాదిలో 2,945 దారుణాలు జరగ్గా 2,912 ఉదంతాల్లో నిందితులు బాధితులకు తెలిసినవారే కావడం గమనార్హం. మరో ఆందోళనకర అంశం ఏమంటే.. మొత్తం అత్యాచార ఘటనల్లో 15-18 ఏళ్లలోపు వారు అధికంగా ఉండడం. వీరిపై జరిగిన దారుణాల సంఖ్య 1,970. ఇక బాధితుల్లో 15 ఏళ్లలోపు బాలికలు 87 మంది, 18 ఏళ్లు దాటిన మహిళలు 888 మంది ఉన్నారు. కీలక విషయం ఏమంటే.. 2,945 కేసుల్లో 33 కేసుల్లో మాత్రమే నిందితులు ఎవరో తేలలేదు. అంటే.. 2,912 ఘటనల్లో నిందితులను పట్టుకున్నారు. 2020 నుంచి చూస్తే రాష్ట్రంలో 11,838 అత్యాచార కేసులు నమోదయ్యాయి. వీటిలో 2024లోనే అత్యధికంగా 2,945 దారుణాలు జరిగాయి. 2020లో 1,934, 2021లో 2,382, 2022లో 2,293, 2023 సంవత్సరంలో 2,284 ఉదంతాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు రాష్ట్రంలో అహపరణ కేసుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. వీటిల్లో 18 ఏళ్లలోపు పిల్లలే ఎక్కువగా ఉండడం ఆందోళనకర పరిణామం. 2024లో 1,525 కిడ్నాప్ కేసులు నమోదవగా మహిళలు, చిన్నారులే 1,122 మంది ఉన్నారు. వీరిలోనూ మైనర్లు 1,251 మంది (82 శాతం) ఉన్నట్లు పోలీసు గణాంకాలు చెబుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో అందే ఫిర్యాదులను పోలీసులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో 90 శాతం పైగా కేసులు పరిష్కారం అవుతున్నాయి.
టీనేజీ ప్రేమలే కారణం..!
టీనేజీ ప్రేమలు అత్యాచార ఘటనలకు ఒక కారణమవుతున్నాయని తెలంగాణ మహిళా భద్రతా విభాగం డీజీపీ షికా గోయల్ తెలిపారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే బాలికలు, యువతులను లక్ష్యంగా చేసుకుంటున్నారని చెప్పారు. ఈ కేసులను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవడంతో నేరం జరిగిన కొద్ది గంటల్లోనే నిందితులను అరెస్టు చేస్తున్నామని పేర్కొన్నారు. ఫిర్యాదు అందిన 8 గంటల్లోపు అరెస్టు చేసిన ఘటనలు 940 ఉన్నట్లు వివరించారు. మైనర్లపై నేరం జరిగినపుడు నిందితులపై పొక్సో కేసులు నమోదు చేసి, నిందితులను త్వరగా అరెస్టు చేసి శిక్ష పడేలా చూస్తున్నామన్నారు. పొక్సో కేసుల్లో బాధితులకు ప్రభుత్వం తరఫున పరిహారంగా రూ.5.42 కోట్లు చెల్లించామన్నారు. అపహరణ కేసుల్లోనూ చాలావరకు టీనేజీ ప్రేమ కథలే ఉంటున్నాయని అధికారులు తెలిపారు.
Updated Date - Jan 01 , 2025 | 04:22 AM