గ్రంథాలయాన్ని ప్రారంభించండి మహాప్రభో..!
ABN, Publish Date - Jan 15 , 2025 | 11:56 PM
లక్షలాది రూపాయలు వెచ్చించి అత్యాధునిక హంగులతో కొత్తూర్‌లో గ్రంథాలయ నూతన భవనాన్ని నిర్మించారు
బిల్లు రాలేదని భవనానికి తాళం వేసిన కాంట్రాక్టర్
అద్దె భవనంలో కొనసాగింపు
బీరువాలకే పరిమితమైన పోటీ పరీక్షల పుస్తకాలు
ఇబ్బందుల్లో యువతీ, యువకులు
కొత్తూర్, జనవరి 15(ఆంధ్రజ్యోతి): లక్షలాది రూపాయలు వెచ్చించి అత్యాధునిక హంగులతో కొత్తూర్‌లో గ్రంథాలయ నూతన భవనాన్ని నిర్మించారు. ఇది పూర్తయ్యి ఏడాది అవుతున్నా ప్రారంభానికి నోచుకోలేదు. బిల్లు రాలేదని సదరు కాంట్రాక్టర్ గ్రంథాలయ భవనానికి తాళం వేసుకొని పత్తా లేకుండా పోయాడు. దేవుడు కరుణించినా పూజారి కరుణించలేడన్న చందంగా తయారైంది గ్రంథాలయ నూతన భవన ప్రారంభం. ఇప్పటికైనా షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చొరవచూపి గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలని పాఠకులు వేడుకుంటున్నారు. గతంలో ఉన్న కొత్తూర్ గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో అత్యాధునిక హంగులతో నిర్మించాలనే ఉద్దేశంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2022 సంవత్సరంలో రూ.75లక్షల నిధులు మంజూరు చేసింది. అప్పటి మంత్రి సబితాఇంద్రారెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌లు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే ఏడాది క్రితమే భవన నిర్మాణం పూర్తయినా ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోలేదు. సదరు కాంట్రాక్టర్‌కు అదనపు బిల్లు రాకపోవడంతో ఏకంగా భవనానికి తాళం వేశాడు. ప్రస్తుతం గ్రంథాలయం అద్దె భవనంలో కొనసాగుతుంది. గ్రంథాలయ భవనానికి రూ.75లక్షలు మంజూరు చేసినా ఆ నిధులు సరిపోలేదు. కాంట్రాక్టర్ తన సొంత డబ్బును వెచ్చించి భవన నిర్మాణం పూర్తి చేశాడు. కాంట్రాక్టర్ ఖర్చు చేసిన డబ్బు ప్రభుత్వం నుంచి రాకపోవడంతో భవనానికి తాళం వేసుకుని వెళ్లిపోయాడు. మూడేళ్ల నుంచి గ్రంథాలయం అద్దె భవనంలో ఇరుకు గదుల్లో కొనసాగుతుండడంతో పాఠకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రంథాలయ నూతన భవనాన్ని ఇటీవల షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పరిశీలించారు. నూతన భవనానికి వేసిన తాళం చూసి గ్రంథపాలకుడు జీవీ శ్రీనివా్‌సరాజును వివరాలు అడిగి తెలుసుకున్నాడు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే నూతన భవనాలు ప్రారంభానికి నోచుకోవడం లేదని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ రావాల్సిన బిల్లును వెంటనే మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
పోటీ పరీక్షల పుస్తకాలు బీరువాలకే పరిమితం
గ్రంథాలయానికి వచ్చిన పోటీ పరీక్షల పుస్తకాలు బీరువాలకే పరిమితమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పలు శాఖాల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తుండడంతో స్థానిక నిరుద్యోగ యువతీ, యువకులు పోటీ పరీక్షలు చదువుకునేందుకు వీలు లేకుండా పోతుంది. అద్దె భవనంలో కొనసాగుతున్న గ్రంథాలయం అరకొర వసతులు ఉండడంతో పాఠకులు వెనుదిరగాల్సి వస్తుంది. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి నూతన గ్రంథాలయాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
గ్రంథాలయాన్ని వెంటనే ప్రారంభించాలి
నూతన గ్రంథాలయ భవన నిర్మాణం పూర్తి చేసుకుని ఏళ్లు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోవడం లేదు. అద్దె భవనంలో కొనసాగుతున్న గ్రంథాలయం అరకొర వసతులు ఉండడంతో పాఠకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగ పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే యువతీ, యువకులకు నిరాశే ఎదురవుతుంది. అధికారులు వెంటనే స్పందించాలి.
కోస్గి శ్రీనివాస్, కౌన్సిలర్, కొత్తూర్ మున్సిపాలిటీ
నెలఖారులోగా ప్రారంభిస్తాం
కొత్తూర్ నూతన గ్రంథాలయ భవనాన్ని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో కలిసి నెలఖారులోగా ప్రారంభిస్తాం. కాంట్రాక్టర్‌కు రావాల్సిన డబ్బును త్వరలో అందజేస్తాం. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తప్పిదం వల్లే నూతన భవనాలు ప్రారంభానికి నోచుకోవడం లేదు. గ్రంథాలయం ప్రారంభించి యువతీ, యువకులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.
ఎల్గుంటి మధుసూదన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
Updated Date - Jan 15 , 2025 | 11:56 PM