పచ్చదనానికి ప్రాధాన్యం
ABN, Publish Date - Jan 07 , 2025 | 11:40 PM
గ్రామాల్లో పచ్చదనమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవానికి గ్రామ పంచాయతీలు సిద్ధమవుతున్నాయి.
గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటడమే లక్ష్యం
వన మహోత్సవానికి సిద్ధమవుతున్న జీపీలు
నర్సరీల్లో బెడ్లు సిద్ధం.. విత్తనాలు విత్తిన సిబ్బంది
చేవెళ్ల, జనవరి 7(ఆంధ్రజ్యోతి) : గ్రామాల్లో పచ్చదనమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవానికి గ్రామ పంచాయతీలు సిద్ధమవుతున్నాయి. వర్షాకాలం వచ్చేలోగా నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా చేవెళ్ల డివిజన్ పరిధిలోని 132 గ్రామ పంచాయతీల్లో కవర్ బ్యాగులను తయారు చేసి మట్టిని నింపి బెడ్డుగా పేర్చి విత్తనాలను విత్తారు. పండ్లు, పూల రకాలతో పాటు బహువీనియా, మందార, మునగ, ఉసిరి, తంగేడు, ఈత, మోదుగ, కరివేపాకు, చింత, ఇప్ప, పూసుగ, సీతాఫలం, జామతో పాటు వివిధ ఇతర రకాల మొక్కల విత్తనాలను నాటారు.
జీపీకి 10 వేల మొక్కలు..
వన మహోత్సవంలో భాగంగా ఈ సంవత్సరం ప్రతీ గ్రామ పంచాయతీలో పది వేల మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. చేవెళ్ల డివిజన్‌లోని చేవెళ్ల, షాబాద్, శంకర్‌పల్లి, మొయినాబాద్ తదితర మండలాల పరిధిలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో పదివేల మొక్కలు పెంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అందుకు అనుగుణంగా బెడ్లను తయారు చేసి మొక్కలను పెంచేందుకు సిద్ధమయ్యారు.
అన్ని నర్సరీల్లో విత్తనాలు నాటాం
చేవెళ్ల మండలంలోని 37 గ్రామ పంచాయతీల్లో పది వేల చొప్పున మొక్కలు పెంచేందుకుగాను నర్సరీల్లో విత్తనాలు నాటాం. మొక్క లు పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ప్రతీ మొక్కను కాపాడతాం. వన మహోత్సవం నాటికి నర్సరీల్లో అన్ని మొక్కలను అందుబాటులో ఉంచుతాం.
- విఠలేశ్వర్, చేవెళ్ల, ఎంపీవో
Updated Date - Jan 07 , 2025 | 11:40 PM