మరింత చేరువగా సహకారం
ABN, Publish Date - Jan 19 , 2025 | 11:28 PM
వ్యవసాయ పెట్టుబడికి రుణాలు, విత్తనాలు, ఎరువులు అందించి సహకార సంఘాలు రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి.
బషీరాబాద్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ పెట్టుబడికి రుణాలు, విత్తనాలు, ఎరువులు అందించి సహకార సంఘాలు రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ప్రతీ పంచాయతీకి ఒకప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఉండాలని, బహుళ సేవలు అందించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే మండలంలో నావాంద్గీ సహకార సంఘంతో పాటు మరో సంఘం కొత్తగా ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో కాశీంపూర్‌లో కొత్తగా సహకార సంఘం ఏర్పాటుకు పాలకవర్గం తీర్మానించి ప్రభుత్వానికి ప్రతిపాదించారు.
చేరువకానున్న సేవలు
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు మండలానికి ఒకటి ఉండటంతో రైతులకు దూరంగా ఉన్నాయి. ప్రస్తుతం నవాంద్గీ పీఏసీఎ్‌సలో 4,106 మంది సభ్యులు ఉండగా, 1300 మంది రైతుల వరకు రుణాలు తీసుకున్నారు. దీంతో రుణాలు, విత్తనాలు, ఎరువుల కోసం రైతులు దూరప్రయాణం చేసి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా కొత్తగా ఏర్పాటు కాబోతున్న సంఘంతో రైతులకు ఆ ఇక్కట్లు తొలగనున్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే కాశీంపూర్ సహకార సంఘం పరిధిలోకి నీళ్లపల్లి, జలాల్‌పూర్, ఇస్మాయిల్‌పూర్, పర్వత్‌పల్లి, మర్పల్లి, నవాల్గ, భోజ్యానాయక్‌తండా, హంక్యానాయక్‌తండా, బాబునాయక్‌తండా, గొట్టిగఖుర్దు, గొట్టిగకలాన్, కంసాన్‌పల్లి(ఎం), కాశీంపూర్, మల్కాన్‌గిరి, బద్లాపూర్, బద్లాపూర్‌తండా, కుప్పన్‌కోట్, రెడ్డిఘణాపూర్, మంతట్టి తదితర గ్రామాలున్నాయి. అయితే కొత్తగా కాశీంపూర్‌లో సంఘం ఏర్పాటు కానుండటంతో చుట్టుపక్కల గ్రామాల రైతులకు సేవలు మరింత చేరువకానున్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే కొత్త సంఘంలోకి ఆయా గ్రామాల పరిధిలోని రైతుల ఖాతాలను విభజించనున్నారు. ఈ కొత్త సంఘాన్ని అప్పట్లో కొనసాగిన పాత భవనంలో తాత్కాలికంగా కొనసాగించనున్నట్లు సమాచారం. ఈ విషయమై నవాంద్గీ పీఏసీఎస్ చైర్మన్ ఎ.వెంకట్‌రాంరెడ్డిని వివరణ కోరగా ప్రభుత్వ నిర్ణయం మేరకు కొత్త సంఘం ఏర్పాటు కాబోతున్నదని తెలిపారు. ఈ విషయమై ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆదేశాల మేరకు కొత్త సంఘం కోసం ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు.
Updated Date - Jan 19 , 2025 | 11:28 PM