మృతదేహంతో పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన
ABN, Publish Date - Feb 21 , 2025 | 12:36 AM
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్‌స్టేషన్ ఎదుట మూడు గంటల పాటు ఆందోళనకు దిగారు.
నిడమనూరు, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్‌స్టేషన్ ఎదుట మూడు గంటల పాటు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలకేంద్రంలో గురువారం జరిగింది. మండలంలోని గుంటుగూడెం గ్రామానికి చెందిన గోపిశెట్టి శ్రీనయ్య(57) గత నెల 2వ తేదీన మండలకేంద్రానికి వచ్చి పని ముగించుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి తిరుగుపయనమయ్యాడు.గుంటుకగూడెం-ముప్పారం రోడ్డులో మూలమలుపు వద్ద ఎదురుగా వేగంగా వస్తున్న సీబీజడ్ వాహనం ప్రమాదవశాత్తు శ్రీనయ్యను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం తొలుత మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించి, మెరుగైన వైద్యంకోసం అక్కడి నుంచి హైదరాబాద్‌లోని కాచిగూడలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నెలన్నర రోజులకు పైగా చికిత్సపొందుతూ శ్రీనయ్య గురువారం మృతిచెందాడు. ఆస్పత్రిలో శ్రీనయ్య చికిత్స కోసం కుటుంబ సభ్యులు పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. ప్రమాదానికి కారణమైన మండలంలోని వడ్డెరగూడెం గ్రామానికి చెందిన గోగుల మహేష్‌ను పిలిపించి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు, కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్ ఎదుట సుమారు మూడు గంటల పాటు ఆందోళన చేశారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పిలిపించి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని ఎస్‌ఐ గోపాల్‌రావు చెబుతున్నా ఆందోళనకారులు ససేమిరా అంటూ ఆందోళన కొనసాగించారు. దీంతో సంఘటన గురించి ఎస్‌ఐ ఉన్నతాధికారులకు వివరించడంతో హాలియా సీఐ జనార్ధన్‌గౌడ్ సంఘటనాస్థలానికి వచ్చి ఆందో ళన చేస్తున్న వారితో మాట్లాడారు. గత నెల 12వ తేదీన శ్రీనయ్య కుమార్తె లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు కూడా నమోదు చేసినట్లు తెలిపారు. ప్రమాదానికి కారణమైన మహేష్‌ను శుక్రవారం స్టేషన్‌కు పిలిపించి బాధితులకు న్యాయం చేస్తామని సీఐ హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు ఆందోళన విరమించారు. అనంతరం పోలీసులు పంచనామా చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆందోళన కార్యక్రమంలో గుంటుకగూడెం మాజీ సర్పంచ్ గుడిసె శంకరయ్య, అక్కి శ్రీనివాస్, కడెం తిరుపతిరావు, గోపిశెట్టి రవి, యాదిగిరి ఉన్నారు.
Updated Date - Feb 21 , 2025 | 12:36 AM