కార్పొరేట్ కళాశాల.. అడ్మిషన్ వల
ABN, Publish Date - Jan 28 , 2025 | 12:19 AM
రెండు నెలల్లో పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలకు రాయనున్నారు. ఫీజులో రాయితీ పేరిట కార్పొరేట్ ఇంటర్ కళాశాలలు ఇప్పుడే అడ్మిషన్ల వేట ప్రారంభించాయి.
‘హలో.. మీ పాప, బాబు పదో తరగతి అయిపోయింది. ఇంటర్‌కు ఏం ప్లాన్ చేస్తున్నారు. మాది కార్పొరేట్ కళాశాల ఐఐటీ మొయిన్స్, జేఈఈలో ఏసీ, నాన్ ఏసీ స్పెషల్ బ్యాచ్‌లు ఉన్నాయి. ఇప్పుడు జాయిన్ చేయిస్తే ఫీజులో రాయితీ ఇస్తాం’ అంటూ ఇంటర్ కార్పొరేట్ కళాశాలల ప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నారు.
- (ఆంధ్రజ్యోతి,భువనగిరి టౌన్)
రెండు నెలల్లో పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలకు రాయనున్నారు. ఫీజులో రాయితీ పేరిట కార్పొరేట్ ఇంటర్ కళాశాలలు ఇప్పుడే అడ్మిషన్ల వేట ప్రారంభించాయి. 2025-26 విద్యా సంవత్సరానికి ఇం టర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు కార్పొరేట్ కళాశాలలు అప్పుడే తెరలేపాయి. పదో తరగతి పరీక్షలు ముగిసి ఇంట ర్ ప్రవేశాల ప్రారంభం మధ్య సు మారు రెండు నెలల గడువు ఉంది. ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు అధికారికంగా సుమారు నాలుగునెలల వ్యవది ఉంది. కానీ పిల్లల ఉజ్వల భ విష్యత్తును ఆశిస్తున్న తల్లిదండ్రుల బలహీనతను, ముందస్తుగా అడ్మిషన్ తీసుకుంటే ఫీజులో రాయితీ, మాసంస్థల్లోనే టాప్ క్యాంప్‌సలలో ప్రవేశాలంటూ ఆయా కళాశాలల పీఆర్‌వోలు, మధ్యవర్తులు 10వ తరగతి పిల్లల తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు సేకరిస్తున్నారు. దీంతో పలువురు రిజిస్ట్రేసన్ పేరిట రూ.10 వేలు చెల్లిస్తుండగా ఆర్థిక స్థోమత ఉన్న కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు ఏకంగా ట్యూషన్ ఫీజు మొత్తాన్ని చెల్లిస్తున్నారు.
హైదరాబాద్ కార్పొరేట్ కళాశాలల అడ్మిషన్ల వేట
తమ పిల్లలు త్వరగా అధిక వేతనాలతో ఉన్నత స్థాయిలో స్థిరపడా లని తల్లిదండ్రులు కోరుకోవడం సహజమే. విద్యార్థి భవిష్యత్తును నిర్ధేషించడంలో ఇంటర్మీడియేట్‌ది కీలకం. ఇంటర్‌లో ఎంచుకునే కోర్సులపైనే భవిష్యత్తులో స్థిరపడే రంగం సుమారుగా ఖరారు అవుతుంది. డిమాండ్‌తో కూడిన వృత్తి విద్యా కోర్సులుగా ఐఐటీ, ఎన్‌ఐటీ, జేఈఈ, మెడిసిన్, ఇంజనీరింగ్, ఎంసెట్ ఉన్నాయి. వీటన్నిటిలో ప్రవేశాలకు ఇంటర్ తర్వాత ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇదే అదనుగా భవిష్యత్తులో విద్యార్థులు చేరే కోర్సులకు ఇంటర్ ప్రథమ సంవత్సరం మొదటి రోజునుంచే కోచింగ్ ప్రారంభి స్తామని, ఆయా కోర్సు ల్లో తమ సంస్థ కళాశాలల విద్యార్థులు సాధించిన విజయాల కరపత్రాలను చూపుతూ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ తదితర జిల్లాలకు చెందిన కార్పొరేట్ కళాశాలల ప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులతో అడ్మిషన్లు చేయించుకుంటున్నారు. అప్పటికప్పుడు ఒప్పు కోని విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ విసిగిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇంటర్మీడియట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాతే ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కావల్సి ఉంటుంది. చదివే కోర్సులు, చేరే కళాశాలలపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు స్వేచ్ఛ, హక్కులు ఉంటాయి. కార్పొరేట్ కళాశాలల ముందస్తు అడ్మిషన్లు నియంత్రించడంలో అధికారులు అలసత్వం చూపుతున్నారని పలువురు పేర్కొంటున్నారు.
పాఠశాలలనుంచే ఫోన్ నెంబర్ల సేకరణ
పదో తరగతి చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లను కార్పొరేట్ కళాశాలల పీఆర్‌వోలు ఆయా పాఠశాలల నుంచే సేకరిస్తున్నారు. ఇందుకు యాజమాన్యాలకు, ఉపాధ్యాయులకు తృణమో ఫనమో చెల్లించుకుంటున్నట్లు ప్రచారంలో ఉంది. మెరిట్ విద్యార్థులు, ఆర్థిక స్థోమత కలిగిన తల్లిదండ్రుల వివరాలను ప్రత్యేకంగా అడిగి తెలుసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 44,530 మంది ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు.
జిల్లా విద్యార్థులు
నల్లగొండ 19,254
సూర్యాపేట 11,912
యాదాద్రి 6,682
మొత్తం 44,530
చర్యలు తీసుకుంటాం
ఇంటర్ ప్రవేశాలపై ముందస్తు ప్రచారం చేసినా, ప్రవేశాలు స్వీకరించిన చర్యలు తీసుకుంటాం. కార్పొరేట్ కళాశాలల మాయాజాలంలో తల్లిదండ్రులు పడొ ద్దు. ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్యా బోధ న, మౌలిక వసతులు లభిస్తాయి. ప్రభుత్వ కళాశాల లో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిర పడుతున్నారనే వాస్తవాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి.
- రమణి, యాదాద్రి జిల్లా ఇంటర్ నోడల్ అధికారి.
ఫోన్ నెంబర్లు ఇవ్వొద్దు
పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు, వివరాలు పాఠశాలల యాజమాన్యాలు కార్పొరేట్ కళాశాలలకు ఇవ్వొద్దు. ఇంటర్మిడియట్‌లో చేరికలపై ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడి చేయొద్దు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తుపై స్వచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలి.
- సత్యనారాయణ, యాదాద్రి భువనగిరి జిల్లా డీఈవో.
Updated Date - Jan 28 , 2025 | 12:19 AM