ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బీజేపీలో సంస్థాగత సందడి

ABN, Publish Date - Jan 09 , 2025 | 01:59 AM

భారతీయ జనతా పార్టీలో సంస్థాగత ఎన్నికల సందడి నెలకొన్నది. సభ్యత్వ నమోదు పూర్తి కావడంతో పాటు బూత్‌, మండల, జిల్లా అధ్యక్షుల నియామకాల కోసం కసరత్తు జరుగుతున్నది. అయితే నేతలందరినీ సమన్వయపరిచి మండల, మున్సిపల్‌, జిల్లా అధ్యక్షులను ఏ విధంగా ఎంపిక చేస్తారనే విషయమై కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొన్నది.

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

భారతీయ జనతా పార్టీలో సంస్థాగత ఎన్నికల సందడి నెలకొన్నది. సభ్యత్వ నమోదు పూర్తి కావడంతో పాటు బూత్‌, మండల, జిల్లా అధ్యక్షుల నియామకాల కోసం కసరత్తు జరుగుతున్నది. అయితే నేతలందరినీ సమన్వయపరిచి మండల, మున్సిపల్‌, జిల్లా అధ్యక్షులను ఏ విధంగా ఎంపిక చేస్తారనే విషయమై కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొన్నది. సంస్థాగత ఎన్నికలు జరిగి మూడేళ్లు గడుస్తుండడంతో కొత్త కమిటీల నియామకాల ప్రక్రియను చేపట్టారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు గెలుపొందగా, ఏప్రిల్‌ నెలలో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో 8 స్థానాల్లో ఎంపీ అభ్యర్థులు గెలుపొందారు. పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గొమాసే శ్రీనివాస్‌ రెండో స్థానంలో ఓట్లు సాధించడం విశేషం. దీంతో ఒకటి, రెండు నెలల్లో జరగనున్న గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు, ఆ తర్వాత సహకార సంఘాల ఎన్నికలు, మున్సిపాలిటీ, మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ భావిస్తున్నది. ఇందుకోసం క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఐదు మాసాల నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. సభ్యత్వ కార్యక్రమం డిసెంబర్‌లో పూర్తికాగా, బూత్‌, గ్రామ కమిటీలు దాదాపుగా పూర్తికావస్తోంది. మండల, జిల్లా కమిటీల అధ్యక్షుల కోసం పార్టీ పరిశీలకులు, జిల్లా ఇన్‌చార్జీలు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన నాయకులను మండల, మున్సిపల్‌ కమిటీ అధ్యక్షులుగా నియమించాలని భావిస్తున్నారు.

ఫ నేతల మధ్య సమన్వయం కరువు..

జిల్లాలో బీజేపీ మరింత బలోపతం కావడానికి అవకాశాలు ఉన్నప్పటికీ, ఆయా నియోజకవర్గాల్లో గ్రూపుల కారణంగా పార్టీ బలోపేతం కావడం లేదనే విమర్శలున్నాయి. పెద్దపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్నది. ఈ రెండు గ్రూపులను సమన్వయం చేయడంలో రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకత్వం విఫలమైంది. ఇటీవల పెద్దపల్లిలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర పరిశీలకులు రాగా, గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గానికి చెందిన నాయకులు కింద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఎన్నోఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తమను పార్టీ జిల్లా అధ్యక్షుడు సునీల్‌రెడ్డి పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేశారు. మంథని నియోజకవర్గం మారుమూల ప్రాంతం కావడంతో అక్కడ వర్గపోరు లేదు. రామగుండం నియోజకవర్గంలోనూ పార్టీ నాయకులంతా ఒక తాటిపైన లేకపోగా, ఎవరికి వారుగా వర్గాలుగా విడిపోయి ఉన్నారు. రాష్ట్ర పార్టీ ఇచ్చే పిలుపు మేరకు పెద్దగా కార్యక్రమాలు జరగడం లేదు. నియోజకవర్గ ఇన్‌చార్జీ కందుల సంధ్యారాణి అడపాదడపా కొన్ని కార్యక్రమాలు చేస్తుండడం పార్టీ శ్రేణులకు కొంత ఊరట కల్పిస్తున్నప్పటికీ, నియోజకవర్గ పరిధిలో పార్టీ నాయకలందరితో సమన్వయంలేని కారణంగా ఎవరికి వారే యమునా తీరేనన్నట్లుగా ఉంది. ఈ ఏడాది జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు నియోజకవర్గ ఇన్‌చార్జీకి పెద్ద సవాల్‌గా మారనున్నాయి. రామగుండం కార్పొరేషన్‌తో పాటు రెండు మండల పరిషత్‌లు ఉన్నాయి. సంధ్యారాణి పాలకుర్తి మండలం నుంచి గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి జడ్పీటీసీగా గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఆశించినప్పటికీ టికెట్‌ రాలేదు. ఆమె బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. పార్టీ సంస్థాగత ఎన్నికల ద్వారా పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నారు. ఈనెల 13వ తేదీలోపు, మండల, మున్సిపల్‌ కమిటీల అధ్యక్షుల నియామకాలు పూర్తి కానున్నాయి. ఒక్కో మండలం నుంచి పరిశీలకులు ముగ్గురు, నలుగురు పేర్లను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర పార్టీకి పంపించనున్నారు. అక్కడ ఫైనల్‌ కానున్నాయి. అలాగే జిల్లా అధ్యక్ష పదవికి ఐదుగురు నాయకుల పేర్లను రాష్ట్ర పార్టీకి పంపిస్తే, అక్కడి నుంచి మూడు పేర్లతో జాతీయ అధ్యక్షుడికి పంపించనున్నారు. అక్కడ జిల్లా అధ్యక్షుడిని ఖరారు చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో మండల, మున్సిపల్‌, జిల్లా కమిటీల అధ్యక్షుల నియామకాలు ఎలా జరగనున్నాయనే అంశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Jan 09 , 2025 | 01:59 AM