ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇంకుతున్న జలం.. ఎండుతున్న పొలం

ABN, Publish Date - Mar 01 , 2025 | 12:10 AM

ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఆదిలోనే చేతికందకుండా పోతోంది. వేసవికి ముందే ఎండలు మండిపోతున్నాయి.

ఎండిపోయిన వరిచేలో పశువులు మేపుతున్న రైతు

ఆందోళనలో అన్నదాతలు

ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఆదిలోనే చేతికందకుండా పోతోంది. వేసవికి ముందే ఎండలు మండిపోతున్నాయి. వేసవి తీవ్రత పెరగకముందే భూగర్భజలం అడుగంటి వరి పంటలు ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితులు అన్నదాతను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో వర్షాధారంగా సాగు చేసిన పంటలు నీరందక ఎండిపోతుండటంతో కొన్నిచోట్ల పశువులకు మేతగా వదిలేస్తున్నారు.

(ఆంధ్రజ్యోతి-చౌటుప్పల్‌)

మునుగోడు నియోజకవర్గంలో వర్షాభావ పరిస్థితులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో వర్షాలు పడక చెరువులు, కుంటలు నిండక ఈ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు అలముకున్నాయి. సంస్థాననారాయణపురం మండలంలో 4,800 ఎకరాలు, మర్రిగూడెం మండలంలో 4,624 ఎకరాలు, మునుగోడు మండలంలో 6,471 ఎకరాలు, గట్టుప్పల్‌ మండలంలో 500 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. సాగు ప్రారంభంలో బోర్లన్నీ నిండుగానే పోసినప్పటికీ సుమారు నెల రోజుల నుంచి కొన్ని బోర్లు పూర్తిగా వట్టిపోగా, మరికొన్ని బోర్లు చాలీచాలని నీటిని అందిస్తున్నాయి. నీటి కొరతతో మునుగోడు మండలంలోని ఊకొండి, సింగారం, రత్తుపల్లి, పులిపలుపుల, కాల్వలపల్లి తదితర గ్రామాల్లో వరి పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పటికే ఈ గ్రామాల పరిధిలో 70 ఎకరాల్లో ఎండిపోయినట్లు అధికారికంగా చెబుతున్నా అనధికారికంగా ఈ సంఖ్య ఎక్కువగానే ఉందని రైతులు పేర్కొంటున్నారు. సంస్థాననారాయణపురం మండలంలో సర్వేల్‌, నారాయణపురం, గాంధీనగర్‌తండా, దుబ్బళ్ల తదితర గ్రామాల్లో ఇప్పటికే 50 ఎకరాలకు పైగా పంటలు ఎండినట్లు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పంటనష్టం అంచనా ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. మరికొన్ని ఎకరాల్లో పంటలు నీరు లేక తడారిపోతున్నాయి. గత రెండేళ్లలో ఆయా ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదవడంతోనే ఇలాంటి దుర్భిక్ష పరిస్థితులు నెలకొంటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాటుదశలో అధికంగా నీళ్లు పోసిన బోర్లు గత నెల రోజులుగా చుక్క నీరు పోయడం లేదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి సాగుచేసిన పంటలు కళ్ల ముందే ఎండిపోతుంటే రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మరికొందరు రైతులు తప్పని పరిస్థితుల్లో ఎండిపోయిన పంట చేలలో పశువులను మేపుతున్నారు. నీరు లేక పంటలు ఎండిపోయిన తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

Updated Date - Mar 01 , 2025 | 12:10 AM