ఆధ్యాత్మికం..ఆనందదాయకం
ABN, Publish Date - Feb 20 , 2025 | 12:22 AM
ఆధ్యాత్మికం..ఆనంద దాయకమని పలువురు అన్నారు.
భువనగిరి టౌన, భువనగిరి రూరల్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మికం..ఆనంద దాయకమని పలువురు అన్నారు. బుధవారం జిల్లాలోని పలుచోట్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. రమణేశ్వరంలో శివలింగాల ప్రతిష్ఠ నిర్వహించగా, స్వర్ణగిరిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. పచ్చలకట్ట సోమేశ్వరాలయంలో చండీ హోమం నిర్వహించారు. పోచంపల్లిలో శివస్వాములు ఇరుముడితో శ్రీశైలం బయలుదేరారు. బీబీనగర్ మండలం రహీంఖానపేటలో శివాలయ పునఃప్రతిష్ఠాపన నిర్వహించారు. వలిగొండ మండలం గొల్నేపల్లిలో నాభిశిల ప్రతిష్ఠ, ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరిలో శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు బుధశారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 19 నుంచి 28 వరకు 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు సాగనున్నాయి. 23న ఎదుర్కోళ్లు, 24న శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం, 27న దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. మిగతా రోజులలో కూడా విశిష్ట వేడుకలు జరుపనున్నారు. ఇందు కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయన నిర్వాహకులు తెలిపారు. మొదటి రోజున నిత్య పూజలు, సేవలతో పాటు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మృత్స్యంగ్రహణంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. మొదటి రోజున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే బ్రహ్మోత్సవాల తొలి రోజున శ్రీవారి పాదాలను సూర్యకిరణాలు తాకడాన్ని భక్తులు విశిష్టంగా పేర్కొంటూ పూజలు చేశారు.
పచ్చలకట్ట సోమేశ్వరాలయంలో చండీహోమం
లోక కల్యాణార్థం, భువనగిరి పట్టణ సుభిక్షం లక్ష్యంగా స్థానిక శ్రీ పచ్చలకట్ట సోమేశ్వరాలయంలో బుధవారం చంఢీ హోమం నిర్వహించారు. కర్ణాటకలోని శృంగేరీపీఠం వేదపండితుల పర్యవేక్షణలో యాగం కొనసాగింది. ప్రత్యేక పూజలు నిర్వహించి భజనలు చేసి అన్న ప్రసాద వితరణ జరిపారు. ఆలయ కమిటీ చైర్మన కొల్లూరి రాజు, యాగం నిర్వాహకులు జాలిగం మౌనిక, విఘ్నేష్ పాల్గొన్నారు.
భగవంతుడిని పూజిస్తే సకల శుభాలు
భక్తితో భగవంతుడిని పూజిస్తే సకల శుభాలు కలగడంతో పాటు ఆరోగ్యమైన జీవితాన్ని పొందవచ్చునని సిద్దగురు రమణానంద మహర్షి ఉద్బోదించారు. భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి శివారులోని రమణేశ్వరంలో శివలింగాలు, గణపతి విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమాలను భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా చేపట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిపారు.
Updated Date - Feb 20 , 2025 | 12:22 AM