‘నేతన్న పొదుపు’ను సద్వినియోగం చేసుకోవాలి
ABN, Publish Date - Feb 09 , 2025 | 12:04 AM
భూదానపోచంపల్లి, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి) : చేనేత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న తెలంగాణ నేతన్న పొదుపు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చేనేత, జౌళి శాఖ రీజినల్ డిప్యుటీ డైరెక్టర్ పద్మ అన్నారు.
భూదానపోచంపల్లి, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి) : చేనేత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న తెలంగాణ నేతన్న పొదుపు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చేనేత, జౌళి శాఖ రీజినల్ డిప్యుటీ డైరెక్టర్ పద్మ అన్నారు. శనివారం భూదానపోచంపల్లి చేనేత సహకార సంఘం డైహౌజ్‌లో జిల్లా చేనేత, జౌళీ శాఖ ఆద్వర్యంలో నేతన్న పొదుపు పథకంపై కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు చేనేత కార్మికులతోపాటు వివిధ చేనేత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ తెలంగాణ నేతన్న పొదుపు పథకం కోసం ఈనెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. గతంలో అనుబంధ కార్మికులు ఇద్దరు ఉంటే ఈసారి ఒక్కరినే ఈ పథకంలో అర్హులుగా పొందుపరిచినట్లు వివరించారు. మగ్గం నేసే కార్మికులు రూ. 1200, అనుబంధ కార్మికుడు రూ.600 చొప్పున పొదుపు పథకంలో జమ చేసుకునేందుకు వీలుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 7500 జియోట్యాగ్ కలిగిన మగ్గాలున్నాయని అన్నారు. జియో ట్యాగ్ కలిగిన మగ్గాలపై కార్మికుడు నిరంతరం పనిచేస్తుంటేనే పొదుపు పథకానికి అర్హుడని తెలిపారు. పథకం ప్రారంభమైన నేపథ్యంలో మొదటి దశలో జిల్లా యంత్రాంగం ఎంక్వైరీ నిర్వహించి మరొకసారి సెంట్రల్ టీం ఎంక్వైరీ చేసిన తర్వాత అర్హులైన కార్మికులకు మాత్రమే ఈ పథకంలోకి ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ పథకంలో అర్హులుగా కావాలంటే నిరంతరం చేనేత పని చేస్తూ ఉండాలని తెలిపారు. కాగా, మార్చి నెల వరకు ఎంక్వైరీని పూర్తి చేసి అనంతరం ఆర్డీ 2 అకౌంట్‌ని ప్రభుత్వం ప్రారంభించి వాటిలో పొదుపును జమ చేస్తుందన్నారు. జియోట్యాగ్ లేని కార్మికులు దరఖాస్తు చేసుకున్న వారికి జియో ట్యాగ్ అందిస్తామని, ట్యాగ్ వచ్చిన తర్వాత వారిని కూడా ఈ పథకంలో భాగస్వాములను చేస్తామని అన్నారు. గతంలో మూడేళ్ల కాలపరిమితి ఉన్న ఈ పథకం కార్మికులు కోరి న విధంగా రెండు సంవత్సరాల కాలపరిమితి మాత్రమే ఉం టుందన్నారు. నిజమైన కార్మికుడికి లబ్ది చేకూరే విధంగా చేనేత రంగాన్ని పరిరక్షించే విధంగా నియమ నిబంధనలు రూపొందించారని తెలిపారు. అర్హులైన చేనేత కార్మికులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సదస్సులో డీవో శ్రీనివాసరావు, ఏడీవో బాల్‌మోహనరెడ్డి, చేనేత సహకార సంఘం మేనేజర్ రుద్ర ఆంజనేయులు, చేనేత సంఘాల ప్రతినిధులు భారత లవకుమార్, అంకం పాండు, చింతకింది రమేష్, భారత భూషణ్, కర్నాటి పురుషోత్తం పాల్గొన్నారు.
Updated Date - Feb 09 , 2025 | 12:04 AM