ఏడాదిగా నిర్లక్ష్యం
ABN, Publish Date - Jan 28 , 2025 | 12:37 AM
మరమ్మతుల్లో అధికారులు చూపిన అలసత్వం కారణంగా తేలిక పాటి పనులు భారీ పనులకు కారణమయ్యాయి.
గోదావరి జలాల పైప్‌లైనకు లీకేజీ
వృథాగా పారుతున్న రక్షిత జలాలు
పోచంపల్లి మార్గంలో కలుషిత జలాల సరఫరా..
మురికి మయమవుతున్న అండర్ పాస్ బ్రిడ్జి
భువనగిరి టౌన, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): మరమ్మతుల్లో అధికారులు చూపిన అలసత్వం కారణంగా తేలిక పాటి పనులు భారీ పనులకు కారణమయ్యాయి. ఏడాదిగా గోదావరి జలాలు లీకేజీ అవుతున్నా నియంత్రణలో మిషన భగీరథ అధికారులు చూపిన జాప్యం కారణంగా భారీగా రక్షిత జలాలు రహదారులపై వృధాగా పారుతున్నాయి. అంతేకాక ప్రజలకు సరఫరా అవుతున్న తాగునీటి జలాల లీకేజీతో నాణ్యతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. మేడ్చల్‌మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా ముగ్దుంపల్లి, జూలూరు వయా తుర్కపల్లి మండలం నుంచి సరఫరా అవుతున్న గోదావరి జలాల పైపులైనకు భువనగిరి పట్టణంలోని బొమ్మాయిపల్లి క్రాస్‌రోడ్డు వద్ద సుమారుగా ఏడాది క్రితం లీకేజీ ఏర్పడింది. మొదట్లో స్వల్పంగా ఉన్న లీకేజీ కాస్త నేడు పరిమితి మించడంతో 24 గంటల పాటు గోదావరి జలాలు రహదారిపై వృఽథాగా పారుతూ సమీపంలోని అండర్‌పాస్ బ్రిడ్జిలోకి చేరుతున్నాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారడంతో పాటు గోదావరి జలాల నాణ్యతపై ప్రజల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఏడాదిగా లీకేజీ
భువనగిరిలోని బొమ్మాయిపల్లి అండర్ పాస్ బ్రిడ్జి వద్ద సుమారు ఏడాది కాలంగా గోదావరి జలాల పైపులైనకు లీకేజీ ఏర్పడింది. లీకేజీ మరమ్మత్తులకు సంబంధిత అధికారులు సాంకేతిక కారణాలు చూపుతూ వాయిదా వేస్తుండడంతో స్వల్ప లీకేజీ కాస్త ఉధృతికి కారణమైంది. శామీర్‌పేట నుంచి వయా భువనగిరి పోచంపల్లి మార్గంలో నీటి సరఫరాను చేసే పైపులైనకు భువనగిరిలోని బొమ్మాయిపల్లి క్రాస్ రోడ్డు వద్ద వాల్వ్ సమస్య ఏర్పడింది. అప్పట్లోనే వాల్వ్ సమస్యను పరిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు చూపిన అలసత్వం కారణంగా భారీ లీకేజీకి కారణమైంది. అయితే అప్పట్లో నిర్మించిన పైప్‌లైన, వాల్వ్‌లకు మరమ్మతులు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ సరిపడే సామగ్రి మార్కెట్‌లో లభించకపోవడం ఇబ్బందిగా మారిందని మిషన భగీరథ అధికారులు అంటున్నారు. అంతేకాక మరమ్మతులు చేపడితే ఆ మార్గంలో సుమారు రెండు రోజుల పాటు నీటి సరఫరాకు ఆటంకం కలుగుతోందని, ఆ కారణంగానే మరమ్మతులు చేపట్టలేకపోతున్నామని మిషన భగీరథ అధికారులు పేర్కొంటుండడం అందరినీ ఆశ్యర్చ పరుస్తోంది. బొమ్మాయిపల్లి క్రాస్ రోడ్డు వద్ద లీకవుతున్న మిషన భగీరథ జలాలు అండర్‌పాస్ బ్రిడి పై భాగం నుంచి లీకవుతూ రోడ్డు మార్గంలోకి చేరుతున్నారు. ఫలితంగా అండర్ పాస్ బ్రిడ్జి ఉనికికే ముప్పుగా మారుతుండడంతో పాటు రహదారి మార్గం బురద మయం అవుతోంది.
మరమ్మతుల్లో నిర్లక్ష్యం
మిషన భగీరథ పథకం ద్వారా సరఫరా అవుతున్న గోదావరి జలాల నాణ్యతపై ప్రజల్లో అపార నమ్మకం ఉంది. పైప్‌లైన నిర్మాణం, నిర్వహణ బాధ్యతను కూడా సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీదే ఉండడంతో ఆ పైపులైన ద్వారా సరఫరా అవుతున్న తాగునీటి నాణ్యతపై ప్రజల్లో నమ్మకం ఉంది. కానీ భువనగిరి బొమ్మాయిపల్లి క్రాస్ రోడ్స్ వద్ద ప్రధాన పైపులైనకు ఏర్పడిన లీకేజీతో బీబీనగర్ మండలం ముగ్ధుంపల్లి, పోచంపల్లి మండలం జూలూరు మార్గంలో సరఫరా అవుతున్న మిషన భగీరథ జలాల నాణ్యతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ఆ ప్రధాన పైపులైన ద్వారా 24 గంటల పాటు గోదావరి జలాలు సరఫరా అవుతుండడంతో వెలుపలి జలాలు, పైపులైనలోకి చేరే అవకాశాలు లేవని మిషన భగీరథ ఏఈ స్వాతి అంటున్నారు. శామీర్‌పేట నుంచి సరఫరా అవుతున్న స్వచ్ఛమైన గోదావరి జలాలు చివరి నల్లా వరకు చేరుతున్నాయని అంటున్నప్పటికీ మరమ్మతులు చేపట్టడంలో చూపుతున్న అలసత్వం కారణంగా గోదావరి జలాల నాణ్యతపై ప్రజల్లో సందేహాలు తలెత్తుతున్నాయి.
ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
బొమ్మాయిపల్లి క్రాస్ రోడ్స్, టీచర్స్ కాలనీ వద్ద ఏడాదిగా మిషన భగీరథ జలాలు లీకవుతున్నాయి. మరమ్మతులపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు, సమాచారం ఇచ్చాం. కానీ స్పందన కరువైంది. ఫలితంగా అండర్ పాస్ బ్రిడ్జి బురదమయం అవుతుండగా, పరిసరాల పరిశుభ్రతకు ఆటంకంగా మారింది. అంతకు మించి ఆ మార్గంలో సరఫరా అయ్యే రక్షిత జలాలు కలుషితం అవడానికి అవకాశం ఏర్పడింది.
-జిట్టా వేణుగోపాల్‌రెడ్డి, 11వ వార్డు తాజా మాజీ మునిసిపల్ కౌన్సిలర్, భువనగిరి
అధికారుల నిర్లక్ష్యం ఫలితమే
భువనగిరి బొమ్మాయిపల్లి క్రాస్ రోడ్స్ వద్ద మిషన భగీరథ పైప్‌లైనకు ఏడాది క్రితం ఏర్పడిన పైపులైనకు మరమ్మతులు చేపట్టడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. ఫలితంగా పోచంపల్లి మార్గంలోని గ్రామాలకు కలుషిత జలాలు సరఫరా అయ్యే అవకాశాలు సుగమమయ్యాయి. మరమ్మతుల కోసం పలు మార్లు వినతులు చేసినప్పటికీ సంబంధిత అధికారుల నుంచి స్పందన కురువైంది. ఇప్పటికైనా లీకేజీలను అరికట్టాలి. లేని పక్షంలో పోచంపల్లి ప్రజలతో కలిసి ఆందోళన చేపడుతాం.
-మాయ కృష్ణ, సీపీఎం భువనగిరి పట్టణ కార్యదర్శి
Updated Date - Jan 28 , 2025 | 12:37 AM