గోదారమ్మ చి‘వరి’కి చేరదాయే!
ABN, Publish Date - Mar 01 , 2025 | 12:40 AM
శ్రీరాంసాగర్ రెండో దశ ఆయకట్టుకు గోదావరి జలాలు అరకొరగా విడుదల కావడంతో యాసంగిలో సాగు చేసిన పొలాలు ఎండిపోతున్నాయి. ప్రాజెక్టుల్లో నీరు సమృద్ధిగా ఉందని భావించి పంటలు సాగు చేసిన రైతుల కు నిరాశే మిగిలింది.
ఎస్సారెస్పీ ఆయకట్టు కింద ఎండుతున్న పొలాలు
సరిపడా నీటిని విడుదల చేయని ప్రభుత్వం
పెట్టుబడి పెట్టి బోరుమంటున్న రైతులు
(ఆంధ్రజ్యోతి, సూర్యాపేట (కలెక్టరేట్): శ్రీరాంసాగర్ రెండో దశ ఆయకట్టుకు గోదావరి జలాలు అరకొరగా విడుదల కావడంతో యాసంగిలో సాగు చేసిన పొలాలు ఎండిపోతున్నాయి. ప్రాజెక్టుల్లో నీరు సమృద్ధిగా ఉందని భావించి పంటలు సాగు చేసిన రైతుల కు నిరాశే మిగిలింది. వేల రూపాయాలు పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తే సాగునీరు రాక పంటలు ఎండిపోయి రైతులు బోరుమంటున్నారు. కొంతమంది రైతులు చేసేది లేక ఎండిన చేలల్లో పశువులను మేపుతున్నారు.
ఎస్సారెస్పీ రెండో దశ ఆయకట్టు కింద సూర్యాపేట జిల్లాలో 2.20లక్షల ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. ఆయకట్టు కింద ఉన్న భూములకు నీరందించేందుకు 69,70,71 డీబీఎం(డిస్ట్రిబ్యూటరీ మేజర్లు)లను ఏర్పాటు చేశారు. అందులో డీబీఎం-69 కింద తిరుమలగిరి, తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలాల పరిధిలో 27 కిలోమీటర్ల మేర కాల్వ విస్తరించి ఉంది. ఈ డీబీఎం కింద సుమారు 60వేలకు పైగా ఎకరాల ఆయకట్టు ఉంది. డీబీఎం-70 నాగారం, తిరుమలగిరి మండలాల పరిధిలో 9కిలోమీటర్ల మేరకాల్వ, సుమారు 7వేలఎకరాల ఆయకట్టు ఉంది. డీబీఎం-71 పరిధిలో తిరుమలగిరి, అర్వపల్లి, నాగా రం, సూర్యాపేట, పెన్‌పహాడ్, ఆత్మకూర్(ఎస్), మునగాల, నడిగూడెం, మోతె మండలాల్లో సుమారు 70 కిలోమీటర్ల మేర కాల్వ విస్తరించి ఉంది. ఈ డీబీఎం కింద అత్యధికంగా 1.50లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.
ఆయకట్టుకు సరిపడా అందని నీరు
శ్రీరాంసాగర్ రెండో దశ ఆయకట్టు కింద ఉన్న భూములకు సరిపడా నీటిని విడుదల చేయడం లేదు. వారబంధీ విధానంలో నీటిని విడుదల చేస్తున్నా అవి చివరి ఆయకట్టు వరకు చేరడం లేదు.విడుదలవుతున్న నీరు కేవలం ప్రధాన కాల్వల్లో మాత్రమే ప్రవహిస్తోంది. ఉపకాల్వల్లో నీరు ప్రవహించే పరిస్థితి లేదు. డీబీ ఎం-69 కింద 28 ఉపకాల్వలు, డీబీఎం-70 కింద 11 ఉప కాల్వలు, డీబీఎం-71 కింద 75 ఉప కాల్వలు ఉన్నాయి. ప్రస్తుతం వస్తున్న గోదావరి జలాలు ఎక్కడా ఉప కాల్వల్లోకి వెళ్లడం లేదు.దీన్ని దృష్టి లో పెట్టుకుని చాలా మంది రైతులు సాగు చేయలేదు. అయితే కేవలం ఆయకట్టు కింద 60వేల ఎకరాల్లోనే పంటలు సాగయ్యా యి.గతంలో రోజుకు 1800 నుంచి 2వేల క్యూసెక్కుల వరకు నీటి ని విడుదల చేసేవారు. దీంతో మూడు, నాలుగు రోజుల్లోనే చివరి ఆయకట్టు వరకు నీరు చేరేది. ఆ ప్రాం త చెరువులు, కుంటల్లోకి నీరు చేరి జల కళను సంతరించుకునేవి. ఇప్పుడు చెరువులు, కుంటలు నీళ్లు లేక ఎండి దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం అధికారులు 1400 క్యూసెక్కులకు మించి నీటిని విడుద ల చేయడం లేదు. దీంతో ఏ డీబీఎంలోనూ చివరి ఆయకట్టుకు సాగునీరు వెళ్లడం లేదు. గోదావరి జలాలు విడుదల చేసి రెండు నెలలు అవుతున్నా నేటికి డీబీఎం-71 పరిధిలోని పెన్‌పహాడ్, మో తె, నడిగూడెం, మునగాల మండలాల చివరి భూములకు నీరు చేరలేదు. అంతేగాక డీబీఎం-71కు పైన ఉన్న సూర్యాపేట, ఆత్మకూర్(ఎస్), అర్వపల్లి మండలాల పరిధిలో కూడా పొలాలు ఎండిపోతున్నాయి.
మరమ్మతులకు నోచని ఉపకాల్వలు
శ్రీరాంసాగర్ రెండోదశ ఉపకాల్వలు 20 ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోవడంలేదు. ఉపకాల్వలు పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి. కాల్వలు పటిష్ఠతను కోల్పోయి అధ్వాన్నంగా మారాయి. తొమ్మిదేళ్ల క్రితం పునర్జీవం పథకం కింద రూ.300కోట్లతో అప్పటి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే పునరుద్ధరణ పనులు నీటిమీది రాతల్లాగే మిగిలాయి. నేటికీ నిధులు మంజూ రు కాలేదు. అర్వపల్లి మండలంలో ఉపకాల్వలు ఎల్-8, ఎల్-16 వరకు ఉపకాల్వలు కంపచెట్లు, మట్టితో పూడిపోయాయి.
ఆయకట్టుపై పట్టింపేదీ?
శ్రీరాంసాగర్ ఆయకట్టుపై ప్రభుత్వానికి పట్టింపు లేకుండా పోయింది. బీఆర్‌ఎస్ పాలనలో ఆయకట్టు చివరి వరకు నీళ్లు వచ్చేలా గతంలో చర్యలు తీసుకుఆన్నరు. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి గోదావరి జలాలు చివరి వరకు చేరాలని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహించి డీబీఎం-71 చివర ఉన్న పెన్‌పహాడ్ మండలం మాచారం గ్రామ శివారులోని చెరువులను నీటితో నింపించారు. కాల్వల్లోకి నీళ్లు విడుదల చేయగానే మొదటగా చివరికి పంపించాలని, ఆయకట్టు చివరి నుంచి మొదటికి నీళ్లు రావాలని అధికారులకు సూచించారు. దీంతో ఆయకట్టు చివరి నుంచి మొదటి వరకు ఉన్న చెరువులను నింపేవారు. దీంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగా, శ్రీరాంసాగర్ నీటి విడుదలపై ప్రజాప్రతినిధులకు, ఆధికారులకు పట్టింపు లేకుండా పోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అర్వపల్లి, మద్దిరాల నూతనకల్, ఆత్మకూర్(ఎస్), పెన్‌పహాడ్, నడిగూడెం, మోతె మండలాల్లో పలువురి రైతుల పొలాలు ఎండిపోయాయి. గోదావరి జలాలు వారబంధీ విధానంలో చివరి వరకు వస్తే వాటి ద్వారా చెరువులు, కుంటలు నింపుకునే అవకాశం ఉంటుంది. దీంతో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. అప్పుడు రైతులు కేవలం కాల్వ నీటిపైనే కాకుండా బోర్లు, బావులు, చెరువుల ఆధారంగా పొలాలను కాపాడుకునే అవకాశాలు ఉన్నాయి.
ఆందోళనలు చేస్తున్న రైతులు
శ్రీరాంసాగర్ ఆయకట్టు చివరి భూములకు నీరందకపోవడంతో పంటలు సాగు చేసిన రైతులు ఆందోళనలు చేస్తున్నారు. నీళ్లు రాక పంటలు ఎండిపోవడంతో చేసేది లేక పంట పొలాల్లోనే నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది రైతులు ఎండిన పొలాల్లో పశువులను మేపుతున్నారు. మరికొందరు రైతులు పంటకు నిప్పు పెట్టి తగలబెడుతున్నారు. రైతుల ఆందోళనలకు పలు రైతు సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రాస్తారోకోలు, కలెక్టరేట్ వద్ద ధర్నాలు జరిగాయి.
పొలం ఎండింది: ధరావత్ లోక, రైతు, చినగారకుంటతండా, పెన్‌పహాడ్ మండలం
శ్రీరాంసాగర్ నీళ్లు వస్తాయని మూడు ఎకరాల్లో వరి సాగు చేశా. నీరు వారబంధీ విధానంలో వచ్చినా పొలం ఎండిపోయేది కాదు. సాగు చేసిన మూడు ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది. చేసేది లేక పశువులను మేపా. మూడు ఎకరాలు సాగు చేసినందుకు లక్ష వరకు ఖర్చు వచ్చింది. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.
రెండు ఎకరాల్లో పొలం ఎండింది: దాసరి సైదులు, ముక్కుడుదేవులపల్లి, ఆత్మకూర్(ఎస్) మండలం
నాకున్న నాలుగెకరాల్లో వరి సాగు చేశా. ఎస్సారెస్పీ నీరు వస్తుందని పంటసాగుచేయగా, నీరందక 2 ఎకరాల పొలం పూర్తిగా ఎండిపోయింది. పొలం ఎండిపోవడంతో రూ.40వేల వరకు పెట్టిన పెట్టుబడి వృథా అయింది. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి.
వారబంధీ విధానంలో నీటిని విడుదల చేస్తున్నాం : రమే్‌షబాబు, నీటిపారుదల శాఖ సీఈ, సూర్యాపేట
ఎస్పారెస్పీ రెండో దశ కింద వారబంధీ విధానంలో నీటిని విడుదల చేస్తున్నాం. మార్చి చివరి వరకు నీటిని విడుదల చేస్తాం. నెలలో 15 రోజులు నీరు విడుదలవుతుంది. రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని ప్రభుత్వం ముందే ప్రకటించింది. అయితే ఆయకట్టు కింద రైతులు ఎక్కువగా వరి సాగు చేశారు. దీంతో నీటి వినియోగం పెరిగి సరిపోవడం లేదు. దీంతో రైతులు సాగు చేసిన పొలాలు ఎండిపోతున్నాయి. చివరి భూములకు నీరందించేందుకు కృషి చేస్తున్నాం.
Updated Date - Mar 01 , 2025 | 12:40 AM