అంగన్‌వాడీ కేంద్రాల్లో పారదర్శకత కోసం
ABN, Publish Date - Jan 09 , 2025 | 12:49 AM
అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫేస్ రికగ్నైజేషన్ (ముఖ కవళికల గుర్తింపు) ద్వారా లబ్ధిదారుల గుర్తింపునకు దశలవారీగా అడుగులుపడుతున్నాయి.
లబ్ధిదారులకు ఫేస్ రికగ్నైజేషన్
మొదటగా టీహెచ్‌ఆర్ లబ్ధిదారులకు
దశల వారీగా అందరికీ
ఉమ్మడి జిల్లాలో 4,203 అంగన్‌వాడీ కేంద్రాలు
(ఆంధ్రజ్యోతి, భువనగిరి టౌన్): అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫేస్ రికగ్నైజేషన్ (ముఖ కవళికల గుర్తింపు) ద్వారా లబ్ధిదారుల గుర్తింపునకు దశలవారీగా అడుగులుపడుతున్నాయి. ఇప్పటికే పోషణ్ అభియాన్ ట్రాకర్ అమలవుతుండగా, ఇందులో అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలు, గర్భిణులు, బాలింతల ఫొటో తీయడం చేస్తున్నారు. అయితే టేక్ హోం రేషన్ (టీహెచ్‌ఆర్) తీసుకెళ్తున్న వారికి మాత్రం ఈ విధానం లేదు. ఈ నేపథ్యంలో టీహెచ్‌ఆర్ లబ్ధిదారులకు ఫేస్ రికగ్నైజేషన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం దశలవారీగా అందరికీ దీన్ని వర్తింపజేయనున్నారు.
గర్భిణులు, బాలింతలు, పిల్లల సంపూర్ణ ఆరోగ్యం కోసం పౌష్ఠికాహారం పంపిణీతో పాటు ప్రీస్కూల్‌గా అంగన్‌వాడీ కేంద్రాలు పని చేస్తున్నాయి. లబ్ధిదారులందరికీ మెనూ ప్రకారం ప్రతి రోజూ ఇక్కడ ఆహార పదార్థాలు అందిస్తారు. పిల్లలకు అక్షరాభ్యాసంతో పాటు ఆటపాటలతో వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. గర్భిణులు, మూడేళ్లు పైబడిన పిల్ల లు ప్రతీ రోజు అంగన్‌వాడీ కేంద్రాలకు వస్తుండగా, బాలింతలు, ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలకు టేక్ హోం రేషన్ (టీహెచ్‌ఆర్) విధానంలో అంగన్‌వాడీ టీచర్లు ఆహార పదార్థాలు ఇంటికి ఇస్తున్నారు. అయితే అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహణ, పౌష్ఠికాహారం పంపిణీలో నిర్లక్ష్యంతో పాటు అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆరు నెలల క్రితం నుంచి ప్రతీ రోజూ ఆయా కేంద్రాలకు హాజరైన పిల్లలు, ఆహార పదార్థాలను తినేందుకు వచ్చే బాలింతలు, గర్భిణుల ఫొటోలను సెల్ ఫోన్ ద్వారా పోషన్ అభియాన్ ట్రాకర్ యాప్‌లో క్యాప్చర్ చేస్తున్నారు.అయితే టీహెచ్‌ఆర్ లబ్ధిదారులకుమాత్రం క్యాప్చ ర్ విధానం లేదు. అంతేగాక పిల్లల్లో శారీరక ఎదుగుదల లోపిస్తున్నట్టు ఇటీవలి రికార్డులు, సర్వేలు పేర్కొనడంతో కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఫేస్ రికగ్నైజేషన్ విధానాన్ని అమల్లో కి తెచ్చింది. ఈమేరకు తొలి దశలో టీహెచ్‌ఆర్ లబ్ధిదారుల జాబితాకు వారి ఫొటోలను ఎ లకా్ట్రనిక్ నో యువర్ కస్టమర్ (ఈ-కేవైసీ) విధానంలో జత చేస్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో ఈ-కేవైసీ నమోదు ప్రారంభమైంది.
ఈ-కేవైసీతో ...
పోషన్ అభియాణ్ ట్రాకర్‌లో అదనపు ఆప్షన్‌గా ప్రవేశపెట్టిన ఈ-కేవైసీతో లబ్ధిదారులకు సక్రమంగా పౌష్ఠికాహారం అంది వారి ఆరోగ్యానికి దోహదపడడంతో పాటు అవకతవకలకు అడ్డుకట్టపడుతుందని అధికారులు భావిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు రాలేని ఏడు నెలల వయసు నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలకు, కేంద్రాలకు రాలేని శారీరక పరిస్థితులు ఉన్న గర్భిణులు, బాలింతలకు ప్రతీ 25 రోజులకు ఒకసారి కోడిగుడ్లు, బాలామృతం, ఇతర ఆహార పదార్థాలు ఇంటికి ఇస్తారు. మిగతా లబ్ధిదారులందరూ పని రోజుల్లో అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చి అన్నంతో పాటు గుడ్లు ఇతర ఆహార పదార్థాలను తినాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే అందరి లబ్ధిదారుల ఆధార్ నెంబర్, ఫొటోలు, ఇతర వివరాలను పోషణ అభియాన్ ట్రాకర్‌లో ఫీడ్ చేశారు. తాజాగా, అమలు చేస్తున్న ఈ-కేవైసీలో టీహెచ్‌ఆర్ లబ్ధిదారుల ఫొటోలను అంగన్‌వాడీ టీచర్లు క్యాప్చర్ చేసిన వెంటనే లబ్ధిదారుడి సెల్ ఫోన్‌కు ఓటీపీ వెళ్తుంది. ఓటీపీని ధ్రువీకరించగానే ఈ-కేవైసీ నమోదు పూర్తవుతుంది. త్వరలోనే ఈ-కేవైసీ నమోదైన వారికి టీహెచ్‌ఆర్ ఇవ్వనున్నారు. ఈ విధానంతో టీహెచ్‌ఆర్ పంపిణీ పారదర్శకంగా, జవాబుదారీతనంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
అవగాహనా లోపం
పోషణ్ అభియాన్ ట్రాకర్ ప్రారంభంలోనే అంగన్‌వాడీ టీచర్లందరికీ ప్రభుత్వం స్మార్ట్ ఫోన్, ప్రత్యేక సిమ్ కార్డు అందజేసింది. అంగన్‌వాడీ కేంద్రం సమగ్ర వివరాలను సెల్ ఫోన్‌లోనే నమో దు చేస్తున్నారు. గతంలో అంగన్‌వాడీ టీచర్లు 14 రికార్డులను రాయాల్సి ఉండే ది. ఇప్పుడు ఆఫ్‌లైన్ పని గణనీయంగా తగ్గి ఆన్‌లైన్ నమోదు పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ-కేవైసీని అమలులోకి తేవడంతో టీహెచ్‌ఆర్ లబ్ధిదారుల ఫేస్ రికగ్నైజేషన్‌ను అంగన్‌వాడీ టీచర్లు ప్రారంభించారు. కానీ, వారికి సూచనలు, సలహాలు మినహా శిక్షణ, అవగాహన కల్పించకపోవడంతో ఈ-కేవైసీ నమోదు ఇబ్బందికరంగా మారుతోంది.
అలాగే పలు ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్య కూడా ఎదురవుతోంది. కానీ, ఈ-కేవైసీ డాటాపై పర్యవేక్షణ పేరుతో అధికారులు చేస్తున్న ఒత్తిడితో అంగన్‌టీచర్లు సతమతమవుతున్నట్టు సమాచారం. ఇప్పటికైనా ఈ-కేవైసీ నమోదుపై శిక్షణ ఇవ్వాలని టీచర్లు కోరుతున్నారు.
ఈ-కేవైసీ నమోదు ప్రారంభించాం: నర్సింహారావు, యాదాద్రి జిల్లా సంక్షేమ అధికారి
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ-కేవైసీ నమోదు ప్రారంభమైంది. ఇప్పటికే ఎంపిక చేసిన సూపర్‌వైజర్లు, టీచర్లకు నమోదుపై అవగాహన కల్పించాం. త్వరలోనే టీచర్లందరికీ ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి అవగాహన కల్పిస్తాం. ఈ-కేవైసీతో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ పారదర్శకంగా ఉంటుంది. లబ్ధిదారులకు సక్రమంగా పౌష్ఠికాహారం అందుతుంది.
Updated Date - Jan 09 , 2025 | 12:49 AM