మళ్లీ గ్రామస్థాయిలో రెవెన్యూ అధికారి
ABN, Publish Date - Jan 05 , 2025 | 01:05 AM
గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణకు రంగం సిద్ధమవుతోంది. రెండున్నరేళ్ల క్రితం అవినీతికి పరాకాష్ఠ ఈ వ్యవస్థేనం టూ వీఆర్వో పోస్టులను గత బీఆర్‌ఎస్ సర్కార్ రద్దు చేసి వీఆర్వోలతోపాటు వీఆర్‌ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది.
నెలాఖరులోగా వీఎల్‌వోలు వచ్చే అవకాశం
వేరే శాఖల్లోకి బదలాయించిన వీఆర్వోలకు ఆప్షన్
వీఆర్‌ఏల వారసులకూ అవకాశమివ్వాలనే సూచనలు
గ్రామానికి కీలకంగా రెవెన్యూ అధికారి
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ) : గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణకు రంగం సిద్ధమవుతోంది. రెండున్నరేళ్ల క్రితం అవినీతికి పరాకాష్ఠ ఈ వ్యవస్థేనం టూ వీఆర్వో పోస్టులను గత బీఆర్‌ఎస్ సర్కార్ రద్దు చేసి వీఆర్వోలతోపాటు వీఆర్‌ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. తాజాగా, భూభారతి బిల్లు ఆమోదం పొందడం, రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను గాడినపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమయిన నేపథ్యంలో గ్రామస్థాయిలో మళ్లీ వీఆర్‌వో (విలేజ్ రెవెన్యూ అధికారి) స్థానంలో గ్రామస్థాయి పాలనాధికారిని, సర్వేయర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోస్టుకు గతంలో పనిచేసిన వీఆర్వోలు, వీఆర్‌ఏలను దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో పలువురు వీఆర్వోలు, వీఆర్‌ఏలు తిరిగి మాతృశాఖకు వచ్చేందుకు సిద్ధమవుతూ దరఖాస్తులను సీసీఎల్‌ఏకు సమర్పించారు. దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే పూర్తవడంతో, జనవరి నెలాఖరు నాటికి ఉద్యోగాలను ఖరారుచేస్తూ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అవినీతి పెరిగిందని, క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారు ల అవసరమేలేదనే అభిప్రాయంతో 2022లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దుచేసింది. అప్పటికే వీఆర్‌వోలుగా, వీఆర్‌ఏలుగా పనిచేస్తున్నవారిని వారి అర్హతల ఆధారంగా ఇతర శాఖలల్లోకి బదలాయించింది. జూనియర్ అసిస్టెంట్లుగా, సీనియర్ అసిస్టెంట్లుగా, అటెండర్లుగా ఆయా శాఖల్లో వీరంతా పనికి అలవాటుపడలేక మానసిక వేదన అనుభవించిన వారు కూడా ఉన్నారు. వీఆర్‌వో అంటే గ్రామంలో కీలకమైన అధికారిగా కేవలం భూముల రికార్డుల నిర్వహణకే పరిమితం కాకుండా, అధికారుల పర్యటనలు, ప్రజాప్రతినిధుల పర్యటనల సందర్భంలో కీలకంగా వ్యవహరించేవారు. అలాంటి కీలకమైన వ్యవస్థను గత ప్రభుత్వం నిందారోపణలతో రద్దుచేసిందనే అభిప్రాయంతో ఉన్న వీఆర్వోలు తా జాగా, ప్రభుత్వం మళ్లీ ఈ వ్యవస్థను పునరుద్ధరిస్తుండడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 73 మండలాలకు 1,138 రెవె న్యూ గ్రామాలున్నాయి. ప్రస్తుతం ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక వీఎల్‌వోను నియమించనున్నారు. రద్దయిన సమయంలో ఉమ్మడి జిలా ్లలో 1,015 మంది వీఆర్వోలు, 341 మంది వీఆర్‌ఏలను ఇతర శాఖలకు బదలాయించారు. వీరందరికీ తాజాగా మళ్లీ రెవెన్యూశాఖలోకి వచ్చేందుకు ఆప్షన్ ఇచ్చారు. వారి విద్యార్హతలు, అనుభవం, వయసు ఆధారంగా దరఖాస్తు చేసుకునేందుకు గత డిసెంబరు 28 వరకు గడువిచ్చారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 900 మంది వరకు పాతవీఆర్వోలు, 300 వరకు వీఆర్‌ఏలు దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం.
గ్రామస్థాయిలో పనిచేసే గ్రామ రెవెన్యూ అధికారులు కీలకమైన బాధ్యతలు నిర్వర్తించేవారు. నిజాం హయాం నుంచి రాష్ట్రంలో ఈ వ్యవస్థ కొనసాగుతూ వచ్చింది. భూరికార్డుల నిర్వహ ణ, గ్రామంలో నిఘా వ్యవస్థతో పాటు, స్వా తంత్ర్యానంతరం భూముల పన్నుల వసూళ్లు, అదేవిధంగా ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రా లు,ఎన్నికల సమయంలో గ్రామాధికారిగా విధు లు నిర్వహించేవారు. అదేవిధంగా ఏదైనా సం ఘటనలు జరిగినప్పుడు క్షేత్రస్థాయి నివేదికలు ఇవ్వడం, ప్రమాదాలు జరిగినప్పుడు ప్రా థమి క సమాచారమివ్వడం, పంచనామాలు నిర్వహించడం, విద్యార్ధులకు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలివ్వడం, నివాస ధ్రువపత్రాలివ్వడం వరకు అదేవిధంగా అధికారులు, ప్రజాప్రతినిధు ల పర్యటనల సందర్భంగా గ్రామంలో ముందస్తు సమాచారం ఇవ్వడం, ఆయా పర్యటనల్లో వారికి సహాయకారిగా ఉండడం వరకు అనేక కీలకమైన విధులను వీఆర్‌వోలు నిర్వహించేవారు. అయితే ఈ వ్యవస్థ 1984నుంచి రాష్ట్రంలో కుదుపులకు లోనవుతూ వస్తోంది. పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దులో భాగంగా 1984లో మొదటిసారి రద్దయింది. ఆతర్వాత 1985లో వీఏవోలను నియమించారు. తదుపరి 1992లో మళ్లీ రెవెన్యూ బాధ్యతలతో విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిని నియమించారు. 2002లో మళ్లీ వీఏవోలను రద్దుచేసి పంచాయతీ కార్యదర్శులను నియమించారు. ఆతర్వాత తిరిగి 2007లో పంచాయతీ కార్యదర్శుల నుంచి రెవెన్యూను విడదీసి మళ్లీ వీఆర్వో వ్యవస్థను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2022లో మళ్లీ వీఆర్వో వ్యవస్థను రద్దు చేశారు. తిరిగి తాజాగా, గ్రామస్థాయి పాలనాధికారి (రెవెన్యూ)ని ప్రవేశపెడుతున్నారు. ఈసారైనా పక్కాగా పొరపాట్లకు ఆస్కారం లేకుండా బలీయమైన వ్యవస్థగా ఏర్పాటు చేయాలని, అవినీతి, అక్రమాలకు పాల్పడితే సర్వీస్ నుంచి రిమూవ్ చేసేలా జీవోకూడా ఇవ్వాలని పలువురు పూర్వ వీఆర్వోలు సూచిస్తున్నారు.
వీఆర్‌ఏల వారసులకు ఉద్యోగాలివ్వాలనే డిమాండ్
వీఆర్‌ఏలకు (గ్రామ రెవెన్యూ సహాయకులు) 61 ఏళ్లు నిండిన వారి వారసులకు అర్హతలకు అనుగుణంగా ఉద్యోగాలివ్వాలనే డిమాండ్ వీఆర్‌ఏల నుంచి వస్తోంది. వారసత్వ ఉద్యోగాల కింద గ్రామసహాయకులు దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. 2020లో సమ్మె సందర్భంగా అప్పటి సీఎం వీఆర్‌ఏలకు పేస్కేల్‌తో పాటు, వారసులకు ఉద్యోగాలిస్తామని ప్రకటించారు. అందుకోసం జీవో 85కూడా విడుదల చేశారు. ఆతర్వాత కాలంలో ఆ వ్యవస్థ రద్దవడం, వేరే శాఖలకు బదలాయించడంతో చెల్లాచెదురైన వీఆర్‌ఏలు వారి డిమాండ్లను బలంగా వినిపించలేకపోయారు. తాజాగా, మళ్లీ రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకుంటున్న నేపథ్యంలో జీవో 85 అమలు చేయాలని కోరుతున్నారు. వారసులకు అర్హతల ప్రాతిపదికన వీఆర్వో నుంచి సీనియర్ అసిస్టెంట్ వరకు నియమించాలని కోరుతున్నారు. ఇప్పటికే రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ధనసరి సీతక్కను సైతం కలిసి ఈమేరకు విన్నవించారు. వీఆర్‌ఏల డిమాండ్‌ను సానుకూలంగా పరిష్కరించి వారసులకు ఉద్యోగాలివ్వాలని కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 341 మంది వారసత్వ వీఆర్‌ఏలు విధులు నిర్వర్తిస్తుండగా, ఈ జీవో అమలైతే వీరికి పెద్ద ఉపశమనం కలగనుంది.
రెవెన్యూ అధికారిని నియమించాలనే నిర్ణయం హర్షనీయం : రంగారావు, నల్లగొండ జిల్లా వీఆర్వోల సంఘం మాజీ అధ్యక్షుడు
గ్రామస్థాయిలో రెవెన్యూ శాఖను మళ్లీ పునరుద్ధరించడం హర్షనీయం. గ్రామస్థాయిలో పనిచేసే రెవెన్యూ అఽధికారి ప్రభుత్వానికి ప్రతినిధిగా అనేక పనులు నిర్వహించేవారు. పొరపాట్లు, తప్పిదాలు జరిగితే సరిచేసే యంత్రాంగాన్ని నియమించాలి. తప్పులకుపాల్పడితే కఠినశిక్షలు వేయాలే తప్ప వ్యవస్థను రద్దుచేయడం సరికాదు. తాజాగా, ప్రభుత్వం మళ్లీ వీఆర్వో వ్యవస్థను ఏదో రూపంలో ప్రవేశపెట్టాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నాం.
గ్రామాధికారి ప్రభుత్వానికి వెన్నుముక
షేక్ చాంద్‌పాషా, నల్లగొండ జిల్లా వీఆర్వోల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి (4బ్యూరో 2)
గ్రామ పాలనాధికారి వ్యవస్థను పునరుద్ధరిస్తూ, వీఆర్వోలను తిరిగి ఆ పోస్టుల్లో నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషదాయకం. గ్రామాధికారిగా వ్యవహరించే వీఆర్వోలే ప్రభుత్వానికి వెన్నుముక. కీలకమైన బాధ్యతలు వీరు నిర్వర్తించాల్సి ఉంటుంది. గ్రామంలో అన్నింటికీ జవాబుదారీగా ఉండే ఈ అధికారి వ్యవస్థను రద్దుచేస్తే పాలనాపరంగా చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వీటిని అనుభవంలోకి తీసుకున్నాకే ప్రభుత్వం మళ్లీ ఈ వ్యవస్థని ప్రవేశపెడుతోంది. ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంచేందుకు, అవినీతికి పాల్పడకుండా ఉండేందుకు కఠినమైన శిక్షలుండేలా చూడాలే తప్ప వ్యవస్థను రద్దు చేయడం సరికాదు. పునరుద్ధరణ ద్వారా రైతులకు, గ్రామస్థులకే కాదు అఽధికారులకు సైతం ఉపయుక్తంగా ఉంటుంది.
Updated Date - Jan 05 , 2025 | 01:05 AM