విలీనం.. సంపూర్ణం
ABN, Publish Date - Jan 19 , 2025 | 01:56 AM
కరీంనగర్ కార్పొరేషన్‌లో కొత్తపల్లి మున్సిపాలిటీతోపాటు చింతకుంట, మల్కాపూర్, లక్ష్మీపూర్, బొమ్మకల్, దుర్శేడ్, గోపాల్‌పూర్ గ్రామాలను విలీనం చేస్తూ రాష్ట ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. విలీన ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలంటూ ఆయా గ్రామాల ప్రజలు, నగరపాలక సంస్థ పాలకవర్గ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేస్తుందని అనుకున్నారు.
- గెజిట్ విడుదలతో పెరిగిన కార్పొరేషన్ పరిధి
- 66కు చేరిన డివిజన్ల సంఖ్య
కరీంనగర్ టౌన్, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ కార్పొరేషన్‌లో కొత్తపల్లి మున్సిపాలిటీతోపాటు చింతకుంట, మల్కాపూర్, లక్ష్మీపూర్, బొమ్మకల్, దుర్శేడ్, గోపాల్‌పూర్ గ్రామాలను విలీనం చేస్తూ రాష్ట ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. విలీన ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలంటూ ఆయా గ్రామాల ప్రజలు, నగరపాలక సంస్థ పాలకవర్గ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేస్తుందని అనుకున్నారు. గెజిట్ విడుదలతో అన్ని సందేహాలు తొలగాయి. గత ఏడాది జనవరి 31తో గ్రామ పంచాయతీల పాలకవర్గ పదవీ కాలం ముగిసింది. ప్రత్యేకాధికారులను నియమించిన ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదు. జనవరి చివరివారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ‘స్థానిక సంస్థల’ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఆ తర్వాత గ్రామపంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో విలీన గ్రామాల్లో కూడా ప్రాదేశిక, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వివిధ పార్టీల నాయకులు సన్నద్దమయ్యారు. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లో గ్రామాలను విలీనం చేయడంతో పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికలకు సిద్ధమవుతున్న నేతలు ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు.
ఫ మారనున్న డివిజన్ల ముఖచిత్రం... రిజర్వేషన్లు
కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధి పెరుగడంతో డివిజన్ల సంఖ్య 60 నుంచి 66 వరకు పెంచుతూ గెజిట్ జారీ అయింది. దీంతో డివిజన్ల ముఖ చిత్రంతోపాటు రిజర్వేషన్లు మారే అవకాశాలుంటాయని భావిస్తున్నారు. డివిజన్ల పరిధి, రిజర్వేషన్లు ఎలా ఉంటాయో తెలియక ప్రస్తుత కార్పొరేటర్లతోపాటు ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న నేతలు కూడా అయోమయానికి గురవుతున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఐదేళ్ల క్రితం కొత్తపల్లి మేజర్ గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయడంతో పట్టణీకరణ వేగంగా జరుగుతుందని అంతా భావించారు. రాజకీయనాయకులు కూడా తొలిసారి పాలకవర్గంలో అడుగుపెట్టుందుకు ఉత్సాహం చూపారు. మొదటిసారి పాలకవర్గసభ్యులు రెండోసారి పోటీచేసేందుకు ఇప్పటికే రాజకీయపావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తపల్లి మున్సిపాలిటీని కరీంనగర్ కార్పొరేషన్‌లో విలీనం చేయడం అక్కడి నేతలకు మింగుడుపడటం లేదు. కరీంనగర్ అర్బన్ ఏరియాను మరింత పెంచుతూ గ్రేటర్ దిశగా మార్చే ఆలోచనలో ప్రభుత్వం విలీనం నిర్ణయం తీసుకుందని, దీనితో మరింత వేగంగా అభివృద్ధి జరుగుతుందని అధికారపార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఫ విలీన గ్రామాల్లో వ్యతిరేకత
ఐదేళ్ల క్రితం విలీనం చేసిన ఎనిమిది గ్రామాల్లో ఇప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించలేదు. గ్రామపంచాయతీలుగా ఉన్నప్పుడే బాగుండేదని అక్కడి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మరో ఆరు గ్రామాలను విలీనం చేయడంతో పన్నుల భారం మోపడం తప్పా వారికి ఒరిగేదేమి ఉండదని అక్కడి ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శివారుకాలనీల్లో ఇప్పటికీ మౌలిక వసతులు లేవు. నగరపాలక సంస్థలో ఉన్న అరకొర నిధులతో అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నామని, ప్రభుత్వం విలీన గ్రామాలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని ఇప్పటికే మేయర్ యాదగిరి సునీల్‌రావు ప్రభుత్వాన్ని కోరారు. గెజిట్ విడుదలవడంతో కరీంనగర్‌తోపాటు విలీన గ్రామాల్లో రాజకీయ, అభివృద్ధి, రిజర్వేషన్లు, ఎన్నికల వంటి అంశాలపై ఆసక్తికర చర్చ మొదలైంది.
Updated Date - Jan 19 , 2025 | 01:56 AM