ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీనాక్షమ్మా.. ఇటు చూడమ్మా

ABN, Publish Date - Mar 08 , 2025 | 11:01 PM

కాంగ్రెస్‌ పార్టీని గాడిలో పెట్టి.. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో సాధించిన విజయపరంపరను స్థానిక సంస్థల్లోనూ కొనసాగించాలనే ఉద్దేశంతో ఆ పార్టీ కొత్తగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా మీనాక్షి నటరాజన్‌ను నియమించింది. ఆమె రావడం రావడమే..

కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు.. అనుభవరాహిత్యం

ఏడాది గడిచినా వాస్తవ పరిస్థితిని గుర్తించని పలువురు ఎమ్మెల్యేలు

కేడర్‌ విస్తరణ.. పార్టీ బలోపేతం చేయకుండా మాజీల మాదిరిగా వ్యవహారం

పాత- కొత్త నాయకుల మధ్య కొనసాగుతున్న విభేదాలు.. స్థానికం ముంగిట ఆందోళన

పట్టణాల్లో ఆర్భాటపు ప్రదర్శనలకు అధిక ప్రాధాన్యం

జిల్లా అధ్యక్షుల ఎంపిక పెండింగ్‌.. మండల, బూత్‌స్థాయి విస్తరణ ఏదీ?

మహబూబ్‌నగర్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కాంగ్రెస్‌ పార్టీని గాడిలో పెట్టి.. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో సాధించిన విజయపరంపరను స్థానిక సంస్థల్లోనూ కొనసాగించాలనే ఉద్దేశంతో ఆ పార్టీ కొత్తగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా మీనాక్షి నటరాజన్‌ను నియమించింది. ఆమె రావడం రావడమే.. నిత్యం పార్టీ సమీక్షలు నిర్వహిస్తున్నారు. పలు జిల్లాల వారీగా కూడా పార్టీ పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటివరకు కొన్ని జిల్లాల సమావేశాలు పూర్తికాగా, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాపై కూడా దృష్టి సారించాలని కార్యకర్తలు కోరుతున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 14 స్థానాలకు గాను 12 స్థానాల్లో ప్రజలు కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో రెండు స్థానాల్లో ఒక స్థానం కట్టబెట్టారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం అంత సులభంగా విజయం అందించే అవకాశాలు లేవని కొందరు బాహాటంగానే చెబుతున్నారు. సాధారణంగా కాంగ్రె్‌సలో అతి స్వేచ్ఛ ఉంటుంది. ఈ కారణంతో అంతర్గత కుమ్ములాటలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కానీ పార్టీ పైన ఒక ఆదేశం ఇస్తే.. అది కింది వరకు అమలైనప్పుడు మాత్రమే కేడర్‌లో భరోసా ఏర్పడుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వారిలో మెజారిటీ కొత్తవారే. దాదాపు 8 నియోజకవర్గాల్లో మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ఉన్నారు. అయితే ఎమ్మెల్యేలుగా వారి నియోజకవర్గాలకు కావాల్సిన పనులు, మంజూరు చేసుకోవాల్సిన నిధులపై ఫోకస్‌ పెడుతున్నప్పటికీ.. కేడర్‌ విస్తరణ, పార్టీ బలోపేతంపై మాత్రం దృష్టి సారించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందులో అనుభవ రాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు పార్టీపరంగా స్థానిక సంస్థలను ఎలా ఎదుర్కోవాలనే విషయంపై కార్యాచరణ ప్రణాళిక లేకపోవడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అధికార పార్టీకి సాధారణంగానే కొంత బలం ఉంటుంది. కానీ దాన్ని సక్రమంగా వినియోగిస్తేనే మెజారిటీ స్థానాల్లో విజయం సాధించవచ్చు.

గ్రామ స్థాయిల్లోనూ విభేదాలు..

కాంగ్రెస్‌ మెజారిటీ ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత తమ వెంట నడిచిన వారికే పదవులు ఇస్తామని, ఇతర పార్టీల నుంచి ఎవరినీ చేర్చుకోమని పలువురు ప్రకటించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో బీఆర్‌ఎస్‌ నుంచి చేరికలను ప్రోత్సహించారు. ఇప్పుడు ఆ పాత, కొత్త నేతల మధ్య జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు విభేదాలు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఇంకా ఎన్నిరోజులు పడుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది. అయినా గ్రామాల్లో మాత్రం వర్గాలుగా ఏర్పడి.. ఎమ్మెల్యేల వద్ద తలనొప్పులు తెస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎమ్మెల్యేల తీరుకు వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేస్తే గెలిచారు. కానీ ఇప్పటికీ పలువురు ఎమ్మెల్యేలు తమ అంగ, అర్ధబలంతో గెలిచామనే భావనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యకర్తలు, నాయకులతో బలోపేతంపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం లేదు. మండలాల వారీగా పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహించడం లేదు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాల్లో లోటుపాట్లను బీఆర్‌ఎస్‌ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుండగా.. కాంగ్రెస్‌ మాత్రం వారి ఆరోపణలను ఖండించడంతోనే సరిపెడుతుంది. ప్రభుత్వం ఏం చేసింది? ఏం చేయబోతుందిా అనే విషయాల కంటే సొంత మైలేజీ, ఆర్భాటపు ప్రదర్శనలు, ఫ్లెక్సీలు, హోర్డింగులకు ప్రాధాన్యం ఇస్తున్న పరిస్థితి ఉంది. ఇదే బీఆర్‌ఎస్‌ కేడర్‌ ఇంకా బలంగా ఉండటానికి కారణమవుతుందని కూడా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ జిల్లా అధ్యక్షుల నియామకం, మండల, గ్రామస్థాయి వరకు పార్టీ విస్తరణ, కార్యక్రమాల రూపకల్పన, స్థానిక ఎన్నికలపై కసరత్తుపై దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది.

విస్తరణపై శ్రద్ధ కరువు..

టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డిని ఆ బాధ్యతల నుంచి అధిష్ఠానం తప్పించి.. మహేశ్‌కుమార్‌గౌడ్‌ను నియమించింది. ఆ తర్వాత పార్టీ విస్తరణ.. జిల్లాలు, మండలాలు, బూత్‌స్థాయి వరకు జరగాలి. కానీ ఇప్పటివరకు జిల్లాల్లో పాత అధ్యక్షుల ఆధ్వర్యంలోనే పార్టీ నడుస్తోంది. ఉమ్మడి ఐదు జిల్లాల్లో జోగుళాంబ గద్వాల జిల్లాకు అధ్యక్షుడు లేరు. అప్పటి అధ్యక్షుడు బీఆర్‌ఎ్‌సలో చేరి.. తర్వాత కాంగ్రె్‌సలోకి వచ్చినప్పటికీ ఆ స్థానం ఖాళీగానే ఉంది. మహబూబ్‌నగర్‌ జిల్లాకు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అధ్యక్షుడిగా ఉండగా.. నాగర్‌కర్నూలు జిల్లాకు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక్క నారాయణపేట, వనపర్తి జిల్లాలకు ఎమ్మెల్యేతర అధ్యక్షులు ఉన్నారు. వనపర్తి డీసీసీ అధ్యక్షుడు చిన్నారెడ్డి మనిషి. ఇప్పటికే చిన్నారెడ్డికి, ఎమ్మెల్యే మేఘారెడ్డికి విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. మంత్రి తుమ్మల పర్యటనకు కొద్దిరోజుల ముందు వరకు అంతర్గత కుమ్ములాటలు ఉండగా.. ఆ పర్యటనతో బహాటంగా విమర్శలు చేసుకున్న పరిస్థితి కనిపించింది. కొత్త కార్యవర్గాల విస్తరణ జరిగితే కొత్త అధ్యక్షుల ఎంపిక.. వారి ఆధ్వర్యంలో పార్టీ విస్తరణ సాధ్యమవుతుంది. కానీ పార్టీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. గతంలో బీఆర్‌ఎస్‌ కూడా చాలా జిల్లాల్లో ఇదే ఫార్మూలాను ఆచరించగా.. ప్రాంతీయ పార్టీ కావడంతో ఎమ్మెల్యే సెంట్రిక్‌గా పని చేశారు. కానీ కాంగ్రె్‌సలో ఆ విధానం సాధ్యం కాదనే అభిప్రాయం ఉంది. అలాగే చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఆర్భాటపు ప్రదర్శనలు చేస్తుండటం కూడా కొంత వ్యతిరేకతను తెచ్చిపెడుతోంది. బీఆర్‌ఎస్‌ హయాంలో ఎమ్మెల్యేల కేంద్రంగా రాజకీయాలు నడిచాయి. ఇప్పుడు కూడా అదే విధానంలో పని చేస్తున్నారు.

Updated Date - Mar 08 , 2025 | 11:01 PM