అడుగంటుతున్న భూగర్భ జలాలు
ABN, Publish Date - Feb 22 , 2025 | 11:33 PM
వేసవి ప్రారంభంలోనే ఎండలు దంచికొట్టడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి..
వెలవెలబోతున్న చెక్‌డ్యాంలు
ముందస్తు చర్యలకు స్ధిమవుతున్న అధికారులు
చిన్నచింతకుంట, పిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి) : వేసవి ప్రారంభంలోనే ఎండలు దంచికొట్టడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.. దీంతో వేపవిలో తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతోంది. బండర్‌పల్లి గ్రామం నుంచి అల్లీపూర్ వరకు దాదాపు 25 కిలో మీటర్ల మేర విస్తరించి ఉన్న ఊకచెట్టు వాగులో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. వానాకాలంలో మత్తడి దుంకిన చెక్‌డ్యాంలతో పాటు ఏదులాపూర్ గ్రామ శివారులోని వాగులో చెక్‌డ్యాం సైతం నీరులేక వెలవెలబోతోంది. కాగా సమీపంలోని రైతుల్లోనూ ఆందోళన నెలకొంది. భూగర్భ జలాలు అడుగంటిపోతే వ్యవసాయ బోర్లలోనూ నీటి మట్టం తగ్గుతోందని, ఈ క్రమంలో పంటలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. అదే విధంగా వాగు శివారు ప్రాంత గ్రామాలకు భవిష్యత్తులో తాగునీటి కష్టాలు ఏర్పడతాయన్న గుబులు స్థానికుల్లో నెలకొంది. మిషన్‌భగీరథ వాటర్ గ్రిడ్ ద్వారా మన్యంకొండ వాటర్ ప్లాంట్ నుంచి బండర్‌పల్లి, లాల్‌కోట, పర్దీపూర్, గోప్యానాయక్ తండా, నెల్లికొండి, చిన్న వడ్డెమాన్, ఏదులలాపూర్ గ్రామాలకు తాగునీరు అందుతోంది. అయితే పాతలైన్‌లోని వనపర్తి మిషన్ భగీరథ నీరు కౌకుంట్ల మండలం ముచ్చింతల, అప్పంపల్లి, దాసర్‌పల్లి, తిర్మలాపూర్ గ్రామాలకు అందుతుండగా, ముచ్చింతల గ్రామానికి తాగునీటి ఎద్దడి ఎదురయ్యే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు అక్కడక్కడా లీకేజీల ప్రభావమే కారణం అని చెప్పవచ్చు. మండలంలో గ్రామ పంచాయతీకి సంబంధించి తాగునీటికి గానూ త్రీఫేజ్ మోటార్లు 58, సింగిల్ ఫేజ్ మోటార్లు 24, చేతి పంపులు ఆరు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా వేసవిలో తాగునీటి ఇబ్బందులు ఎదురయ్యే ప్రాంతాలను అధికారులు ఈనెల 1 నుంచి 10వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి గుర్తించారు. పూర్తి నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు అందజేయనున్నారు. దీంతో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తితే ముందస్తు చర్యలు సిద్ధం చేసే పనిలో అధికారులు ఉన్నారు.
స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం..
వేసవిని దృష్టిలో ఉంచుకుని జిల్లా ఉన్నతాధికారుల ఆదేశానుసారం గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులను గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్‌ను ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు నిర్వహించాం. తాగునీటి సమస్య తలెత్తితే గ్రామ పంచాయతీ మెటార్ల సాయంతో తాగు నీటిని అందిస్తాం. అవసరమైతే ట్యాంకర్లను ఏర్పాటు చేసి, నీటి ఎద్దడి లేకుండా చూసేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాం.
మురళీ, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ
Updated Date - Feb 22 , 2025 | 11:34 PM