అత్యాధునిక హంగులతో దివిటిపల్లి రైల్వేస్టేషన్
ABN, Publish Date - Mar 08 , 2025 | 11:09 PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ అభివృద్ధి కోసం గతంలో ఎన్నడూలేని విధంగా నిధులు కేటాయిస్తున్నారని కేంద్ర రైల్వే, ఐటీశాఖ మంత్రి అశ్విన్‌వైష్ణవ్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్ల క్రితం రైల్వేకు కేటాయించిన నిధులకన్నా ప్రస్తుతం ఒక్క తెలంగాణకే ఆరురెట్ల నిధులు రూ.5337 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారని గుర్తు చేశారు.
స్థానికులతో కలిసి కలెక్టర్ మంచి డిజైన్ రూపొందించాలి
అభివృద్ధిలో దివిటిపల్లి ఆగదు
కేంద్రమంత్రి అశ్విన్‌వైష్ణవ్
రూ.3,225 కోట్లతో నిర్మిస్తున్న అమర్‌రాజా పరిశ్రమలకు శంకుస్థాపన
స్థానికులకు ఉద్యోగ అవకాశాలు: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
మహబూబ్‌నగర్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ అభివృద్ధి కోసం గతంలో ఎన్నడూలేని విధంగా నిధులు కేటాయిస్తున్నారని కేంద్ర రైల్వే, ఐటీశాఖ మంత్రి అశ్విన్‌వైష్ణవ్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్ల క్రితం రైల్వేకు కేటాయించిన నిధులకన్నా ప్రస్తుతం ఒక్క తెలంగాణకే ఆరురెట్ల నిధులు రూ.5337 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారని గుర్తు చేశారు. దివిటిపల్లి రైల్వేస్టేషన్‌ను అత్యాధునిక హంగులతో నిర్మిస్తామని చెప్పారు. అందుకోసం స్థానికులతో కలిసి మంచి డిజైన్ తయారు చేయాలని కలెక్టర్‌కు సూచించారు. దివిటిపల్లి ఐటీ కారిడార్‌లోని అమర్‌రాజా పరిశ్రమలో రూ.3,225 కోట్ల నిధులతో చేపడుతున్న అమర్‌రాజా గిగా ఫ్యాక్టరీ 1 నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, టీజీఐఐటీ సంస్థ చైర్మన్ నిర్మలాజగ్గారెడ్డితో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పరిరఽశమలో తిరిగి, అక్కడ చేపడుతున్న పనులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో నమస్తే బాగున్నారా అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. పుష్ప సినిమా డైలాగ్ తగ్గేదేలేను గుర్తుచేస్తూ దివిటిపల్లి అభివృద్ధి ఆగదని, నిరంతర అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. పాలమూరు కలెక్టర్ విజయేందిరబోయి, ఎస్పీ జానకిలతో పాటు ఎంపీ డీకే అరుణలను వేదికపైకి పిలిచిన ఆయన వారిని చూయిస్తూ మహిళాదినోత్సవం అంతా ఇక్కడే ఉందన్నారు. మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలనపై విశ్వాసంతో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో పరిశ్రమలు ముందుకు వస్తున్నాయన్నారు. పెట్టుబడులు పెట్టేవారికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందన్నారు. ప్రస్తుతం ఇక్కడ 400 మందికి పైగా స్థానిక మహిళలు ఉద్యోగాలు చేస్తుండటం అభినందనీయమన్నారు. తెలంగాణ ఎలక్ర్టిక్ వెహికిల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసి, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని మా ప్రభుత్వం తెచ్చిందన్నారు. అమర్‌రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ గల్లాజయదేవ్ మాట్లాడుతూ అమర్‌రాజా పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 4,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. రూ.1,900 కోట్లతో నిర్మించనున్న అమర్‌రాజా గిగా ఫ్యాక్టరీ 1 పనులకు శంకుస్థాపన చేశామని, అల్ట్‌మిన్ ప్రైవేట్ లిమిటెడ్ లిథియం ఫెర్రో ఫాస్పేట్ టెక్నాలజీ ఆధారంగా బ్యాటరీలను తయారు చేయనున్నారని తెలిపారు. లోహమ్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.502 కోట్ల వ్యయంతో, సెల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ క్యాన్స్, క్యాప్స్ తయారీ సంస్థను 6 ఎకరాల్లో రూ.23 కోట్లతో చేపడుతున్నారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్, తెలంగాణ ఐఐసీవీసీ అండ్ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిరబోయి, ఎస్పీ జానకి, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, నాయకులు సిరాజ్‌ఖాద్రి, జహీరాబీ పాల్గొన్నారు.
Updated Date - Mar 08 , 2025 | 11:09 PM