Telangana politics: సీఎం రేవంత్‌ను నమ్మితే పుస్తెల తాళ్లు ఎత్తుకుపోతాడు
ABN, Publish Date - Feb 19 , 2025 | 04:40 AM
మోసపూరిత మాటలతో గద్దెనెక్కిన రేవంత్ రాష్ట్ర రైతులను అన్ని విధాలుగా దగా చేశారని, రుణమాఫీ పూర్తి చేయలేదని ఆరోపించారు. అప్పు కట్టలేని రైతుల ఇళ్ల తలుపులను, విద్యుత్ మోటర్ల స్టాటర్లను బ్యాంకు అధికారులు ఎత్తుకెళ్తున్నారని పేర్కొన్నారు.
మోసపూరిత మాటలతో గద్దెనెక్కి అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్
తన కుటుంబ లబ్ధి కోసమే ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అంటూ డ్రామాలు
సీఎం అయ్యాక రేవంత్ వెల్దంద వద్ద వెయ్యి ఎకరాలు సంపాదించారు
ఆమనగల్లులో రైతు దీక్షలో కేటీఆర్
ఆమనగల్లు, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌ను నమ్మితే ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వడం సంగతి అటుంచితే, మహిళల మెడలో నుంచి పుస్తెల తాళ్లు ఎత్తుకుపోతాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మోసపూరిత మాటలతో గద్దెనెక్కిన రేవంత్ రాష్ట్ర రైతులను అన్ని విధాలుగా దగా చేశారని, రుణమాఫీ పూర్తి చేయలేదని ఆరోపించారు. అప్పు కట్టలేని రైతుల ఇళ్ల తలుపులను, విద్యుత్ మోటర్ల స్టాటర్లను బ్యాంకు అధికారులు ఎత్తుకెళ్తున్నారని పేర్కొన్నారు. కులగణన అని బీసీలను, రూ.2500 అందిస్తామని మహిళలను, తులం బంగారం ఇస్తామని ఆడబిడ్డల తల్లిదండ్రులను, స్కూటీలు ఇస్తామని యువతులను.. ఇలా ప్రతీ వర్గాన్ని రేవంత్ మోసం చేశారని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ పతనం కల్వకుర్తి నియోజకవర్గం నుంచే ప్రారంభం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బీఆర్‌ఎ్‌స్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన రైతు దీక్షకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రేవంత్ 15నెలల దుర్మార్గ పాలనతో రాష్ట్రంలో 420 మంది రైతులు, 56మంది గురుకుల పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అంటూ సీఎం డ్రామాలు చేస్తున్నారని, తన, తన సోదరుల మేలు కోసమే అదంతా చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ వద్ద రేవంత్ కుటుంబానికి 500 ఎకరాల భూమి ఉండగా.. అధికారంలోకి వచ్చాక సీఎం సోదరులు మరో వెయ్యి ఎకరాలు సంపాదించారని, ఈ 1500 ఎకరాల భూముల విలువ పెంచుకోవడానికే అత్తగారి ఊరైన మాడ్గులకు పెద్ద రోడ్డు వేస్తానంటూ నమ్మబలుకుతున్నాడని కేటీఆర్ ఆరోపించారు.
మాజీ సర్పంచ్‌ల ఉసురు తీసుకుంటున్నారు
అధికారంలోకి వచ్చాక 35 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి 35 పైసలు కూడ రాష్ట్రానికి తీసుకురాలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలన రైతులకు, ప్రజలకు స్వర్ణయుగమైతే 15 నెలల రేవంత్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలున్నందునే రేవంత్ రైతు భరోసా ఇస్తున్నారని.. అది కూడా ఎకరా, రెండెకరాల రైతులకే అందించారని విమర్శించారు. మాజీ సర్పంచ్‌లకు చెల్లించాల్సిన రూ.600కోట్ల బిల్లులు చెల్లించకుండా వారి ఉసురు తీసుకుంటున్నారని, ప్రభుత్వానికి పాలు పోసే పాడిరైతులకు కూడా నెలల తరబడి బిల్లులను చెల్లించడం లేదని కేటీఆర్ ఆరోపించారు.
Updated Date - Feb 19 , 2025 | 04:40 AM