చివరి రోజు.. నామినేషన్ల జోరు
ABN, Publish Date - Feb 11 , 2025 | 01:43 AM
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది.
- పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 100 మంది
- ఉపాధ్యాయుల స్థానానికి 18 మంది నామినేషన్లు
- ర్యాలీలతో హోరెత్తిన కరీంనగర్
- నేడు నామినేషన్ల పరిశీలన...
- 13న ఉపసంహరణ
కరీంనగర్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి నామినేషన్లను స్వీకరించారు. పట్టభద్రుల స్థానానికి వంద మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా ఉపాధ్యాయ స్థానంలో 18 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఈ నెల 13వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. పోలింగ్ ఈ నెల 27న జరుగనున్నది.
ఫ చివరి రోజు పట్టభద్రల స్థానానికి 51 మంది నామినేషన్
సోమవారం ఎక్కువ మంది నామినేషన్లు వేస్తారని అంచనా వేసిన జిల్లా యంత్రాంగం భారీగా బందోబస్తు చేసింది. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్‌రెడ్డితోపాటు పలువురు అభ్యర్థులు పోటాపోటీగా ర్యాలీగా వచ్చి నామినేషన్లనుదాఖలు చేశారు. సోమవారమే పట్టభద్రుల స్థానానికి 51మంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్‌రెడ్డి జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీపీసీసీ చైర్మన్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, నియోజకవర్గ పరిధిలోని ఉమ్మడిజిల్లాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పట్టభద్రులు పాల్గొన్నారు.
- ట్రస్మా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల నుంచి వచ్చిన పట్టభద్రులు, ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులతో కలిసి పద్మనాయక కల్యాణమండపం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు.
- కరీంనగర్ మాజీ మేయర్, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ మాజీ కార్పొరేటర్లు ఎడ్ల అశోక్, సాధవేని శ్రీనివాస్, బీఆర్‌ఎస్ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ఉద్యమకారులు, పట్టభద్రులతో కలిసి టవర్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్రగా వచ్చి నామినేషన్‌ను దాఖలు చేశారు.
- పట్టభద్రుల స్థానానికి పోటీచేస్తున్న పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు వివిధ సంఘాలు, పట్టభద్రులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామినేషన్లను సమర్పించారు.
- ఉద్యమకారుడు, కేసీఆర్ అభిమాని పిడిశెట్టి రాజు సైకిల్‌పై కలెక్టరేట్ వరకు చేరుకొని సాధాసీదాగా పట్టభద్రుల స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు.
- టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి టీపీటీఎఫ్ అభ్యర్థి వై అశోక్‌కుమార్, ఎమ్మెల్సీ నర్సిరెడ్డితో కలిసి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేశారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డితోపాటు మరికొంత మంది అభ్యర్థులు ర్యాలీగా వచ్చి నామినేషన్లను అందజేశారు.
ఫ మంత్రుల వాహనాలను అడ్డుకున్న సర్దార్ రవీందర్‌సింద్
ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ కలెక్టరేట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రుల వాహనాలను కలెక్టరేట్‌లోకి అనుమతించడాన్ని తప్పుబడుతూ వాహనాలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు చేరుకొని మంత్రులను వాహనాల నుంచి దింపివేయడంతో వారు నడుచుకుంటూ లోనికి వెళ్లడంతో వివాదం సద్దుమణిగింది.
ఈనెల 3న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా నామినేషన్ వేసిన వారిలో పట్టభద్రుల స్థానం బీజేపీ అభ్యర్థిగా అంజిరెడ్డి, కాంగ్రెస్‌టికెట్ ఆశించి చివరి వరకు ప్రయత్నంచేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ఱ, డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన గంగాధర్, ఆదిలాబాద్ జిల్లా మహిళాకాంగ్రెస్ అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ, కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, ట్రస్మా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు, ఉపాధ్యాయ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా మల్క కొమురయ్య, సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్‌రెడ్డి, పీఆర్‌టీయుటిఎస్ అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డి, టీపీటీఎఫ్ అభ్యర్థి వై.అశోక్‌కుమార్ తదితరులు ఉన్నారు. మంగళవారం నామినేషన్ల పరిశీలన, 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. 27న ఎన్నికలు, మార్చి 3న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడిస్తామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.
Updated Date - Feb 11 , 2025 | 01:43 AM