స్యాండ్ ట్యాక్సీకి తాత్కాలిక విరామం
ABN, Publish Date - Jan 17 , 2025 | 01:31 AM
జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు గతంలో తీసుకువచ్చిన స్యాండ్ టాక్సీ విధానానికి తాత్కాలికంగా విరామం ప్రకటించారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు గతంలో తీసుకువచ్చిన స్యాండ్ టాక్సీ విధానానికి తాత్కాలికంగా విరామం ప్రకటించారు. జిల్లా ప్రజ లకు ఎలాంటి పన్నులు వసూలు చేయకుండా ఉచి తంగానే ఇసుకను అందజేయాలని కలెక్టర్ కొత్త ఇసుక పాలసీని తీసుకవచ్చారు. గురువారం నుంచి ఉచిత ఇసుక రవాణాను ప్రారంభించారు. జిల్లాల పునర్విభజన అనంతరం కొత్తగా ఏర్పడిన పెద్దపల్లికి కలెక్టర్‌గా వచ్చిన డాక్టర్ అలుగు వర్షిణి జిల్లాలోగల మానేరు, గోదావరి నదుల నుంచి, హుస్సేనిమియా వాగు నుంచి పెద్ద ఎత్తున జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అరికట్టారు. ప్రజలకు సులువుగా ఇసుకను అందిం చాలనే ఉద్దేశంతో ఒక పాలసీని తీసుకవచ్చారు. ఆన్‌లైన్ ద్వారా కావాల్సిన ఇసుక కోసం బుకింగ్ చేసుకున్న 24 గంటల్లోగా నిర్ణీత ప్రదేశానికి ఇసుక సరఫరా చేసే విధంగా పాలసీని రూపొందించారు. మానేరు, గోదావరి తీర ప్రాంత గ్రామాలకు చెందిన ట్రాక్టర్ల యజమానులను ఈ పాలసీలో భాగస్వామ్యం చేశారు. ఒక్కో ట్రాక్టర్ నుంచి 25 వేల రూపాయల డిపాజిట్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేశారు. ఆన్‌లైన్‌లో ఆయా రీచ్‌ల నుంచి ప్రజలు బుకింగ్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ అయిన ట్రాక్టర్ల ద్వారా సరఫరా చేయడం ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు ఇసుక రవాణా చేసే విధంగా పాలసీని రూపొందించారు. రిజిస్టర్డ్ ట్రాక్టర్లకు జీపీఆర్‌ఎస్ పరికరాలను అమర్చి పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా ట్రాకింగ్ చేసి వాటి మూమెంట్‌ను ఎప్పటికప్పుడు ఆరా తీశారు. నిర్ణీత దూరాన్ని బట్టి ధరలు నిర్ణయించారు. వాటి ప్రకారం ఇసుక కావ లసిన వారు మీ సేవా కేంద్రాలు, ఆన్‌లైన్ సెంటర్ల ద్వారా బుకింగ్ చేసుకునే సౌకర్యం కల్పించారు. ఈ విధానాన్ని 2017 ఫిబ్రవరి నుంచి అమల్లోకి తీసుకు వచ్చారు. ఈ విధానం వల్ల జిల్లాలో ఇసుక అక్రమ రవాణా అరికట్టడంతో పాటు ప్రమాదాల నివారణ జరిగింది. అలాగే ప్రభుత్వానికి ఆదాయం సమ కూరింది. ట్రాక్టర్ల యజమాలతో పాటు కూలీలకు కూడా ఉపాధి లభించింది. ఈ విధానాన్ని అప్పటి మంత్రి కేటీఆర్ పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దీనిని అమలు చేయాలని ఆదేశిం చారు. దీంతో కొన్ని జిల్లాల్లో ఈ ఇసుక పాలసీని అమలు చేశారు. జిల్లాలో ఈ పాలసీకి అందరూ అలవాటుపడి ఆన్‌లైన్ ద్వారానే ఇసుక కోసం బుకింగ్ చేసుకుంటున్నారు.
అధికార, ప్రతిపక్ష నేతల గగ్గోలు..
రెండు సంవత్సరాల క్రితం టీఎస్‌ఎండీసీ ఇసుక క్వారీలను ఓపెన్ చేయడంతో పాలసీ అంతంత మాత్రంగానే అమలు జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దపల్లి నియోజకవర్గంలో మాత్రం ‘స్యాండ్ ట్యాక్సీ మాకొద్దు.. ఉచితంగానే ఇసుకను సరఫరా చేయాలి.. ఎలాంటి ఆంక్షలు గానీ, కేసులు గానీ విధించవద్దు..’ అని ఎమ్మెల్యే విజయరమణారావు అధికారులను కోరారు. ఆ మేరకు పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని ఇసుక ట్రాక్టర్ల యజమానులు అధికారులతో సమావేశం నిర్వహించి అధికారులను ఆహ్వానించి ఒప్పించారు. కానీ మంథని, రామగుండం నియోజకవర్గం స్యాండ్ టాక్సీ అమలవుతున్నది. అయితే ఓకే జిల్లాలో ఇసుక పాలసీపై రెండు విధానాలు అమలులో ఉండటం వల్ల మంథని, రామగుండం నియోజకవర్గం స్యాండ్ టాక్సీ విధానం ఎందుకు అమలు చేస్తున్నారని అధికార పార్టీ నాయకులతో పాటు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు సైతం అధికారుల తీరుపై గగ్గోలు పెట్టారు. దీంతో కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో కూడా స్యాండ్ టాక్సీ అమలుచేసేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ ఎమ్మెల్యే ఒప్పుకోకపోవడంతో మంథని, రామగుండం నియోజకవర్గాల్లో కూడా స్యాండ్ ట్యాక్సీకి విరామం ప్రకటించారు. మానేరు నదిపై సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల, గట్టెపల్లి, ముత్తారం మండలం ముత్తారం, అడవిసోమన్‌పల్లి, మంథని మండలం విలోచవరం, గోదావరి నదిపై అంతర్గాం మండలం గోలివాడలో ఆరు ఇసుక రీచులను గుర్తించారు. ఈ రీచ్‌ల నుంచి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రభుత్వానికి ఎలాంటి సీనరేజీ పన్నులు గానీ, ఇతర ఇతర పన్నులు చెల్లించకుండానే నిర్ణీత రవాణా చార్జీలు ట్రాక్టర్ల యజమానులకు చెల్లిస్తే ఇసుక సరఫరా చేస్తామని కలెక్టర్ ప్రకటించారు.
ట్రాక్టర్ ఇసుక పెద్దపల్లి పట్టణ ప్రాంతానికి సరఫరా చేసేందుకు 1400 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సుల్తానాబాద్‌లో 1000, జూలపల్లి లో 1700, ఓదెలలో 1150, శ్రీరాంపూర్‌లో 1100, పాలకుర్తిలో 2500, అంతర్గాంలో 1000, రామగుండంలో 2600, మంథని 1500, ధర్మారంలో 2300, కమాన్‌పూర్‌లో 2200, రామగిరిలో 2200 రూపాయలకు మాత్ర మే విక్రయించాలని ధరలు నిర్ణయించారు. జిల్లాలో ఎక్కడైనా ట్రాక్టర్ ఇసుక నిర్ణీత ధర కంటే అధికంగా విక్రయిస్తే 08728 223318, 08728 223310 ఫోన్ నంబర్లకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు ఫిర్యాదు చేస్తే సంబంధిత ట్రాక్టర్లను సీజ్ చేస్తామని, మొద టిసారి రూ.25వేలు, రెండవసారి రూ.50వేలు జరిమానా విధిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 6ఇసుక రీచ్‌ల నుంచి జిల్లా రిజిస్టర్ ట్రాక్టర్లు మాత్రమే ఇసుక తీసుకొని వెళ్లాలని, లారీ లు, టిప్పర్లు వంటి పెద్ద వాహనాలు, ఇతర జిల్లాల ట్రాక్టర్లు వినియో గించేందుకు వీలు లేదని అధికారులు చెబుతున్నారు.
Updated Date - Jan 17 , 2025 | 01:32 AM