ఇసుక రవాణాపై నిఘా
ABN, Publish Date - Feb 22 , 2025 | 12:55 AM
జిల్లాలో ఇసుక అక్రమ దందాపై రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక పాలసీ తీసుకొచ్చి ఇందిరమ్మ ఇళ్లతో పాటు, సామాన్యులకు అందుబాటు ధరకు ఇసుక సరఫరా చేయాలనే ఆలోచన చేసింది. ఈ మేరకు రాష్ట్ర అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేక దృష్టిపెట్టి ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేస్తున్నారు.
జగిత్యాల, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇసుక అక్రమ దందాపై రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక పాలసీ తీసుకొచ్చి ఇందిరమ్మ ఇళ్లతో పాటు, సామాన్యులకు అందుబాటు ధరకు ఇసుక సరఫరా చేయాలనే ఆలోచన చేసింది. ఈ మేరకు రాష్ట్ర అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేక దృష్టిపెట్టి ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేస్తున్నారు. ఇంతకాలం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిన ఇసుక దందా ఒక్కసారి ఆగిపోవడంతో అక్రమార్కులు సతమతమవుతున్నారు.
- అధికారుల అప్రమత్తం..
నూతన ఇసుక పాలసీ అమల్లోకి వచ్చేవరకు గోదావరి తీర ప్రాంతాలతో పాటు వాగుల నుంచి తట్టెడు ఇసుక కూడా బయటకు రావొద్దని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ, పోలీస్ ఉన్నతాధికారుల నుంచి ఈ నెల 12న ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. కాగా ఆ మరుసటి రోజు నుంచి అధికారులు జిల్లాలోని గోదావరి తీర ప్రాంతాలైన ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, రాయికల్, బీర్‌పూర్, ధర్మపురి తదితర ప్రాంతాలపై నిఘా పెట్టారు. పలు ప్రాంతాల్లో కలెక్టర్, ఎస్పీ, మైనింగ్ అధికారులు పర్యటించారు. స్థానిక పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రత్యేక చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, అక్కడ పోలీసులకు ప్రత్యేక డ్యూటీలు వేశారు. రాత్రింబవళ్లు నిఘా పెంచారు.
- టాస్క్‌ఫోర్స్ టీంల ఏర్పాటు..
జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి అధికార యంత్రాంగం పకడ్బందీగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ టీంలను ఏర్పాటు చేశారు. మండలానికో బృందాన్ని ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షిస్తున్నారు. రెవెన్యూ శాఖ నుంచి నాయబ్ తహసీల్దార్, పోలీసుశాఖ నుంచి హెడ్ కానిస్టేబుల్, మైనింగ్ శాఖ నుంచి రాయల్టీ ఇన్‌స్పెక్టర్, ఒక జూనియర్ అసిస్టెంట్, రవాణా శాఖ నుంచి అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లను టాస్క్‌ఫోర్స్ బృందంలో సభ్యులుగా నియామకం చేశారు. సంబందిత టీంలు అనుమానిత ప్రాంతాల్లో రాత్రీపగలు నిఘాను ఉంచుతున్నారు.
- అక్రమ రవాణాపై ఉక్కుపాదం...
ఇసుక అక్రమ రవాణా చేయవద్దని పోలీసులు హెచ్చరించినా.. వినకుండా అదేతంతుగా వ్యవహరిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా ట్రాక్టర్ల ఓనర్లు, డ్రైవర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి హెచ్చరించారు. పలువురు అనుమానితులను బైండోవర్ చేసి కౌన్సెలింగ్ ఇచ్చారు. జిల్లాలోని కోరుట్ల ప్రాంతంలో గల ఏస్కోని గుట్ట వద్ద కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటించి అక్రమంగా మట్టి తరలింపునకు వినియోగిస్తున్న ఎక్స్‌కావేటర్‌ను సీజ్ చేయాలని ఆదేశించారు. ధర్మపురి మండలం దమ్మన్నపేట, ఆరెపల్లి గ్రామాల శివారు ప్రాంతాల్లో గల గోదావరి నది ఇసుక రీచ్‌లను పరిశీలించారు. అక్రమంగా ఇసుక లోడ్‌లతో వెళ్తున్న నాలుగు ట్రాక్టర్లను స్వయంగా పట్టుకున్నారు. రెండు, మూడు రోజులుగా ఆయా ప్రాంతాల్లో కేసులు నమోదు చేస్తున్నారు. ట్రాక్టర్లు, ఎక్స్‌కావేటర్లను సీజ్ చేస్తున్నారు. పలువురు అక్రమార్కులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారు.
- ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే...
ట్రాక్టర్లు, లారీలు తదితర వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అనుమతి లేని వాహనాలను గుర్తిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేసిన వాగుల ద్వారా మాత్రమే ఇసుక రవాణా జరిగేలా జాగ్రత్త వహిస్తున్నారు. ప్రతీనిత్యం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే రవాణా జరపాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఎక్కువగా అర్ధరాత్రి వేళల్లో ఇసుక అక్రమ రవాణా జరిగే మండలాల్లో కథలాపూర్ మండలం నాగులపేట, మల్లాపూర్ మండలంలోని పలు గ్రామాలుంటున్నాయని గుర్తించారు. గోదావరి తీరాన ఉన్న ఇబ్రహీంపట్నం, రాయికల్, ధర్మపురి వంటి ప్రాంతాల్లో గోదావరి నుంచి ఇసుకను తీయడానికి అనుమతి లేదని, జిల్లాలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ల ద్వారా మాత్రమే ఇసుకరవాణా జరగాలని ఆదేశించారు.
అక్రమార్కుల ఉక్కిరిబిక్కిరి...
దశాబ్డాలుగా కొంతమంది ఇసుక అక్రమ రవాణాతో కోట్లకు పడగలెత్తారు. ఈక్రమంలో పోలీసులు రెవెన్యూ, మైనింగ్ అధికారులు మామూళ్లు తీసుకొని వారికి సహకరించారన్న ఆరోపణలున్నాయి. అలాగే పెద్ద నాయకుల నుంచి చోటామోటా నాయకుల వరకు ఇసుక మామూళ్లే ప్రధాన ఆర్థిక వనరుగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్ స్వయంగా రంగంలోకి దిగడంతో ఎవరూ నోరూ మెదపని పరిస్థితి నెలకొంది. దీంతో ఇసుక మఫియాదారులతో పాటు నెలవారీ మామూళ్లు తీసుకునే అధికారులు, పలువురు నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పాలసీ ఎప్పుడు వస్తుందో...అందులో ఎం ఉంటుందో అనే ఆందోళన కూడా వారిలో మొదలైంది.
ఇసుక అక్రమ రవాణాను సహించేది లేదు
- సత్యప్రసాద్, కలెక్టర్
జిల్లాలోని గోదావరి, వాగుల నుంచి అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తే సహించేది లేదు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అన్నిచోట్ల చెక్‌పోస్టులు, ప్రత్కేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశాము. పలువురు ట్రాక్టర్లను సీజ్ చేశాం. పలువురిపై కేసులు నమోదు చేశారు. రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము.
సమర్థవంతంగా అరికడతాం
- అశోక్‌కుమార్, ఎస్పీ
ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు సమర్థవంతంగా అడ్డుకట్ట వేస్తాము. అక్రమ రవాణాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాము. జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాలు, వాగుల వద్ద ప్రత్యేక నిఘాను పెంచాము. నిరంతరం పర్యవేక్షణ జరుపుతున్నాము. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు తెలియజేయాలి.
Updated Date - Feb 22 , 2025 | 12:55 AM