23న పద్మనగర్ సమీకృత మార్కెట్ ప్రారంభం
ABN, Publish Date - Jan 21 , 2025 | 12:44 AM
నగరంలోని పద్మనగర్‌లో అత్యాధునిక హంగులతో నిర్మించిన సమీకృత మార్కెట్ (ఇంటిగ్రేటెడ్ మార్కెట్)ను ఈనెల 23న ప్రారంభిస్తామని మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు.
కరీంనగర్ టౌన్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): నగరంలోని పద్మనగర్‌లో అత్యాధునిక హంగులతో నిర్మించిన సమీకృత మార్కెట్ (ఇంటిగ్రేటెడ్ మార్కెట్)ను ఈనెల 23న ప్రారంభిస్తామని మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. అదే రోజు డ్రాలో దక్కించుకున్న వ్యాపారులకు స్టాల్స్‌ను కేటాయిస్తామన్నారు. సోమవారం కళాభారతి ఆడిటోరియంలో పద్మనగర్ సమీకృత మార్కెట్‌లోని 193 స్టాల్స్, షెట్టర్లను వ్యాపారులకు కేటాయించేందుకు డ్రా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ యాదగిరి సునీల్‌రావు హాజరై డ్రా తీసి స్టాల్స్ నంబర్లు, వ్యాపారుల పేర్లను ప్రకటించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రిజర్వేషన్ కేటగిరీ ప్రకారంగా 193 దుకాణాలకు లక్కీ డ్రా నిర్వహించి పారదర్శకంగా కేటాయించామని చెప్పారు. 114 కూరగాయలు, 12 పండ్లు, 12 పూలు, 26 మాంసం స్టాల్స్‌తోపాటు 12 ఇతర వ్యాపారులకు కేటాయించామని చెప్పారు. కేటాయించిన స్టాల్స్‌ను పొందిన వ్యాపారులు మూడు నెలల అద్దెలను అడ్వాన్స్‌గా చెల్లించి ఐదు సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకోవాలని సూచించారు. అగ్రిమెంట్ చేసుకోకపోతే వారికి కేటాయించిన దుకాణాన్ని రద్దు చేసి వేరొకరికి కేటాయిస్తామన్నారు. స్టాల్స్ పొందిన వ్యాపారులు ఇతరులకు దుకాణాలను అప్పగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి, ఆర్వో సునీల్, ఆర్‌ఐ శ్యాం పాల్గొన్నారు.
Updated Date - Jan 21 , 2025 | 12:44 AM