ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు షురూ...!
ABN, Publish Date - Feb 04 , 2025 | 01:14 AM
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది.
- తొలిరోజు పట్టభద్రుల స్థానానికి ఆరు నామినేషన్లు
- ఉపాధ్యాయ స్థానానికి మూడు నామినేషన్లు
కరీంనగర్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. సోమవారం ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కాగానే పట్టభద్రుల స్థానానికి ఆరుగురు అభ్యర్థులు ఎనిమిది సెట్ల నామినేషన్లు, ఉపాధ్యాయుల స్థానానికి ముగ్గురు అభ్యర్థులు ఐదు నామినేషన్లు వేశారు. వీరిలో ఇద్దరు అభ్యర్థులు పట్టభద్రుల, ఉపాధ్యాయుల స్థానాలు రెండింటికి నామినేషన్ వేశారు. పట్టభద్రుల స్థానంలో సిలివేరి శ్రీకాంత్ (జమ్మికుంట), గవ్వల లక్ష్మి (దేవునిగూడెం), చాలిక చంద్రశేఖర్ (హైదరాబాద్), మంచికట్ల ఆశమ్మ (ఆదిలాబాద్), కంటె సాయన్న (మేడ్చల్), దూడ మహిపాల్ (ధర్మపురి) నామినేషన్లు వేశారు. ఉపాధ్యాయుల స్థానానికి సిలివేరి శ్రీకాంత్, చాలిక చంద్రశేఖర్, కూర రఘోత్తంరెడ్డి (గోనెపల్లి) నామినేషన్లు వేశారు. సిలివేరి శ్రీకాంత్, చాలిక చంద్రశేఖర్ అటు పట్టభద్రుల స్థానానికి, ఇటు ఉపాధ్యాయుల స్థానానికి నామినేషన్లను దాఖలు చేశారు. కరీంనగర్ కలెక్టర్, ఎమ్మెల్సీ ఎన్నికల అధికారి పమేలా సత్పతి ఈ నామినేషన్లను స్వీకరించారు.
ఫ 10 వరకు నామినేషన్ల స్వీకరణ
ఎమ్మెల్సీ ఎన్నికల అధికారి పమేలా సత్పతి మాట్లాడుతూ ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు తాను రిటర్నింగ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నానని, ఈనెల 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తామని తెలిపారు. 8,9 తేదీల్లో ప్రభుత్వ సెలవులు ఉండడంతో నామినేషన్ల స్వీకరణ ఉండదని, మిగతా పని దినాల్లో ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తామని ఆమె తెలిపారు. ఈనెల 11న నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు. 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టి పూర్తికాగానే ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సందేహాలను నివృత్తి చేసేందుకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని వివరించారు. అభ్యర్థులు ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని, ర్యాలీలు, సభలు, సమావేశాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆమె సూచించారు.
Updated Date - Feb 04 , 2025 | 01:15 AM