karimnagar : ప్రతిష్టాత్మకంగా ఎమ్మెల్సీ ఎన్నికలు
ABN, Publish Date - Feb 09 , 2025 | 01:10 AM
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్) పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్, బీజేపీ ప్రత్యేక దృష్టిసారిస్తున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ పోటీ నుంచి తప్పుకోవడానికే సిద్ధమైనట్లు తెలుస్తున్నది. నామినేషన్లకు ముందు నుంచే కాంగ్రెస్, బీజేపీ క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేస్తూ బాధ్యతలు అప్పగిస్తున్నాయి. బీఆర్‌ఎస్ మాత్రం అభ్యర్థి ఎవరన్నది ప్రకటించడానికి కూడా ఆసక్తి చూపించకపోవడంతో ఆ పార్టీ పోటీలో ఉండకూడదని నిర్ణయించుకున్నట్లేనని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.
- కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ ప్రయత్నాలు
- ఆసక్తి చూపని బీఆర్‌ఎస్
- రేపటితో ముగియనున్న నామినేషన్లు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్, బీజేపీ ప్రత్యేక దృష్టిసారిస్తున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ పోటీ నుంచి తప్పుకోవడానికే సిద్ధమైనట్లు తెలుస్తున్నది. నామినేషన్లకు ముందు నుంచే కాంగ్రెస్, బీజేపీ క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేస్తూ బాధ్యతలు అప్పగిస్తున్నాయి. బీఆర్‌ఎస్ మాత్రం అభ్యర్థి ఎవరన్నది ప్రకటించడానికి కూడా ఆసక్తి చూపించకపోవడంతో ఆ పార్టీ పోటీలో ఉండకూడదని నిర్ణయించుకున్నట్లేనని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.
భారీగా నామినేషన్లు
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో ఈనెల 10న నామినేషన్ల గడువు ముగియనున్నది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ బలపరిచిన అభ్యర్థులతోపాటు 49 మంది నామినేషన్లు వేశారు. ఉపాధ్యాయ స్థానానికి బీజేపీ అభ్యర్థితోపాటు పీఆర్‌టీయూ టీఎస్, టీపీటీఎఫ్ అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మరో ఐదుగురు నామినేషన్లు వేశారు. ఆదివారం సెలవు దినం కాగా సోమవారం ఒక్క రోజు మాత్రమే నామినేషన్లు వేసేందుకు అవకాశమున్నది. పట్టభద్రుల స్థానంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన టి జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని ఆ పార్టీ సీరియస్‌గా ప్రయత్నిస్తున్నది. అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించి చివరకు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్‌రెడ్డిని రంగంలోకి దించింది. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం చివరి వరకు ప్రయత్నిస్తూ వచ్చిన అసిస్టెంట్ ఫ్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బక్క జడ్సన్, ఆదిలాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ రెబల్స్‌గా నామినేషన్లు వేశారు. బీజేపీ అభ్యర్థిగా సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి భర్త డాక్టర్ సి అంజిరెడ్డి నామినేషన్ వేశారు. ఆయన ఒక్కరే ఆ పార్టీ నుంచి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఆ పార్టీకి చెందిన కరీంనగర్ మాజీ మేయర్, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ నామినేషన్ వేశారు. పార్టీ నుంచి అభ్యర్థిని నిలుపుతున్న సంకేతాలు ఏమీ రాక పోవడంతో ఆయన ఇండిపెండెంట్‌గా బరిలో ఉండే అవకాశాలున్నాయి. ట్రస్మా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు, డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన మదనం గంగాధర్‌తోపాటు 49 మంది ఈ స్థానానికి నామినేషన్ వేశారు.
ఉమ్మడి జిల్లాలోనే 50 శాతం ఓటర్లు
నియోజకవర్గంలో 3.5 లక్షల ఓట్లు ఉండగా ఉమ్మడి జిల్లా పరిధిలోనే 50శాతం ఓటర్లు ఉన్నారు. దీంతో అందరూ జిల్లాపై దృష్టి కేంద్రీకరించారు. కాంగ్రెస్‌పార్టీ నరేందర్‌రెడ్డిని బరిలో నిలపడానికి ఇదే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి కూడా జిల్లాకు చెందిన వారే అయినందున గతంలో గెలుపు సాధ్యమైందని ఆ పార్టీ అంచనా వేసింది. రెబల్‌గా బరిలో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ కాంగ్రెస్‌కు, బీజేపీ అభ్యర్థితోపాటు దీటైన పోటీ ఇచ్చే అభ్యర్థిగా మారే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. రెబల్స్‌గా రంగంలో ఉన్న బక్క జడ్సన్, మంచికట్ల ఆశమ్మ పార్టీ ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి డాక్టర్ సి అంజిరెడ్డి గెలుపు బాధ్యతను కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ స్వీకరించి పార్టీలోని అన్ని విభాగాలను, పార్టీ అభిమానులు, ఆర్‌ఎస్‌ఎస్ తదితర అనుబంధ సంస్థలను రంగంలోకి దించి క్షేత్రస్థాయిలో ఇప్పటికే బాధ్యతలు అప్పగించారని ప్రచారం జరుగుతున్నది. శనివారం పట్టభద్రుల సంకల్ప యాత్ర పేరిట భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో బండి సంజయ్‌కుమార్‌తోపాటు ఎంపీలు రఘునందన్‌రావు, నగేశ్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెంకట్‌రమణారెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణగుప్తా, రామారావు పటేల్, పాల్వాయి హరీష్‌బాబు తదితరులు పాల్గొని పాల్గొని పార్టీ కేడర్‌లో జోష్ నింపారు. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డి నామినేషన్ల చివరి రోజున భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో..
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి తొమ్మిది మంది నామినేషన్లు వేయగా సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య, పీఆర్‌టీయూ టీఎస్ అభ్యర్థిగా వంగ మహేందర్‌రెడ్డి, టీపీటీఎఫ్ అభ్యర్థి వై అశోక్‌కుమార్ ప్రధాన పోటీదారులుగా ఉంటారని ఉపాధ్యాయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య పల్లవి గ్రూప్ సంస్థల చైర్మన్, హైదరాబాద్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేతగా ఉన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో మొదటి నుంచి సంబంధాలున్న కొమురయ్య గెలుపును బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నదని చెబుతున్నారు. కాంగ్రెస్ ఇప్పటి వరకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి సహకారం అందించేది ప్రకటించలేదు. 26వేల పై చిలుకు ఓట్లు మాత్రమే ఉండడంతో అభ్యర్థులు ఓటర్లను నేరుగా కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ వాతావరణం పెరిగింది. కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థులను గెలిపించుకోవడం సవాల్‌గా తీసుకోవడంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి.
Updated Date - Feb 09 , 2025 | 01:10 AM