jagtial : బడ్జెట్‌పై మిశ్రమ స్పందన
ABN, Publish Date - Feb 03 , 2025 | 01:23 AM
జగిత్యాల, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2025-26 సాధారణ బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కేంద్ర బడ్జెట్ కొందరిలో ఆశలను కలిగించగా,
-రైతు పక్షపాతిగా ఉందన్న బీజేపీ నాయకులు
-వేతన జీవులకు ఊరట కలిగించిందన్న పలువురు
-నిరుద్యోగులను నిరాశపరిచిందన్న కాంగ్రెస్
జగిత్యాల, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2025-26 సాధారణ బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కేంద్ర బడ్జెట్ కొందరిలో ఆశలను కలిగించగా, మరికొందరిని నిరాశ నిస్పృహలకు గురిచేసింది. సమాజంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు దేశ రైతాంగం, సామాన్యులు, పేదలు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టారని కొందరు అభిప్రాయ పడగా, దిశా నిర్ధేశం లేని నిష్ప్రయోజనకర బడ్జెట్‌గా ఉందని మరికొందరు ఆక్షేపించారు. నిరుద్యోగులను నిరాశ పరిచిందని కాంగ్రెస్ నాయకులు పేర్కొనగా, కేంద్ర బడ్జెట్ రైతు పక్షపాతిగా ఉందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. వేతన జీవులకు ఊరట కలిగించిందని పలువురు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పలు రంగాలను ప్రోత్సహించడం, సామాన్యుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్‌ను రూపొందించిందని కొందరు కితాబు ఇవ్వగా, కేంద్రం మసిపూసి మారేడు కాయ చేసిన గోల్‌మాల్ బడ్జెట్ అని మరికొందరు ధ్వజమెత్తారు. లోక్‌సభలో శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జిల్లాకు చెందిన వివిధ పార్టీల నాయకులు, సంఘాల నాయకులు, ఆర్థిక నిపుణుల అభిప్రాయాలు
నిరుద్యోగులకు నిరాశ
- తాటిపర్తి విజయలక్ష్మి
మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు
దేశంలో రోజురోజుకు నిరుద్యోగ శాతం పెరుగుతోంది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నిరుద్యోగం ఊసే లేదు. దేశంలో నిరుద్యోగం పెరిగితే ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడుతుంది. మోదీ సర్కార్ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలను ఇస్తామని హామీ ఇచ్చి మరిచిపోయింది.
రైతు పక్షపాతిగా కేంద్ర బడ్జెట్
- కొడిపల్లి గంగారెడ్డి, బీజేపీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతు పక్షపాతిగా ఉంది. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఇచ్చే రుణ పరిమితి పెంపు, ఇతర అంశాలు రైతులకు ప్రయోజనకరంగా ఉన్నాయి. రైతులకు మేలు చేకూరేలా బడ్జెట్ ఉంది.
తెలంగాణకు మొండిచేయి
- జిల్లా గంగాధర్, ప్రముఖ వ్యాపారి
తెలంగాణకు మొండిచేయి చూపేలా కేంద్ర బడ్జెట్ ఉంది. అత్యధికంగా నిధులు సమకూర్చే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ అగ్రగామిగా ఉంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీహార్, ఢిల్లీకి అధిక నిధులు ఇచ్చారు. అదే విధంగా మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా ఉండేలా రూ. 12 లక్షల వార్షిక ఆదాయం చేయడం మంచి పరిణామం.
అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్
దొనికెల నవీన్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
లోక్‌సభలో మంత్రి నిర్మలా సీతారామన్ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. మహిళలు, యువత, బాలబాలికలు, రైతులు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేలా బడ్జెట్ ఉంది.
వేతన జీవులకు ఆదాయపు పన్ను ఊరట
కొక్కు గంగాధర్, బీజేపీ పట్టణాధ్యక్షుడు
వేతన జీవులకు భారీ ఊరట కల్పిస్తూ కేంద్ర బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు. కొత్త పన్ను విధానంలో రూ. 12 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించనక్కర్లేదు. దీనివల్ల అదనంగా కోటి మందికి పైగా ప్రజలకు పన్ను భారం లభిస్తుంది.
రైతులకు క్రెడిట్.. గ్రామాలకు బూస్ట్
చిట్నేని రఘు, ప్రముఖ వైద్యులు, జగిత్యాల
పంట ఉత్పాదకత తక్కువగా ఉండే ప్రాంతాల్లో సౌకర్యాల కల్పన, అన్నదాతలకు సులభంగా రుణాలు అందేలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటన చేసింది. పీఎం ధర ధాన్య కృషి యోజన పథకాన్ని కేంద్రం ప్రకటించింది. దీనికింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయి.
ఉద్యోగులకు భారీ ఉప శమనం
- అయిత అనిత, కవయిత్రి, జగిత్యాల
ఆదాయపు పన్నులో ఉద్యోగులకు భారీ ఉప శమనం కలిగించేలా బడ్జెట్ ప్రవేశపెట్టారు. సాంకేతిక విద్యలో పురోగతి కల్పించే విధంగా ఉంది. చిన్న, మధ్య తరగతి కుటుంబాలకు ఊతమిచ్చేలా బడ్జెట్ రూపొందించారు.
రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ
- అడువాల జ్యోతి లక్ష్మణ్, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపించారు. రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ప్రజాప్రతినిధులు బడ్జెట్‌లో నిధులు కేటాయింపులో విఫలమయ్యారు. బీహార్, ఢిల్లీలో ఎన్నికలు ఉన్నందున అధిక బడ్జెట్ కేటాయించారు. తెలంగాణకు జీరో బడ్జెట్ ఇవ్వడం సమంజసంకాదు.
పన్నుపై రిబేట్ పెంచడం అభినందనీయం
కంటాల శ్రీనివాస్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, జగిత్యాల
బడ్జెట్‌లో పన్నుపై రిబేట్ పెంచడంతో కోటి మందికి పైగా ప్రజలకు ఊరట కల్పించినట్లయింది. ఆదాయపు పన్నులో మినహాయింపు అభినందనీయం. అన్ని రాష్ట్రాలకు సమన్యాయంగా బడ్జెట్ కేటాయింపులు జరగలేదు. ఇది పక్షపాత బడ్జెట్
ఆశ నిరాశల కేంద్ర బడ్జెట్
అల్లూరి మహేందర్‌రెడ్డి, సింగిల్‌విండో మాజీ చైర్మన్, జగిత్యాల
కేంద్ర బడ్జెట్ ఆశ, నిరాశలను కలిగించేలా రూపకల్పన జరిగింది. కేంద్ర బడ్జెట్‌లో పలు రంగాలకు కేటాయించిన నిధులు చాలా తక్కువగా ఉన్నాయి. నూతన ఆదాయపు పన్ను విధానం వేతన జీవులకు స్వల్ప ఊరట ఇస్తుంది. రైతాంగానికి ఆశించిన విధంగా నిధుల కేటాయింపులు జరగలేదు. లోక్‌సభలో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నవోదయ పాఠశాలలు, గిరిజన విశ్వ విద్యాలయం ఊసు ఎత్తలేదు.
Updated Date - Feb 03 , 2025 | 01:23 AM