jagtial : విద్యుత్ స్తంభాలకు జియోట్యాగింగ్
ABN, Publish Date - Feb 09 , 2025 | 01:12 AM
జగిత్యాల, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారానికి నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌పీడీసీఎల్) సంస్థ ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
-ఇక సులువుగా సమస్యల గుర్తింపు
11 కేవీ, 33కేవీ స్తంభాలకు నలుపు, పసుపు రంగులతో నంబర్లు
-ఇప్పటికే సగానికిపైగా పూర్తయిన ప్రక్రియ
జగిత్యాల, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారానికి నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌పీడీసీఎల్) సంస్థ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. జిల్లాలోని విద్యుత్ స్తంభాలకు నంబర్లు వేసి జియో ట్యాగింగ్ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇది వరకు ఒక లైన్‌లో విద్యుత్ అంతరాయం ఏర్పడితే దాని పరిధిలోని మిగతా లైన్ల సరఫరా కూడా నిలిపి వేసేవారు. ప్రస్తుతం జియో ట్యాగింగ్ ప్రక్రియ పూర్తయితే విద్యుత్ సమస్య ఉన్న ఒక్క లైన్‌కు మాత్రమే సరఫరా నిలిపివేసి మరమ్మతు చేపట్టవచ్చు. జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న 32 వేల విద్యుత్ స్తంభాలకు ప్రత్యేక రంగులతో నంబర్లు వేస్తున్నారు. 33 కేవీ స్తంభానికి పసుపు రంగుతో నంబర్లు ఇస్తున్నారు. 11 కేవీ స్తంబానికి నలుపు రంగుతో ప్రత్యేక నంబర్లను కేటాయిస్తున్నారు. తర్వాత జియో ట్యాగింగ్‌తో అనుసంధానం చేస్తారు. దీంతో విద్యుత్ లైన్లలో ఎక్కడ సమస్య తలెత్తినా ఆ ప్రాంతాన్ని సులువుగా గుర్తించి పరిష్కరిస్తారు.
ఫనెలాఖరులోపు పూర్తి చేయడమే లక్ష్యం
విద్యుత్ స్తంభానికి ట్రాన్స్‌ఫార్మర్ ఎంత దూరంలో ఉందో తెలుసుకునేలా నంబర్ల ప్రక్రియను పకడ్బందీగా వేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జియో ట్యాగింగ్‌కు జిల్లా, డివిజన్, సబ్ డివిజన్, సెక్షన్ కార్యాలయాల్లో ఇందుకు అవసరమైన పరికరాలను సమకూర్చనున్నారు. ఈ విధానంతో సంబంధిత అధికారులు, సిబ్బంది సెల్‌ఫోన్‌లలో సమాచారం వస్తుంది. దీంతో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే సంబంధిత అధికారుల సెల్‌ఫోన్‌కు మెస్సేజ్ వస్తుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ప్రస్తుతం విద్యుత్ స్తంభాలకు నంబర్ల ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రక్రియను మరింత వేగవంతం చేసి నెలాఖరులోపు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని విద్యుత్ శాఖ అధికారులు అంటున్నారు.
------------------------------------------------------------------------------
జిల్లాలో విద్యుత్ ఫీడర్లు ఇలా..
ఫీడర్లు...............సంఖ్య... నంబర్లు వేయడం పూర్తయినవి
33 కేవీ ఫీడర్లు......41..........39
11 కేవీ ఫీడర్లు......241........65
------------------------------------------------------------------------------
మొత్తం విద్యుత్ స్తంభాలు...32,000
------------------------------------------------------------------------------
మెరుగైన సేవలందించడమే లక్ష్యం
-సాలియా నాయక్, ఎస్‌ఈ
వినియోగదారులకు విద్యుత్ అంతరాయం లేకుండా సేవలందించేందుకు స్తంభాలకు ప్రత్యేక నంబర్ల కేటాయింపు ప్రక్రియను చేపడుతున్నాం. దీంతో సమస్య తలెత్తిన ప్రాంతాన్ని వెంటనే గుర్తించే వీలుంటుంది. సాధ్యమైనంత తొందరగా ప్రక్రియను పూర్తి చేసి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తాం.
Updated Date - Feb 09 , 2025 | 01:12 AM