‘నిర్మలమ్మ’ కరుణించేనా..!
ABN, Publish Date - Feb 01 , 2025 | 01:43 AM
మరమగ్గాల చప్పుళ్ల మధ్య బతుకు సమరం సాగిస్తున్న సిరిసిల్ల పవర్‌లూం యజమానులు, నేతన్నలకు మెగా పవర్‌లూం క్లస్టర్ తీరని ఆశగానే మిగిలిపోయింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే ప్రతి బడ్జెట్‌లోనూ మెగా పవర్‌లూం క్లస్టర్ ప్రకటిస్తారనే ఆశగా ఎదురుచూస్తారు.
- పవర్‌లూం మెగా క్టస్టర్ కోసం ఎదురుచూపులు
- ప్రతిసారి కేంద్ర బడ్జెట్‌లో మొండిచేయి
- నేటి కేంద్ర బడ్జెట్‌పై నేతన్నల ఆశలు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
మరమగ్గాల చప్పుళ్ల మధ్య బతుకు సమరం సాగిస్తున్న సిరిసిల్ల పవర్‌లూం యజమానులు, నేతన్నలకు మెగా పవర్‌లూం క్లస్టర్ తీరని ఆశగానే మిగిలిపోయింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే ప్రతి బడ్జెట్‌లోనూ మెగా పవర్‌లూం క్లస్టర్ ప్రకటిస్తారనే ఆశగా ఎదురుచూస్తారు. తీరా బడ్జెట్‌లో ఊసే ఎత్తకపోవడం నిరాశ చెందడం, సర్వసాధరణంగా మారిపోయింది. 2025-26 కేంద్ర బడ్జెట్‌ను మరోసారి కేంద్ర మంత్రి నిర్మలమ్మ శనివారం ప్రవేశపెట్టనున్నారు. ఈసారైనా నిర్మలమ్మ మనస్సు కరుగుతుందనే ఆసక్తి నేత కుటుంబాల్లో మరోసారి కలుగుతోంది. సాధారణంగా కేంద్ర బడ్జెట్ అనగానే తమ రాష్ట్రానికి ఏం ప్రయోజనం కలగబోతుంది, పన్నుల పోటు, మినహాయింపులు, కొత్త పథకాలపై ప్రజలు చర్చిస్తారు. సిరిసిల్ల నేతన్నలు మాత్రం దశాబ్దకాలంగా ఉపాధిని పెంచే మెగా పవర్‌లూం క్లస్టర్ మంజూరుచేస్తారని ఎదురుచూస్తారు. 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, ఆ తరువాత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నాయకులు సిరిసిల్ల మెగా పవర్‌లూం క్లస్టర్ కోసం విజ్ఞప్తులు చేశారు. గత ప్రభుత్వ హయాంలో చేనేత జౌళి శాఖ మంత్రిగా కేటీఆర్ అనేకసార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు అందించినా ఫలితం లేకుండా పోయింది. ఈసారైనా బడ్జెట్‌లో మెగా పవర్‌లూం క్లస్టర్ ప్రకటిస్తారనే ఆశాభావంతోనే ఉన్నారు.
ఫ హామీలకే పరిమితం..
కేంద్ర, రాష్ట్రాలను కుదిపేసిన సిరిసిల్ల నేత కార్మికుల బలవన్మరణాలు, ఆకలి చావుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ బృందాలు సిరిసిల్లలో పర్యటించి మెగా పవర్‌లూం క్లస్టర్, టెక్స్‌టైల్ జోన్‌గా ఏర్పాటుచేసి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని హామీలు ఇచ్చాయి. నేత కార్మికులను ఆశల్లో ఉంచగా హామీలకే కేంద్రం పరిమితమైంది. ప్రతి కేంద్ర బడ్జెట్ సమయంలో సిరిసిల్ల నేతన్నలు ఎదురుచూస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సిరిసిల్లను మెగా పవర్‌లూం క్టస్టర్‌గా మార్చాలనే ప్రతిపాదనలు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాం నుంచి పంపిస్తూనే ఉన్నారు. 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావును ప్రస్థుత బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌లు మెగా పవర్‌లూం క్లస్టర్ హామీని పొందారు. అప్పటి బడ్జెట్‌లోనే ప్రకటిస్తారని ఆశించారు. కానీ నిరాశే మిగిలింది. 2004లో తంగళ్లపల్లి మండలం బద్దనపల్లి వద్ద 60 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్కును రూ.7.73 కోట్లతో ఏర్పాటు చేశారు. టెక్స్‌టైల్ పార్కులో ఆధునిక మరమగ్గాలను స్థాపించారు. దేశ, విదేశీ మార్కెట్‌లో అమ్ముడుపోయే విలువైన వస్త్రాలను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నా పార్కులోకి అనుబంధ పరిశ్రమలు రాకపోవడంతో ఉత్పత్తుల్లో పెద్దగా మార్పులు రాలేదు. సిరిసిల్లలో లో టెక్నాలజీ మరమగ్గాలపై ఆధునిక ఉత్పత్తులు చేయలేక తరచూ పరిశ్రమ సంక్షోభాన్ని చవిచూసింది. ఆత్మహత్యలు, సంక్షోభం నేపథ్యంలో సిరిసిల్లలో మార్పులు తీసుకరావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి. అప్పటి కేంద్ర ప్రభుత్వం సిరిసిల్ల మెగా పవర్‌లూం క్లస్టర్‌ను ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మారిపోయి బీజేపీ ప్రభుత్వం రావడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. 2016 బడ్జెట్ సమయంలో అప్పుడు రాష్ట్ర మంత్రిగా కేటీఆర్ మూడుసార్లు ఢిల్లీకి వెళ్లి, అప్పటి చేనేత జౌళిశాఖ మంత్రి సంతోష్ గంగువార్‌లను కలిసి వస్త్ర పరిశ్రమ సమస్యలను వివరించారు. మెగా పవర్‌లూం క్లస్టర్ ప్రతిపాదనలు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి పంపించామని తెలపడంతో ఆ బడ్జెట్‌లో పవర్‌లూం క్టస్టర్‌కు చోటు దక్కుతుందని భావించారు. మొదటి విడతలో దేశంలో ఐదు మెగా క్లస్టర్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినా సిరిసిల్లకు చోటు దక్కలేదు. 2017 బడ్జెట్ సమయంలో కూడా కేటీఆర్, అప్పటి ఎంపీ వినోద్‌లు చేనేత జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీని కలిసి మెగా పవర్‌లూం క్లస్టర్‌ను సాధించుకునే విధంగా చర్యలు చేపట్టారు. కానీ ఆ బడ్జెట్‌లో కూడా మోక్షం లభించలేదు. అదేక్రమంలో 2018, 2019, 2020, 2021, 2022, 2023 బడ్జెట్‌లలో కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఈసారి ఎలా ఉండబోతుందనే ఆసక్తి ఏర్పడింది. గత రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వ ఆర్డర్లను అందించింది. బతుకమ్మ చీరల ద్వారా కార్మికులు నెలకు రూ.16 నుంచి రూ.18 వేల వరకు వేతనాలు పొందుతూ వచ్చారు. మరోవైపు అపెరల్ పార్కులో గార్మెంట్ పరిశ్రమ మొదలుకావడంతో మహిళలకు ఉపాధి లభిస్తోంది. కార్మికులను యజమానులుగా మార్చే వర్కర్ టు ఓనర్ పథకం పనులు కూడా చివరి దశకు చేరుకొని లబ్ధిదారుల ఎంపిక మిగిలింది. ఇదే దశలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ప్రభుత్వ ఆర్డర్లపై కొంత సందిగ్ధత ఏర్పడినా మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లాకు చెందిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌లు నేత కార్మికుల్లో భరోసా నింపడంతో పాటు స్వశక్తి సంఘాల మహిళలకు చీరల ఆర్డర్లు, సర్వ శిక్షలో విద్యార్థులకు యూనిఫాం వస్త్రాల ఆర్డర్లు అందించడంతో పరిశ్రమ మళ్లీ నిలదొక్కుకునే దిశగా అడుగులు పడుతున్నాయి.
ఫ ఒడిదొడుకుల ప్రస్థానం..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిరిసిల్లలో నేత కార్మికుల ఆత్మహత్యలను నివారించి వారి కుటుంబాలను ఆదుకునే దిశగా ఏర్పాటు చేసిన సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్కు దాదాపు ఇరవై ఏండ్లుగా ఒడిదొడుకుల మధ్య ఎదురీదుతోంది. నిరంతరం ఉత్పత్తి ఆటంకాలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పుడైనా కూలీ పెంపు, సమస్యల పరిష్కారానికి కార్మికుల ఆందోళనతో పరిశ్రమలు మూతపడేవి. ప్రస్తుతం ఉత్పత్తులు లేక మూతపడుతున్నాయి. 2002-2003లో సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం సారంపల్లి, బద్దెనపల్లి గ్రామాల మధ్య 60 ఎకరాల్లో రూ.7.73 లక్షలతో టెక్స్‌టైల్ పార్కును నిర్మించారు. 2004లో పార్కు పూర్తయినా పరిశ్రమల స్థాపనకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం తరపున అధికారులు గుజరాత్, మహారాష్ట్రలోని పారిశ్రామికవేత్తలను కలిసి ఆహ్వానించారు. వివిధ హామీలు ఇవ్వడంతో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చారు. సిరిసిల్ల పార్కులో 1200 గజాల చొప్పున 171 ప్లాట్లు, 600 గజాల చొప్పున 106 ప్లాట్లు, వాణిజ్య అవసరాల కోసం 32ప్లాట్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం టెక్స్‌టైల్ పార్కులో 165 ఇండస్ట్రీ యూనిట్లు, 27 కమర్షియల్ యూనిట్లు ఉన్నాయి. ఇందులో 115 యూనిట్లలో 1475 ఆధునిక రాపియర్ మరమగ్గాలపై ఉత్పత్తులు జరుగుతున్నా టెక్స్‌టైల్ రంగంలోని సంక్షోభంతో నడవని పరిస్థితి ఏర్పడింది. పార్కులో గతంలో ప్రైవేటు వస్త్ర ఉత్పత్తులపైనే ఆధారపడ్డారు. ఇదేక్రమంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం బతుకమ్మ చీరలు, రంజాన్, క్రిస్మస్, ఆర్వీఎం క్లాత్ ఉత్పత్తి ఆర్డర్లను పార్కులో కూడా కేటాయించింది. ప్రభుత్వ ఆర్డర్లు రావడంతో పార్కులోని పరిశ్రమల్లో ప్రైవేటు ఉత్పత్తులు దూరమయ్యాయి. ప్రైవేటు ఉత్పత్తులు అనుకూలంగా రాకపోవడంతో పార్కులో పరిశ్రమలు భారంగా మారాయి. ప్రస్తుతం మళ్లీ ప్రభుత్వ ఆర్డర్లు వస్తున్నా ఆశించినస్థాయిలో రాకపోవడంతో మరమగ్గాలపై పూర్తిస్థాయిలో ఉత్పత్తులు జరగడం లేదు. మెగా పవర్‌లూం క్లస్టర్ వస్తే వస్త్ర పరిశ్రమ విభిన్నంగా ముందుకుపోతుందని భావిస్తున్నారు.
Updated Date - Feb 01 , 2025 | 01:43 AM