ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘మల్కపేట’పై ఆశలు

ABN, Publish Date - Jan 10 , 2025 | 01:16 AM

సిరిసిల్ల మెట్ట ప్రాంతాలకు గోదావరి జలాలతో సాగునీరు అందించే దిశగా చేపట్టిన ప్రాజెక్ట్‌ల్లో కాళేశ్వరం 9వ ప్యాకేజీలో మిగిలిన మల్కపేట రిజర్వాయర్‌లోకి శ్రీరాజరాజేశ్వర మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌ నుంచి నీటిని ఎత్తిపోసే ప్రక్రియ ప్రారంభించడంతో రైతులు ప్రాజెక్ట్‌ అందుబాటులోకి వస్తుందనే ఆశలు మొదలయ్యాయి.

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

సిరిసిల్ల మెట్ట ప్రాంతాలకు గోదావరి జలాలతో సాగునీరు అందించే దిశగా చేపట్టిన ప్రాజెక్ట్‌ల్లో కాళేశ్వరం 9వ ప్యాకేజీలో మిగిలిన మల్కపేట రిజర్వాయర్‌లోకి శ్రీరాజరాజేశ్వర మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌ నుంచి నీటిని ఎత్తిపోసే ప్రక్రియ ప్రారంభించడంతో రైతులు ప్రాజెక్ట్‌ అందుబాటులోకి వస్తుందనే ఆశలు మొదలయ్యాయి. ఇటీవల రైతులు భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయని ఆందోళన చెందుతున్న క్రమంలో ప్రాజెక్ట్‌లోకి నీటిని నింపే ప్రక్రియను చేపట్టారు. దీంతో యాసంగి సాగుతో పాటు వేసవిలో నీటి సమస్యకు ఉపశమనం కలుగుతుందని రైతులు భావిస్తున్నారు. జిల్లాలోని కోనరావుపేట మండలం మల్కపేట వద్ద మూడు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ప్రాజెక్ట్‌ను ప్రారంభోత్సవానికి సిద్ధమైనా కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఏర్పడిన లోపాలతో రైతులకు చేరువకాకుండా పోయింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుతో ప్రారంభోత్సవం చేయించడానికి రెండుసార్లు ఏర్పాటు చేసినా వాయిదా పడింది. ప్రాజెక్ట్‌కు మాజీ ఎమ్మెల్యే దివంగత సీహెచ్‌ రాజేశ్వర్‌రావు పేరును పెట్టారు. గత నవంబరులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాకు వచ్చిన సందర్భంలో ప్రారంభోత్సవం చేస్తారని భావించినా నిరాశే కలిగింది. 2023 మే, జూన్‌ మాసాల్లో మల్కపేట రిజర్వాయర్‌లోకి నీటిని నింపడానికి ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. దాదాపు 18 నెలల తరువాత మళ్లీ బుధవారం మల్కపేట రిజర్వాయర్‌లోకి నీటిని నింపే ప్రక్రియను చేపట్టారు. గురువారం రెండు పంప్‌లతో నీటిని నింపడం వేగవంతం చేయడంతో ప్రాజెక్ట్‌ అందుబాటులోకి వస్తుందని రైతుల్లో ఆశలు మొదలయ్యాయి. ప్రాజెక్ట్‌ ప్రారంభం కాకపోయినా భూగర్భజలాలు పెరుగుతా యని భావిస్తున్నారు. మూడు టీఎంసీల సామర్థ్యం ఉన్నా ప్రాజెక్ట్‌లోకి 2 టీఎంసీల నీటి నిల్వను ఉంచే విధంగా నీటిని నింపుతున్నారు.

- మెట్ట ప్రాంతానికి తాగు, సాగునీరు

గోదావరి జలాల పరవళ్లతో రాజన్న సిరిసిల్ల జిల్లా కళకళలాడింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఏర్పడ్డ అవాంతరంతో ఆందోళనలు ఏర్పడ్డా ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతలు మొదలు కావడంతో రైతులు, ప్రజలు ఇబ్బందులు ఉండవని, తాగు, సాగు నీరు గోస తీరుతుందని భావిస్తున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని ప్రాజెక్ట్‌లకు సిరిసిల్ల మానేరు తీరం వారధిగా మారింది. సిరిసిల్ల మానేరు వాగుపై 27 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన శ్రీరాజరాజేశ్వర మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌ నీటినిల్వతో 18 కిలోమీటర్ల మేరకు బ్యాక్‌ వాటర్‌తో జలకళ సంతరించుకుంది. ప్రస్తుతం మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌లో 25.80 టీఎంసీల నీరు మిడ్‌ మానేరులో నిల్వ ఉంది. మిడ్‌మానేరు ప్రాజెక్ట్‌కు అనుసంధానంగానే జిల్లాలోని అనంతారం అన్నపూర్ణ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఆసియాలోనే అతిపెద్దదైన సర్జిపూల్‌ బావిని నిర్మించి అనంతగిరి ప్రాజెక్ట్‌లోకి నీటిని ఎత్తిపోయడం ద్వారా రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్‌, కొండ పొచమ్మసాగర్‌ వరకు కాళేశ్వరం జలాలను పరుగులెత్తించే అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. జిల్లానుంచి గోదావరి జలాలు ఎత్తిపోతలతో ఇతర జిల్లాలకు తరలివెళ్తుంటే సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని మెట్ట ప్రాంతాల రైతులు కాళేశ్వరం 9వ ప్యాకేజీ ద్వారా కాల్వల నిర్మాణం, నిజాం కాలంలో నిర్మించిన ఎగువ మానేరు ప్రాజెక్ట్‌కు నీటి మళ్లింపుతో పాటు తొమ్మిదేళ్లుగా మూడు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే మల్కపేట రిజర్వాయర్‌ అందుబాటులోకి వస్తుందని ఎదురు చూస్తున్నారు.

- రూ. 996 కోట్లతో 9వ ప్యాకేజీ పనులు...

జిల్లాలోని కాళేశ్వరం 9వ ప్యాకేజీ పనుల ద్వారా సిరిసిల్ల, కోనరావుపేట, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో భూగర్భజలాలు పెరగడంతో ఆయకట్టు పెరుగుతుందని అంచనాలు వేశారు. సిరిసిల్ల మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌ నుంచి ఎగువ మానేరు ప్రాజెక్ట్‌ వరకు 9వ ప్యాకేజీ పనులకు రూ. 996 కోట్లతో శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కోనరావుపేట మండలం మల్కపేట వద్ద మూడు గుట్టలను అనుసంధానం చేసుకొని ఆరు కట్టలతో మూడు టీఎంసీల సామర్థ్యంతో రూ. 504 కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రాజెక్ట్‌ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని భావించినా రైతులకు నిరాశే మిగిలింది. ట్రయల్‌రన్‌ పూర్తి చేసుకొని యేడాది గడిచినా కొత్త ప్రభుత్వం దృష్టి సారించడం లేదనే విమర్శలు ఉన్నాయి. సిరిసిల్ల శ్రీరాజరాజేశ్వర మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌ బ్యాక్‌ వాటర్‌ నుంచి మల్కపేట ప్రాజెక్ట్‌ వరకు నీటిని మళ్లించడానికి 12 కిలోమీటర్ల టన్నెల్‌ నిర్మించారు. అక్కడ సర్జిపూల్‌ బావిని నిర్మించారు. 30 మెగావాట్ల సామర్థ్యం ఉన్న రెండు పంపుల ద్వారా 560 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్ట్‌లోకి ఎత్తిపోస్తారు. మల్కపేట రిజర్వాయర్‌ ప్రారంభం అయితే దాని ద్వారా ఎగువ మానేరు ప్రాజెక్ట్‌లోకి రెండు టీఎంసీలు, బత్తుల చెరువులో రెండు టీఎంసీలు నింపడంతో పాటు వాటి పరిధిలో ఉన్నా చెరువులు నిండడం ద్వారా 60 వేల ఎకరాల కొత్త ఆయకట్టు పెరగనుంది. ఇప్పటికే సింగసముద్రం వరకు కాలువల నిర్మాణాలు కూడా జరిగాయి. మల్కపేట రిజర్వాయర్‌ అందుబాటు లోకి వస్తే జిల్లాలో సమృద్ధిగా సాగునీటి వనరులు రైతులకు అందుబాటులోకి వస్తాయని ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Jan 10 , 2025 | 01:16 AM