గెలుపుపై ఆశలు
ABN, Publish Date - Mar 01 , 2025 | 02:23 AM
ముందెన్నడూ లేని విధంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను తలపించేలా జరిగిన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ మధ్య నువ్వా..నేనా అన్నట్లు సాగిన పోరులో విజయం ఎవరిని వరించనున్నదోనని ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటుండగా తామే గెలుస్తామని ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
- ఎవరి ధీమాలో వారే
- ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ముందెన్నడూ లేని విధంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను తలపించేలా జరిగిన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ మధ్య నువ్వా..నేనా అన్నట్లు సాగిన పోరులో విజయం ఎవరిని వరించనున్నదోనని ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటుండగా తామే గెలుస్తామని ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. హోరాహోరీగా సాగిన ముక్కోణపు పోటీలో మొదటి, రెండు స్థానాల్లో నిలిచేదెవరూ.. మూడో స్థానంలో ఉండేదెవరూ.. అన్నదానిపైనే అన్ని రాజకీయ పార్టీలు కూడికలు..తీసివేతలతో తలపడుతున్నాయి. తొలి ప్రాధాన్యత ఓటుతో ఎవరు గెలిచే అవకాశం లేదన్నది స్పష్టంగా తేలిపోయింది. తొలి ప్రాధాన్యత ఓటుతో అభ్యర్థి విజయం సాధించాలంటే పోలైన ఓట్లలో చెల్లిన ఓట్లలో 50శాతానికంటే ఒక ఓటు అధికంగా రావలసి ఉంటుంది. ఏకపక్షంగా పోలింగ్ జరుగకపోవడం, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరికి ఓట్లు ఎక్కువగా పోల్‌కావడంతో తొలి ప్రాధాన్యత ఓటుతో ఎవరు గెలిచే అవకాశం లేదని భావిస్తున్నారు. దీనితో రెండవ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి ఎక్కువగా పోలయ్యాయి.. ఎవరు..ఎవరి తలరాతలు మార్చనున్నారు అన్నది అంతుపట్టకుండా మారింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 56 మంది పోటీలో ఉన్నా ఎలిమినేషన్ పద్ధతిలో ఓట్ల లెక్కింపు చేపట్టే క్రమంలో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థినుంచి మొదలు పెట్టి ఎలిమినేట్ చేస్తూ అతడి బ్యాలెట్‌లో రెండవ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వస్తే వారికి వాటిని కలుపుతూ వెళ్తారు. చివరికి మూడో స్థానంలో నిలిచే అభ్యర్థి బ్యాలెట్‌లో వచ్చిన రెండవ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి అనుకూలంగా వస్తాయో వారు గెలుపొందే అవకాశాలు ఉంటాయి. ఆ ఓట్లు రెండో స్థానంలో ఉన్నవారికి ఎక్కువగా వచ్చే పక్షంలో మొదటి అభ్యర్థి ఓడిపోవడానికి కూడా అవకాశాలుంటాయి. దీనితో మొదటి స్థానంలో నిలిచిన మిగతా అభ్యర్థుల కంటే కొంత ఎక్కువ సంఖ్యలో మెజార్టీ ఉంటేనే విజయం సాధించగలమని భావిస్తున్న అభ్యర్థులు లెక్కలు వేసుకుంటూ కాలం గడుపుతున్నారు.
కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డి తప్పకుండా మొదటి స్థానంలో ఉంటారని, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ రెండవ స్థానంలో, బీజేపీ అభ్యర్థి సి.అంజిరెడ్డి మూడవ స్థానంలో ఉంటారని గెలుపు తమదేనని కాంగ్రెస్‌నేతలు ధీమాగా చెబుతున్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం అన్ని ప్రాంతాల్లోనూ తమకు ఓటింగ్ జరిగినందున గెలుపు తమదేనని, రెండవ స్థానంలో నిలిచినా మూడవ అభ్యర్థి సెకండ్ ప్రాధాన్యత ఓటుతో తామే గెలుస్తామని చెబుతున్నారు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ బీసీ సెంటిమెంట్ బలంగా రావడంతో గెలుపు అవకాశాలు తనకే ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. మొదటి రెండు స్థానాల్లోనే ప్రసన్న హరికృష్ణ ఉంటారని, రెండవ ప్రాధాన్యతా ఓట్లు తనకు ఏకపక్షంగా అన్ని జిల్లాల్లో పోల్ కావడంతో విజయం సాధించేది అతనేనని బీసీ నాయకులు బలంగా చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి అంజిరెడ్డికి ప్రచారక్రమంలో క్యాడర్‌తో సమన్వయ లోపం ఏర్పడిందని, కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌తోపాటు స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు కష్టపడి పనిచేసినా పోలింగ్ బూత్‌ల పరిధిలో క్యాడర్‌కు అభ్యర్థుల అనుచరులకు గ్యాప్ వచ్చిందని జాతీయ నాయకత్వానికి నివేదిక పంపించారని సమాచారం. ఆయా ప్రాంతాల్లో స్థానిక కార్యకర్తలు, ప్రత్యర్థులవైపుమొగ్గు చూపారని, మరికొందరు రెండవ ప్రాధాన్యత ఓటును బీఎస్పీ అభ్యర్థికి అనుకూలంగా వేశారని దీనికి ఖచ్చితంగా గెలుస్తామనుకున్న స్థానంలో గట్టిపోటీ ఎదుర్కోవలసి వస్తున్నదని జాతీయ నాయకత్వానికి నివేదించడంతో ఇక్కడ గెలుపుపై ఆ పార్టీకే విశ్వాసం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. దీనితో పోటీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మఽధ్యే ఉంటుందని అంచనా వేస్తున్నారు. పోలింగ్ రోజు కనిపించిన పరిస్థితులు ముక్కోణపు పోటీ జరుగుతున్నదని అభిప్రాయం కల్పించిన నేపథ్యంలో ఎవరు గెలుస్తారు... అన్నది తేలికగా చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి.
ఫ ఉపాధ్యాయ స్థానంలో...
ఉపాధ్యాయ స్థానంలో అంచనాకు మించి పోలింగ్ జరుగడంతో విజయం ఎవరిని వరిస్తుందనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య, సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, పీఆర్‌టీయూ అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డితో పాటు మరో 12 మంది పోటీలో ఉన్నప్పటికీ ప్రధానంగా మల్క కొమురయ్య, వంగ మహేందర్‌రెడ్డికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు అధికంగా ఓట్లు పోలైనట్లు ఆ పార్టీ చెబుతుండగా, ఇతర జిల్లాల్లో మహేందర్‌రెడ్డి కూడా గట్టి పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ మాత్రం పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి గెలుస్తామని ఉపాధ్యాయ స్థానంపై ధీమాతో ఉన్నది. ఈ ఫలితాలపై కూడా ఉపాధ్యాయవర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి.
Updated Date - Mar 01 , 2025 | 02:23 AM