మున్సిపల్ పాలకవర్గాల గడువు పూర్తి
ABN, Publish Date - Jan 25 , 2025 | 01:37 AM
జిల్లాలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గాలకు ఈ నెల 26వ తేదీతో పదవీ కాలం పూర్తవుతుంది. 27 నుంచి ప్రత్యేకాధికారుల పాలన రానున్నది. ఈ సారి పాలకవర్గాలకు పదవీకాలంలో కరోనానే రెండేళ్ల కాలాన్ని మింగింది. అభివృద్ధి పనులు ముందుకు సాగలేదు. మున్సిపాలిటీలు నిధుల కొరతను ఎదుర్కొన్నాయి. ప్రభుత్వాల నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రాకపోవడంతో అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడింది.
- రేపటితో కౌన్సిల్ ముగింపు
- మంథని, సుల్తానాబాద్‌ల్లో చైర్మన్ల మార్పు...
- రెండేళ్ల పదవీకాలాన్ని మింగిన ’కరోనా...’
- నాలుగున్నరేళ్లు నిధుల కటకటే
- ప్రస్తుతం ఊపందుకున్న అభివృద్ధి పనులు...
- అపవాదులను మూటగట్టుకున్న రామగుండం కార్పొరేషన్
- 27 నుంచి ప్రత్యేక అధికారుల పాలన...
కోల్‌సిటీ, జనవరి 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గాలకు ఈ నెల 26వ తేదీతో పదవీ కాలం పూర్తవుతుంది. 27 నుంచి ప్రత్యేకాధికారుల పాలన రానున్నది. ఈ సారి పాలకవర్గాలకు పదవీకాలంలో కరోనానే రెండేళ్ల కాలాన్ని మింగింది. అభివృద్ధి పనులు ముందుకు సాగలేదు. మున్సిపాలిటీలు నిధుల కొరతను ఎదుర్కొన్నాయి. ప్రభుత్వాల నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రాకపోవడంతో అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడింది. కరోనా, నిధుల కొరత, ఎన్నికలు, పాలకవర్గాల పాలనపై ప్రభావం చూపింది. జిల్లాలో రామగుండం నగరపాలక సంస్థతో పాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలు ఉన్నాయి. 2020 జనవరి 27న పాలకవర్గాలు కొలువుతీరాయి. రామగుండంతోపాటు మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్‌ల్లో బీఆర్‌ఎస్ పాలకవర్గాలు అధికారాలు చేపట్టాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సుల్తానాబాద్, మంథనిల్లో అవిశ్వాసం పెట్టి చైర్మన్లను మార్చారు. రామగుండంలో మేయర్ బంగి అనీల్‌కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో అవిశ్వాసం లేకుండానే అధికార మార్పిడి జరిగింది. పెద్దపల్లి మున్సిపాలిటీలో పాలకవర్గ గడువు తక్కువగా ఉండడంతో అవిశ్వాసంపై దృష్టి పెట్టలేదు.
2020లో కొలువుతీరిన పాలకవర్గాలు...
2020జనవరిలో మున్సిపల్ ఎన్నికలు జరుగగా పాలకవర్గాలు 2020 జనవరి 27న కొలువుదీరాయి. రామగుండం నగరపాలక సంస్థలో 50డివిజన్లకుగాను కాంగ్రెస్ 11, బీఆర్‌ఎస్ 18, బీజేపీ 6, ఫార్వర్డ్ బ్లాక్ 9 గెలుపొందగా ఏడుగురు ఇండిపెండెంట్లు గెలిచారు. పార్టీ ఫిరాయింపులు, ఇండిపెండెంట్ల మద్దతుతో బీఆర్‌ఎస్ కార్పొరేటర్ బంగి అనీల్‌కుమార్ మేయర్‌గా ఎన్నికయ్యారు. మంథనిలో 13వార్డులు ఉండగా 11బీఆర్‌ఎస్, రెండు కాంగ్రెస్ గెలిచాయి. పుట్ట శైలజ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. సుల్తానాబాద్‌లో 15వార్డులకుగాను 9బీఆర్‌ఎస్ గెలుపొందగా సునీత చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. పెద్దపల్లిలో 36వార్డులకు గాను బీఆర్‌ఎస్ 24, కాంగ్రెస్ 5, బీజేపీ 2, ఎంఐఎం 2, ఇండిపెండెంట్లు ముగ్గురు గెలిచారు. దాసరి మమత చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మంథని, సుల్తానాబాద్‌ల్లో అవిశ్వాసాలు పెట్టారు. మంథనిలో పెండ్రి రమాసురేష్‌రెడ్డి, సుల్తానాబాద్‌లో గాజుల లక్ష్మీరాజమల్లు చైర్‌పర్సన్లుగా ఎన్నికయ్యారు.
రెండేళ్ల పదవీకాలాన్ని మింగిన కరోనా...
కరోనా విపత్తు ప్రస్తుత పాలకవర్గాల రెండేళ్ల పాలనకు విఘాతం కలిగించింది. లాక్‌డౌన్‌లతో జన జీవనం పూర్తిగా స్తంభించింది. సుమారు రెండేళ్లపాటు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. మున్సిపాలిటీల్లో నిధుల కొరత ఏర్పడింది. అభివృద్ధి పనులతోపాటు ఇండ్ల నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పడిపోయాయి. దీంతో కరోనా కాలంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు తమ తమ వార్డుల్లో శానిటైజేష్ చేయించడం, నిత్యావసరాలు, మాస్క్‌లు పంపిణీ చేయడం వరకే విధులు నిర్వహించారు. ప్రజల కనీస వసతులైన రోడ్లు, డ్రైన్లు, వీధిదీపాలు, మంచినీటి పైప్‌లైన్ల పనులకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి.
ప్రభుత్వ నిర్ణయాలతో స్థానిక సంస్థలకు ఖజానాలు ఖాళీ...
గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న కొన్ని విధానపరమైన నిర్ణయాలు స్థానిక సంస్థల ఖజానాలను ఖాళీ చేశాయి. సాధాణంగా స్టాంప్ డ్యూటీ, ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్ తదితర నిధులు నేరుగా మున్సిపాలిటీలకు చేరేవి. ప్రభుత్వం ఈ నిధులను కూడా మళ్లించుకున్నది. పట్టణ ప్రగతి పేర నిధులు మంజూరు చేసింది. రెండేళ్లు నిధులు సజావుగానే విడుదలైనా తరువాత బ్రేక్ పడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరిగిన పెద్దపల్లి, రామగుండం వంటి మున్సిపాలిటీలకు తీవ్ర నష్టం జరిగింది. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో భూ బదలాయింపులకు సంబంధించిన రూ.30కోట్ల స్టాంప్ డ్యూటీ సొమ్మే మున్సిపాలిటీకి రాకుండా రాష్ట్ర ఖజానాకు చేరింది. మళ్లీ ఆ నిధులను విడుదల చేయలేదు. గ్రాంట్లను కూడా ప్రభుత్వం వాడుకుని విడుదల చేయడంలో తీవ్ర జాప్యాలు ఏర్పడ్డాయి. సీఎంఏ వంటి నిధులు విడుదల కాకపోవడంతో పనులు చేయమని కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. డీఎంఎఫ్‌టీ వంటి నిధులు మున్సిపాలిటీలకు మంజూరు కాగా వాటిని ప్రభుత్వం ఖజానాకు మళ్లించుకోవడంతో జిల్లాలోని మున్సిపాలిటీల్లో పనులు నిలిచిపోయాయి.
టీయూఎఫ్‌ఐడీసీతో ఊపందుకున్న అభివృద్ధి పనులు...
రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగడంతో జిల్లాలోని మున్సిపాలిటీలకు గతేడాది టీయూఎఫ్‌ఐడీసీ నిధులు మంజూరయ్యాయి. రామగుండం నగరపాలక సంస్థతోపాటు మంథని, పెద్దపల్లిలో ఈ నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కానీ పాలకవర్గాల పదవీకాలాలు ముగుస్తున్న సమయంలో అభివృద్ధి పనులు జరుగుతుండడంతో కౌన్సిలర్లు నిరాశకు లోనవుతున్నారు. పెద్దపల్లి, మంథనిలకు అమృత్ ద్వారా మంచినీటి పథకాలు మంజూరు కాగా రామగుండానికి ఎస్‌టీపీలు మంజూరయ్యాయి.
అపవాదులను మూటగట్టుకున్న రామగుండం కార్పొరేషన్
రామగుండం మున్సిపాలిటీగా ఏర్పడిన తరువాత ప్రసుత్త పాలకవర్గంలోని ప్రజాప్రతినిధులపై వచ్చినన్ని ఆరోపణలు మరే పాలకవర్గంపై రాలేదు. ముఖ్యంగా రామగుండంలో 14వ ఆర్థిక సంఘం నిధులతో ఆగ్రోస్ ద్వారా కొనుగోలు చేసిన వాహనాల కొనుగోలులో కుంభకోణం పాలకవర్గానికే మచ్చ తెచ్చింది. వాహనాలు రాకున్నా కూడా ఏడాది ముందే రూ.8కోట్లు చెల్లించడం దుమారాన్ని లేపింది. అలాగే కార్పొరేషన్‌లోని పారిశుధ్య విభాగంలో పనులు పెట్టిస్తామని పలువురు కార్పొరేటర్లు లక్షల రూపాయలు వసూలు చేసి ఇప్పటికీ తిప్పుకుంటున్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ ఉద్యోగాల దందా, దళితబంధు, గృహలక్ష్మిల్లో వసూళ్లకు పాల్పడి డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు ఠాణాలను ఆశ్రయించడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. మున్సిపల్ స్ర్కాప్ చోరీకి గురికావడం చర్చనీయాంశమైంది. మున్సిపాలిటీకి సంబంధించి కమిషనర్‌గా విధులు నిర్వహించిన ఆర్‌డీవో శివకుమార్ ఏసీబీకి పట్టుబడ్డాడు. జరుగని పనులకు బిల్లులు రికార్డు చేసిన విషయాలు వెలుగు చూశాయి. రూ.3కోట్ల బిల్లులు పాలకవర్గం తిరస్కరణకు గురయ్యాయి.
27 నుంచి ప్రత్యేకాధికారుల పాలన...
జిల్లాలోని నగరపాలక సంస్థతో పాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలకు ఈ నెల 27 నుంచి ప్రత్యేకాధికారుల పాలన జరుగనున్నది. రామగుండానికి ప్రస్తుతం అదనపు కలెక్టర్ కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. కలెక్టర్‌ను ప్రత్యేకాధికారిగా నియమించే అవకాశం ఉంది. పెద్దపల్లికి అదనపు కలెక్టర్(రెవెన్యూ)కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. మంథని, సుల్తానాబాద్‌ల్లో ఆర్‌డీవోలకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
Updated Date - Jan 25 , 2025 | 01:37 AM