రైతులకు చేరువలో ‘సహకారం’
ABN, Publish Date - Jan 10 , 2025 | 01:13 AM
జిల్లాలో మరిన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను నెలకొల్పేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
జిల్లాలో మరిన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను నెలకొల్పేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీటి ద్వారా రైతులకు సహకార సేవలు మరింత చేరువ కానున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 20 సహకార సంఘాలు ఉండగా, మరో పది సంఘాలు పెరిగే అవకాశాలున్నాయి. సహకార సంఘాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఆ మేరకు పది రోజుల క్రితం కలెక్టర్ అధ్యక్షతన నాబార్డు డీడీఎం, కేడీసీసీ బ్యాంకు సీఈవో, జిల్లా సహకార శాఖాధికారి, జిల్లా వ్యవసాయ, పశుసంవర్థక, మత్స్య శాఖాధికారులు సభ్యులుగా ఉండే జాయింట్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలో ఎక్కడెక్కడా కొత్తగా సహకార సంఘాలను ఏర్పాటు చేయవచ్చనే విషయమై చర్చించారు. జిల్లాలో మొత్తం 14 మండలాలు ఉండగా, మండలానికి కనీసం రెండు సంఘాలైనా ఉండేలా చర్చలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించినట్లు తెలుస్తున్నది. జిల్లాలో ప్రస్తుతం 20 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. సుల్తానాబాద్ మండలంలో సుల్తానాబాద్, గర్రెపల్లి, కనుకుల, చిన్నకల్వల, సుద్దాల, ఎలిగేడు మండలంలో ఎలిగేడు, ధుళికట్ట, జూలపల్లి మండలంలో జూలపల్లి, ఓదెల మండలంలో పొత్కపల్లి, కాల్వశ్రీరాంపూర్ మండలంలో కాల్వశ్రీరాంపూర్, కూనారం, పెద్దపల్లి మండలంలో పెద్దపల్లి, అప్పన్నపేట. ధర్మారం మండలంలో ధర్మారం, పత్తిపాక, కమాన్‌పూర్ మండలంలో కమాన్‌పూర్, ముత్తారం మండలంలో ముత్తారం, మంథని మండలంలో మంథని, పాలకుర్తి మండలంలో కన్నాల, రామగుండం మండలంలో మేడిపల్లిలో సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లో 52,316 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘాల ద్వారా రైతులకు పంట రుణాలతో పాటు దీర్ఘకాలిక రుణాలు, బంగారం తాకట్టు రుణాలు, వాహన రుణాలు, ఇతర రుణాలు అందజేస్తున్నారు. అలాగే ఎరువులు, క్రిమిసంహార మందులు, విత్తనాల విక్రయాలు చేపడుతున్నారు. రైతులు పండించిన పంట ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లాలో 250కి పైగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రతి సీజన్‌లో ఏర్పాటుచేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలను నిర్వహించడం వల్ల కమీషన్ రూపేణా ప్రతి ఏటా 12 కోట్ల రూపాయలు సహకార సంఘాలకు పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ ద్వారా ఆదాయం సమకూరుతున్నది. ఈ డబ్బులు సంఘం అభివృద్ధికి ఎంతో దోహద పడుతున్నాయి. వాణిజ్య బ్యాంకులు రైతులకు పంట రుణాలు ఇవ్వనప్పుడు రైతులకు సహకార సంఘాల ద్వారానే పంట రుణాలు ఇచ్చేవాళ్లు. ఆయా సహకార సంఘాల్లో అక్రమాలు, అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరగడంతో నష్టాల పలయ్యాయి. దీంతో జిల్లాలో కొన్ని సంఘాలు మూతపడ్డాయి. ప్రస్తుతం ఉన్న సంఘాల్లో జవాబుదారీతనం, పారదర్శకత పెరగడంతో నిధుల దుర్వినియోగం తగ్గుముఖం పట్టింది.
సాధ్యాసాధ్యాలపై పరిశీలన..
ప్రతి మండలానికి రెండు సహకార సంఘాలు ఉండేలా చర్యలు తీసుకునేందుకు రీఆర్గనైజేషన్ చేయాలని ఆదేశించిన మేరకు జిల్లాలో కసరత్తు ప్రారంభించారు. మంథని, ముత్తారం, కమాన్‌పూర్, ఓదెల, జూలపల్లి మండలాల్లో కేవలం ఒక సహకార సంఘం మాత్రమే ఉండగా, జిల్లాల పునర్విభజన సందర్భంగా కొత్తగా ఏర్పడ్డ అంతర్గాం, రామగిరి మండలాల్లో సహకార సంఘాలు లేకపోగా, జిల్లాలో గుంజపడుగు, గర్రెపల్లి, రాఘవాపూర్, జనగామ, కొలనూర్ మండలాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. వీటిలో గుంజపడుగు, గర్రెపల్లి మండలాల ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి. కొత్తగా సహకార సంఘాలు మంథని మండలం గుంజపడుగు, వెంకటాపూర్, అంతర్గాం, రామగిరి, ఓదెల మండలంలో కొలనూర్, తదితర ప్రాంతాల్లో ఏర్పడే అవకాశాలున్నాయి. ఎక్కడైతే సంఘాన్ని ఏర్పాటు చేస్తారో అక్కడ ఉండే వనరులు, రైతుల సంఖ్య, గ్రామాల సంఖ్య, భవనం, గోదాముల నిర్మాణానికి కావాల్సిన ప్రభుత్వ స్థలం ఎంత ఉంది, సంఘం ఏర్పాటు చేస్తే ఏటా వచ్చే ఆదాయం ఎంత, ఆ డబ్బులతో సిబ్బంది జీతభత్యాలు, సంఘం నిర్వహణ సాధ్యాసాధ్యాలపై పరిశీలన జరుపుతున్నారు. అనువుగా ఉండే ప్రాంతాల్లో జిల్లాకు చెందిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, రాజ్‌ఠాకూర్ మక్కాన్ సింగ్ సూచనల మేరకు సహకార సంఘాలను ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించే అవకాశమున్నది.
Updated Date - Jan 10 , 2025 | 01:13 AM