అర్ధాంతరంగా నిలిచిన బయోమైనింగ్
ABN, Publish Date - Feb 18 , 2025 | 01:14 AM
నగరంలోని పలు డివిజన్ల ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించడమేకాకుండా వాహనదారులను, నగరవాసులను డంపింగ్ యార్డు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
- చెత్త తీయకుండానే చేతులెత్తేసిన కాంట్రాక్టర్
- ఎండకాలంలో మంటలు... చలికాలంలో పొగ
- పొగ, గాలి కాలుష్యంతో ఇబ్బందులు
కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): నగరంలోని పలు డివిజన్ల ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించడమేకాకుండా వాహనదారులను, నగరవాసులను డంపింగ్ యార్డు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ సమస్య నుంచి విముక్తి కలిపించేందుకు కోట్ల రూపాయలతో చేపట్టిన బయోమైనింగ్ ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచిపోయింది.
ఫ 2023లో ప్రారంభం
కరీంనగర్ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ నిధులతో డంపింగ్ యార్డులో బయోమైనింగ్ చేపట్టాలని 2023 జూన్‌లో నిర్ణయించారు. ఈ మేరకు డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తను పూర్తిగా శుభ్రం చేసేందుకు ఓ కార్పొరేట్ కంపెనీకి ఏడాది గడువుతో కాంట్రాక్టు ఇచ్చారు. మొదట్లో బయోమైనింగ్ కొంత వేగంగా చేపట్టారు. అనంతరం అది నెమ్మదించింది. ఏడాదిలో చెత్త సమస్యను పూర్తిగా తొలగించాల్సిన కాంట్రాక్టర్‌కు మందకొడిగా బయోమైనింగ్ ప్రక్రియ చేపట్టడమే కాకుండా చెత్తను ఎక్కడికి తరలిస్తున్నాడో... ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పలతే. ఆరు నెలల క్రితం బయోమైనింగ్‌ను పూర్తిగా నిలిపివేశాడు. మైనింగ్‌లో వెలువడిన చెత్తను కూడా తరలించకుండా చేతులెత్తేశాడు. తనకు పార్ట్‌పేమెంట్‌గా డబ్బులు ఇస్తే తప్ప పనులు చేయనంటూ మొండికేశాడు. దీంతో డంపింగ్ యార్డు సమస్య మొదటికొచ్చింది. చెత్తను తొలగిస్తే తప్ప డబ్బులివ్వబోమని నగరపాలక సంస్థ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చినా స్పందన లేక పోవడంతో బయోమైనింగ్ ఇక ముందుకు సాగే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటి వరకు దాదాపు రెండు కోట్లు ఖర్చు చేశారు. అయినూ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది.
ఫ నిధులు కేటాయిస్తామని కేంద్ర మంత్రి హామీ
ఇటీవల కరీంనగర్‌కు వచ్చిన కేంద్రపట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్‌లాల్‌కట్టర్ డంపింగ్ యార్డు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని, అందుకు అవసరమయ్యే నిధులను కేటాయిస్తామని ప్రకటిం చారు. కేంద్రం చొరవ చూపి శాశ్వత చర్యలు చేపట్టే వరకు ఇక డంపింగ్ యార్డు సమస్య తీరేలా లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ చాహత్‌బాజ్‌పాయ్ డంపింగ్‌యార్డుకు చెత్తను తగ్గించి రెడ్యూస్, రీయూజ్, రీసర్కిల్ (ఆర్‌ఆర్‌ఆర్) విధానాన్ని అమలు చేయాలని సూచిస్తున్నా ఇంకా చెత్తను యార్డుకు తరలిస్తూనే ఉన్నారు. చెత్తను తగ్గించి, ఉన్న చెత్తను తొలగించాలని నగరవాసులు కోరుతున్నారు.
ఫ నరకం చూపిస్తున్న డంపింగ్‌యార్డు
నగరంలో నిత్యం టన్నుల కొద్ది వెలువడుతున్న చెత్తను ఎక్కడ వేయాలనే ప్రశ్న కొన్నేళ్లుగా వెంటాడుతోంది. ప్రత్యామ్నాయం లేక దశాబ్ద కాలం క్రితం నాటి డంపింగ్‌యార్డుకు తీసుకొచ్చి పడేస్తున్నారు. ఎండాకాలం వచ్చిందంటే చాలు చెత్తగుట్ట అంటుకొని మంటలు వ్యాప్తి చెందుతున్నాయి. అధికారులు హడావుడిగా అక్కడికి వెళ్లి మంటలు ఆర్పుతారు. మంటలతోపాటు దట్టమైన పొగ వ్యాపిస్తుండటంతో ఆ ప్రాంత వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏడాదిలో వర్షాకాలం ఒకటిరెండు నెలలు మినహా మిగిలిన 10 నెలలు డంపింగ్ యార్డు నుంచి మంటలు, పొగ వ్యాపించడం కొనసాగుతూనే ఉంది. దీంతో బైపాస్ రోడ్డుపై వెళ్లే వాహనాదారులు, సమీపంలో ఉన్న కాలనీ వాసులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. పొగ, గాలి కాలుష్యంతోపాటు, దుర్వాసన భరించలేక అనారోగ్యాలకు గురవుతున్నారు. పొగ కారణంగా చెత్త తీసుకొచ్చే వాహనాలు డంపింగ్ యార్డు లోపలికి వెళ్లడం కష్టంగా మారుతోంది. గత వేసవి కాలంలో రెండు సార్లు డంపింగ్‌యార్డులో పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తిచెందడంతో ఫైరింజన్లు, వాటర్ ట్యాంకర్లు, జెట్టింగ్ మిషన్ల ద్వారా మంటలను ఆర్పారు.
ఫ రోజుకు 135 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ :
నగరంలోని 86,400లకుపైగా ఉన్న కుటుంబాల నుంచి రోజుకు 135 నుంచి 155 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. దీంతో ప్రతిరోజు వస్తున్న చెత్తతో డంపింగ్‌యార్డులో దాదాపు 260 నుంచి 275 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయి గుట్టగా ఏర్పడింది. నగరంలో ఒకటే డంపింగ్ యార్డు ఉండడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్ గ్రామశివారులో డంపింగ్‌యార్డు కోసం ఆనాటి కలెక్టర్ స్థలం కేటాయించారు. అక్కడ డంపింగ్‌యార్డు ఏర్పాటుకు నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది. ఆ సమయంలో గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. నగరంలో నుంచి చెత్తను తీసుకువచ్చి తమ గ్రామ సమీపంలో వేస్తే ఊరుకోబోమని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీంతో అక్కడికి డంపింగ్ యార్డు తరలింపు చర్యలను విరమించుకున్నారు.
Updated Date - Feb 18 , 2025 | 01:14 AM