దూకుడు పెంచిన ఏసీబీ
ABN, Publish Date - Mar 08 , 2025 | 01:05 AM
జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి. చిరుద్యోగులే కాదు పెద్దస్థాయిలో ఉన్న అధికారులను సైతం వదలనంటోంది ఏసీబీ. ఉన్నతాధికారి అయినా...సామాన్య ఉద్యోగి అయినా అవినీతికి పాల్పడితే అంతే సంగతులంటూ చేతల్లో చూపిస్తోంది.
- అవినీతి అధికారులే టార్గెట్
- మూడు నెలల్లో ముగ్గురు అధికారుల అరెస్టు...మరో ఇద్దరు మధ్యవర్తులు
- కలకలం రేపుతున్న ఏసీబీ వరుస దాడులు
జగిత్యాల, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి. చిరుద్యోగులే కాదు పెద్దస్థాయిలో ఉన్న అధికారులను సైతం వదలనంటోంది ఏసీబీ. ఉన్నతాధికారి అయినా...సామాన్య ఉద్యోగి అయినా అవినీతికి పాల్పడితే అంతే సంగతులంటూ చేతల్లో చూపిస్తోంది. అవినీతి అధికారుల విషయంలో ఏసీబీ దూకుడుతో సరికొత్త గుబులు స్టార్ట్ అయింది. మూడు నెలల్లో ముగ్గురు అధికారులు ఏసీబీకి పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. వరుస ఘటనలతో జిల్లా అధికారుల్లో కలవరం మొదలైంది.
- మధ్యవర్తులను సైతం...
ఇటీవల కాలంలో ఏసీబీ అధికారులు అవినీతికి పాల్పడుతున్న వారిని పట్టుకునే విషయంలో దూకుడు పెంచినట్టుగా స్పష్టం అవుతోంది. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా దొరికితే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు మధ్యవర్తుల ద్వారా లంచం తీసుకుంటున్న ఘటనలు కూడా వదిలిపెట్టడం లేదు. మధ్యవర్తిత్వం చేసిన వారికి బాధితులకు ఎలాంటి సంబంధాలు లేకపోవడంతో పాటు అవినీతికి పాల్పడే అధికార యంత్రాంగం ఎంచుకున్న సరికొత్త మార్గాన్ని కూడా ట్రేస్ చేస్తున్నారు. దీంతో మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న వారు కూడా ఏసీబీ కేసుల్లో ఇరుక్కొక తప్పడం లేదు. అధికారులకు వంత పాడేందుకు ప్రయత్నిస్తే ప్రైవేటు వ్యక్తులు అయినా సరే చట్టాలకు పనిచెప్పి తీరుతామని అంటున్నారు ఏసీబీ అధికారులు. ఈ యేడాది జనవరిలో మెట్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన సమయంలో ప్రైవేటు వ్యక్తి అయిన డాక్యుమెంట్ రైటర్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు. గతంలో మధ్యవర్తులు డబ్బులు తీసుకుంటే వారిని అరెస్టు చేసే విధానాన్ని అవలంభించకపోయేవారు. కొంతకాలంగా వీరిని కూడా పట్టుకుంటుండడంతో అధికార యంత్రాంగం ఎంచుకున్న అవినీతి దారులను మూసివేసే ప్రయత్నం ఏసీబీ చేస్తున్నట్లుగా స్పష్టమవుతోంది.
- అధికారుల్లో ఆందోళన..
జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అవినీతి అధికారులను టార్గెట్ చేస్తూ ఏసీబీ నిఘా పెంచడంతో అధికారుల్లో ఆందోళన కలుగుతోంది. ఏసీబీ అధికారుల వరుసదాడులు జరుగుతున్నట్లు ప్రచారం నెలకొనడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏసీబీ అధికారుల దాడులతో ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు. జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖ, మున్సిపల్ శాఖ, పోలీసు శాఖ, రవాణా శాఖల్లో ఏసీబీ సోదాలు జరగడం, ముగ్గురు అధికారులు పట్టుబడ్డారు. దీంతో మిగితా శాఖ ఉద్యోగులు అప్రమత్తమయ్యారు.
ఫ గులాబీ రంగు ద్రావణం సీసాలు కీలకం..
ప్రభుత్వ శాఖలో పనిచేసే కొందరు ఉద్యోగులు, సిబ్బంది ప్రజల నుంచి లంచాలను తీసుకుంటూ పట్టుబడుతున్న సందర్భాల్లో గులాబీ రంగు ద్రావణం ఉండే సీసాలను మీడియాకు చూపిస్తుంటారు. లంచగొండి ఉద్యోగులను పట్టుకున్నాక వారు తీసుకున్న కరెన్సీ నోట్లతో పాటు పింక్ రంగులో ద్రావణం ఉండే సీసాలను ఎదుట ఉంచుతారు. ఏసీబీ అధికారులు బాధితులకు ముందుగానే కరెన్సీ నోట్లు ఇచ్చి వాటిని ఉద్యోగులకు లంచంగా ఇవ్వమంటారు. ఈ క్రమంలో ఏసీబీ వారు ఆ కరెన్సీ నోట్లకు ముందుగా ఫినాల్‌ఫ్తలీన్ అనే పౌడర్‌ను రాస్తారు. ఆ పౌడర్ మన కళ్లకు కనిపించదు. ఈక్రమంలో బాధితులు ఆ నోట్లను ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వగానే ఏసీబీ వారు దాడిచేసి ఆ ఉద్యోగులను అదుపులోకి తీసుకుంటారు. అనంతరం వారి వద్ద ఉండే లంచం ఇచ్చిన కరెన్సీని స్వాధీనం చేసుకుంటారు. తర్వాత ప్రభుత్వ అధికారుల చేతులను సోడియం బైకార్బోనేట్ మిశ్రమంలో ముంచుతారు. ద్రావణం పింక్ రంగులోకి మారుతుంది. అలా వారు లంచం తీసుకున్నారని చెప్పేందుకు పింక్ రంగులోకి మారిన ఆ మిశ్రమమే సాక్ష్యమని సంబంధిత వర్గాలు అంటున్నాయి.
జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనలు..
- మార్చి 6వ తేదీన ధర్మపురి మున్సిపల్ కమిషనర్ కందుకూరి శ్రీనివాస్ కార్యాలయంలో పనిచేసే కాంట్రాక్టు ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ మహేశ్ వద్ద వేతనం చెల్లింపు కోసం రూ. 20 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
- ఈనెల 5వ తేదీన జిల్లాలోని కోరుట్ల ఎస్‌ఐ శంకరయ్య ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. కోరుట్ల మండలం జోగినిపల్లి శివారులో మామిడితోటలో పేకాట ఆడుతూ ఎనిమిది మంది పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ. 23 వేల నగదు, ఎనిమిది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న ఎస్‌ఐ శంకరయ్య సెల్ ఫోన్ రిలీజ్ చేయడానికి శ్రీనివాస్ అనే వ్యక్తి వద్ద ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏబీసీ అధికారులు పట్టుకున్నారు.
- ఈ యేడాది జనవరి 15వ తేదీన మెట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ల్యాండ్ మార్ట్‌గేజ్ చేసేందుకు మెట్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్ తిఆసిఫోద్దిన్, డాక్యుమెంట్ రైటర్ రవి, ఆఫీస్ సబార్డినేట్ రవి కలిసి ఐదువేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
- ఈ యేడాది ఫిబ్రవరి 7వ తేదీన హన్మకొండలో పనిచేస్తున్న డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ పుప్పాల శ్రీనివాస్‌కు చెందిన జగిత్యాలలోని గృహంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఫిర్యాదు మేరకు జగిత్యాలలో ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
- 2024 డిసెంబరు 16వ తేదీన మామిడి కర్రను తరలించడానికి అనుమతి కోసం 4,500 రూపాయలు లంచం తీసుకుంటూ జగిత్యాల డీఆర్‌వో హపీజోద్దిన్ పట్టుబడ్డారు.
- 2024 ఏప్రిల్ 29వ తేదీన బీర్‌పూర్ పోలీస్‌స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మనోహర్ ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు.
- 2024 జూన్ 21వ తేదీన రాయికల్ ఎస్‌ఐ అజయ్ మరొకరు పుల్లూరి రాజు రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కారు.
Updated Date - Mar 08 , 2025 | 01:05 AM