John Wesley : సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్‌వెస్లీ
ABN, Publish Date - Jan 29 , 2025 | 03:57 AM
సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో ఉండనున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అమరచింతకు చెందిన వెస్లీ ప్రస్తుతం సీపీఎం అనుబంధ కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి( కేవీవీపీఎస్) రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. సీపీఎం
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా 14 మంది
అనూహ్యంగా తెరమీదకు పాలమూరు వాసి
తొలిసారిగా దళిత నేతకు దక్కిన అవకాశం
వామపక్షాలను ఓట్లు, సీట్లతో పోల్చొద్దు: వెస్లీ
సంగారెడ్డిలో జరిగిన రాష్ట్ర మహాసభల్లో ప్రకటన..
60 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల ఆమోదం
సంగారెడ్డి/అమరచింత/హైదరాబాద్ జనవరి 28 (ఆంధ్రజ్యోతి): సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో ఉండనున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అమరచింతకు చెందిన వెస్లీ ప్రస్తుతం సీపీఎం అనుబంధ కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి( కేవీవీపీఎస్) రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. సీపీఎం రాష్ట్ర చరిత్రలో దళితుడికి రాష్ట్ర కార్యదర్శి పదవి దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. జాన్ వెస్లీ సీపీఎంలో మూడు దశాబ్దాలుగా వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. సంగారెడ్డిలో ఈనెల 25 నుంచి జరుగుతున్న సీపీఎం మహాసభలు మంగళవారం ముగిశాయి. చివరిరోజున పార్టీ ప్రతినిధులంతా 60 మంది రాష్ట్ర కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సభ్యుల్లో ఒకరు రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాల్సి ఉండడంతో మెజారిటీ అభిప్రాయం మేరకు అనూహ్యంగా జాన్‌వెస్లీ పేరు తెరమీదకొచ్చింది. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా జి.నాగయ్య, ఎస్. వీరయ్య, పోతినేని సుదర్శన్, జూలకంటి రంగారెడ్డి, టీ.జ్యోతిని ఎన్నుకున్నారు. వీరితోపాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా చుక్క రాములు, పాలడుగు భాస్కర్, టి.సాగర్, మల్లు లక్ష్మి, ఎండీ అబ్బాస్, పి. ప్రభాకర్, నున్న నాగేశ్వరరావు, బండారు రవికుమార్, ఎండీ జహంగీర్‌లను మహాసభ ఎన్నుకుంది.
నిరుపేద కుటుంబం
జాన్‌వెస్లీ తల్లిదండ్రులు అమరచింతలోని ఎస్సీ కాలనీలోని చిన్నపాటి ఇంట్లో ఉండేవారు. కొద్దిపాటి వ్యవసాయం చేస్తూ, బీడీ పనితో జీవనం కొనసాగించేవారు. జాన్‌వెస్లీ తండ్రి మోజెస్, తల్లి బేతమ్మలకు ఐదుగురు సంతానం. వెస్లీ నాలుగో కుమారుడు. పదో తరగతి వరకు అమరచింత ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకొని ఇంటర్ ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పూర్తి చేశారు. డిగ్రీ గద్వాల ఎంఎల్‌డీ కళాశాలలో పూర్తి చేసిన వెస్లీ విద్యార్థి దశ నుంచే పాలేర్ల ఉద్యమానికి ఆకర్షితులై కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాల్లో పాల్గొన్నారు. మొదట ఆర్‌ఎ్‌సయూ, పీడీఎ్‌సయూ, డీవైఎ్‌ఫఐ, కేవీపీఎస్‌లలో పని చేశారు. పీడీఎ్‌సయూ రాష్ట్ర కార్యదర్శిగా, డీవైఎ్‌ఫఐ ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శిగా, కేవీవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలోనే దళిత సమస్యలపై ఆయన చేసిన పోరాటాల ఫలితంగానే అప్పటి ప్రభుత్వం జస్టిస్ పున్నయ్య కమిషన్, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్‌లు తీసుకొచ్చాయని పార్టీ వర్గాలు చెబుతుంటాయి. ప్రస్తుతం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా ఉంటూ వనపర్తి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లాలకు పార్టీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్‌వెస్లీ ఎన్నికపై సీపీఎం నాయకులు వివిధ వర్గాల ప్రజలు అమరచింతలో సంబురాలు జరుపుకొన్నారు. మంగళవారం రాత్రి అమరచింత బస్టాండ్ సెంటర్‌లో బాణసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు.
రేవంత్ సర్కారు హామీలను నెరవేర్చడం లేదు: జాన్‌వెస్లీ
రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం హామీలను నెరవేర్చడం లేదని, గత ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహరించిందని సీపీఎం నూతన కార్యదర్శి జాన్‌వెస్లీ ఆరోపించారు. కార్యదర్శిగా ప్రకటించిన అనంతరం తొలిసారిగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని కూలీలు, కార్మికులు, బడుగు బలహీన వర్గాలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. ప్రజాసమస్యలపై తాను ముందుండి పోరాటాలను నడిపిస్తానని చెప్పారు. మతోన్మాద రాజకీయాలను ప్రొత్సహిస్తున్న బీజేపీ విధానాలపై తమ పోరాటం ఉంటుందన్నారు. వామపక్షాలను ఓట్లతోనూ, సీట్లతోనూ కొలమానం చేయవద్దని సూచించారు. రానున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నర్సిరెడ్డికి తమ మద్దతు ఇస్తున్నామని ఆయన ప్రకటించారు.
Updated Date - Jan 29 , 2025 | 03:57 AM