Peddagattu : పెద్దగట్టుకు పోటెత్తిన భక్త జనం
ABN, Publish Date - Feb 18 , 2025 | 05:03 AM
సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలోని దురాజ్‌పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు భక్తులు పోటెత్తారు. సోమవారం జాతర పరిసర ప్రాంతాలన్నీ జనంతో కిటకిటలాడాయి.
6 లక్షల మందికిపైగా వచ్చారని అంచనా
నైవేద్యం, జీవాల బలితో తల్లులకు మొక్కు
స్వామివారిని దర్శించుకున్న మంత్రి ఉత్తమ్
సూర్యాపేట/హైదరాబాద్, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలోని దురాజ్‌పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు భక్తులు పోటెత్తారు. సోమవారం జాతర పరిసర ప్రాంతాలన్నీ జనంతో కిటకిటలాడాయి. ఆదివారం అర్ధరాత్రి మాఘ పౌర్ణమి సందర్భంగా సూర్యాపేట మండలం కేసారం గ్రామం నుంచి దేవరపెట్టెను తీసుకుని పెద్దగట్టుకు చేర్చారు. ఆ ఘట్టంతో జాతర ప్రారంభమైంది. రెండో రోజు సోమవారం సౌడమ్మ, ఆకుమంచమ్మ, యలమంచమ్మ విగ్రహాలను పూజించారు. ప్రత్యేకంగా బోనాలు వండి నైవేద్యం సమర్పించి సౌడమ్మ తల్లికి మొక్కులు చెల్లించారు. పెద్దసంఖ్యలో జీవాలను దేవతలకు బలిచ్చారు. మహిళలు తలపై గంపలు పెట్టుకుని నృత్యాలు చేస్తూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. యాదవులు గజ్జెల లాగులు ధరించి, కటారీ విన్యాసాలతో భేరీలు మోగిస్తూ ఓ లింగా అంటూ నామస్మరణ చేశారు. మహిళలు పూనకాలతో ఊగిపోయారు. గుట్టపై నుంచి ఎటు చూసినా ఐదు కి.మీ. వరకు భక్తుల టెంట్లు, గుడారాలే కనిపించాయి. 6 లక్షల మందికి పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు.
నేడు పెద్దగట్టులో చంద్రపట్నం..
లింగమంతులస్వామి జాతర మూడో రోజైన మంగళవారం ఉదయం చంద్రపట్నం వేస్తారు. యాచకులతో కలిసి రాజులు, పూజారులు గుడి ప్రాంగణంలో చంద్రపట్నం వేసి భైరవునికి పోలు రాస్తారు. ఆదివారం అర్ధరాత్రి కేసారం గ్రామం నుంచి వచ్చిన ఎడ్ల బండ్లేకాక వివిధ వాహనాలు ప్రత్యేక పూజల అనంతరం కేసారానికి తిరుగు ప్రయాణమవుతాయి. భక్తులు చంద్రపట్నం వీక్షించడానికి భారీగా హాజరవుతారు.
సంప్రదాయాల పరిరక్షణకు కృషి: మంత్రి ఉత్తమ్
రాష్ట్రంలో సమ్మక్క-సారక్క జాతర తర్వాత దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతరకు అంతటి ప్రాశస్త్యం ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. సంప్రదాయాల రక్షణ కు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సోమవారం పెద్దగట్టు జాతరకు వెళ్లిన ఉత్తమ్.. ఆలయ ప్రాంగణంలో భక్తులతో కలిసి భేరీ మోగించి.. లింగమంతుల స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. 16వ శతాబ్దంలో మొదలైన ఈ జాతర పురాతన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని ఉత్తమ్ అన్నారు. జాతర ఏర్పాట్ల కోసం సీఎం రేవంత్‌రెడ్డి రూ.5 కోట్లను కేటాయించారని చెప్పారు. ఈ జాతరకు మన రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, ఛత్తీ్‌సగఢ్, మహారాష్ట్ర నుంచి 30 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని వెల్లడించారు. కాగా, లింగమంతులస్వామిని నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి దర్శించుకున్నారు.
Updated Date - Feb 18 , 2025 | 05:03 AM