వివాదాస్పదంగా మారిన భూ సర్వే
ABN, Publish Date - Feb 04 , 2025 | 11:47 PM
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని ముత్యంపల్లి పంచాయతీ గురువాపూర్ శివారులో మంగళవారం రెవెన్యూ అధికారులు పోలీసు సహకారంతో చేపట్టిన భూ సర్వే వివాదాస్పదంగా మారింది. 74 సర్వే నెంబరులో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించేందుకు అధికారులు సర్వే చేపట్టారు. విషయం తెలుసుకున్న స్ధానికులు అక్కడకు చేరుకుని సర్వేను అడ్డుకున్నారు.
అడ్డుకున్న స్థానికులు..-రైతు ఆత్మహత్యాయత్నం
-పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
-సర్వే పనులను తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు
కాసిపేట, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి) : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని ముత్యంపల్లి పంచాయతీ గురువాపూర్ శివారులో మంగళవారం రెవెన్యూ అధికారులు పోలీసు సహకారంతో చేపట్టిన భూ సర్వే వివాదాస్పదంగా మారింది. 74 సర్వే నెంబరులో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించేందుకు అధికారులు సర్వే చేపట్టారు. విషయం తెలుసుకున్న స్ధానికులు అక్కడకు చేరుకుని సర్వేను అడ్డుకున్నారు. 40 ఏళ్లుగా ఈ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులందరు భూమి వద్దకు చేరుకున్నారు. రైతు ఎగ్గి బాలయ్య భూమి కోల్పోతాననే భయంతో పురుగుల మందు తాగేందుకు యత్నించగా కాసిపేట ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ అడ్డుకుని పురుగు మందు డబ్బాను లాక్కుని పడేశాడు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా స్థానిక రైతులు మాట్లాడుతూ 74 సర్వే నెంబరులో ప్రభుత్వ భూమి ఉందని, కానీ కొందరు దళారులు అక్రమంగా పట్టా చేసుకుని భూమిని లాక్కనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 40 ఏళ్లుగా సాగులో ఉన్న తమకు అన్యాయం చేస్తే సహించబోమన్నారు. ప్రభుత్వ భూమిపై సమగ్ర సర్వే చేసి ఇన్నేళ్లుగా కాస్తులో ఉన్న తమకు న్యాయం చేయాలని స్ధానికులు అధికారులను కోరారు. ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వ పరంగా సర్వే చేసి అర్హులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ భోజన్న మాట్లాడుతూ ప్రభుత్వ భూమి ఎంత ఉందో గుర్తించేందుకే ప్రాథమికంగా సర్వే చేపట్టామని, ఎవరి పట్టా భూములను లాక్కోమని, సర్వేకు అందరు సహకరించాలని కోరారు.
Updated Date - Feb 04 , 2025 | 11:47 PM