ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Political Tension : దాడి.. ప్రతిదాడి!

ABN, Publish Date - Jan 08 , 2025 | 05:14 AM

ప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ రమేశ్‌ బిదూరీ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ.. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్‌ కార్యకర్తలు మంగళవారం మెరుపుదాడికి యత్నించారు. వారిని బీజేపీ కార్యకర్తలు

బీజేపీ కార్యాలయంపై దాడికి యూత్‌ కాంగ్రెస్‌ నేతల యత్నం

అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు.. ఇరువర్గాల మధ్య తీవ్రఘర్షణ.. రాళ్లు, కోడిగుడ్లు విసురుకుని కొట్టుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తం

దాడికి ప్రతిగా కాంగ్రెస్‌ ఆఫీసు ముట్టడికి బీజేపీ నేతల యత్నం.. ఇరుపార్టీల నేతలపై కేసులు.. 8 మంది కాంగ్రెస్‌ కార్యకర్తల అరెస్ట్‌

దాడి.. పిరికిపంద చర్య: కిషన్‌ రెడ్డి

మా కార్యకర్తలు తల్చుకుంటే గాంధీ భవన్‌

పునాదులు కూడా మిగలవ్‌: బండి సంజయ్‌

ఎవరు ఎవరిపై దాడి చేసినా ఉపేక్షించం: భట్టి

అఫ్జల్‌గంజ్‌/మంగళ్‌హాట్‌/మల్కాజిగిరి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ రమేశ్‌ బిదూరీ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ.. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్‌ కార్యకర్తలు మంగళవారం మెరుపుదాడికి యత్నించారు. వారిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో.. దాదాపు గంటన్నరపాటు ఇరు పార్టీల నాయకుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ దాడికి ప్రతిగా.. బీజేపీ శ్రేణులు కూడా గాంధీభవన్‌ వరకు వెళ్లడంతో రెండుచోట్లా కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం పన్నెండు నుంచి పన్నెండున్నర గంటల సమయంలో సుమారు 40 మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు, మరో నాలుగు వాహనాలపై మరి కొంతమంది నాయకులు బీజేపీ ఆఫీసు వద్దకు వచ్చారు. లోపలికి దూసుకుపోవడానికి ప్రయత్నించారు. పోలీసుల సమక్షంలోనే బారికేడ్లను తొలగించి కొందరు అవతలివైపు దూకారు. కార్యాలయంపై రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు వారిని అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల నేతలు ఆగ్రహంతో ఊగిపోతూ పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఫ్లెక్సీలు చింపేశారు. తోపులాటలు, దూషణలతో అక్కడ పరిస్థితి రణరంగంగా మారింది. నిరసనకారులు ప్రధాని నరేంద్రమోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యాలయం లోపల ఉన్న బీజేపీ నాయకులకు గాయాలయ్యాయి. ముగ్గురు సెక్యూరిటీ గార్డులు, పలువురు బీజేపీ నేతలతోపాటు. అబిడ్స్‌ ఇన్‌స్పెక్టర్‌కు గాయాలయ్యాయి.


కాంగ్రెస్‌ కార్యాలయంపైకి..

తమ పార్టీ ఆఫీసుపై కాంగ్రెస్‌ నేతల దాడిని నిరసిస్తూ.. 30-40 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు కొందరు గాంధీభవన్‌ ముట్టడికి బయల్దేరారు. అడ్డుకున్న పోలీసులను తోసేసి అక్కడికి చేరుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి, రాహుల్‌ గాంధీకి, కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు నచ్చజెప్పినా వినలేదు. దీంతో భద్రతా బలగాలు నాలుగువైపులా వారిని చుట్టుముట్టి బలవంతంగా ఈడ్చుకెళ్లి వ్యాన్‌లోకి ఎక్కించారు. బైక్‌లపై గాంధీభవన్‌ వైపు వెళ్లేందుకు యత్నించిన పలువురు కార్యకర్తలను కూడా పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. కాగా.. కాంగ్రెస్‌ నేతల దాడిలో గాయపడిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కాసం వెంకటేశ్వర్లును నాంపల్లి కేర్‌ ఆస్పత్రికి తరలించారు. ఆయన్ను పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్‌.. ఆయన తలకు బలమైన గాయం అయిందని తెలిపారు. కాగా.. బీజేపీ కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అబిడ్స్‌ పోలీసులు మంగళవారం రాత్రి 8 గంటల సమయానికి ఎనిమిది మంది కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో 40 నుంచి 60 మంది వరకు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, మరింత మందిని అదుపులోకి తీసుకుంటామని అబిడ్స్‌ పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు.. గాంధీభవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించిన బీజేపీ నేతలపై బేగంబజార్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇరుపార్టీల పరస్పర దాడుల నేపథ్యంలో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ అయిపోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. కాగా.. ఈ దాడులను అంచనా వేయడంలో స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - Jan 08 , 2025 | 05:15 AM