ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana Politics : బీసీలకు 42% సీట్లు

ABN, Publish Date - Feb 05 , 2025 | 04:22 AM

రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్‌ పార్టీ తరఫున 42 శాతం సీట్లు ఇస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి శాసనసభ వేదికగా ప్రకటించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉందన్నారు. ఒకవేళ చట్టపరంగా అంత శాతం రిజర్వేషన్లు కల్పించలేని పరిస్థితి ఏర్పడితే.. తమ పార్టీ మాత్రం 42 శాతం సీట్లు ఇస్తుందని స్పష్టం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ఇస్తాం

చట్టపరంగా అవకాశం లేకపోయినా మేము సిద్ధం

బీఆర్‌ఎస్‌, బీజేపీ 42 శాతం ఇచ్చేందుకు సిద్ధమా?

బీఆర్‌ఎస్‌ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీలు 51 శాతమే

మా సర్వే ప్రకారం 56.33 శాతం ఉన్నారు

వారి సర్వేలో ఓసీలు 21%, మా సర్వేలో 15.79%

కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు వివరాలు ఇవ్వలేదు

సర్వేలో పాల్గొనని సభ్యులకు మాట్లాడే అర్హతలేదు

మేము చేసిన సర్వేనే అధికారిక డాక్యుమెంట్‌

ఒక్క కుటుంబం కోసమే నాటి ‘సమగ్ర కుటుంబ సర్వే’

అది ఒక ఫాల్తూ రిపోర్ట్‌.. అందులో చెప్పినన్ని

ఎస్సీ కులాలుంటే సీఎం పదవికి రాజీనామా చేస్తా

శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన

కులగణను ఏకగ్రీవంగా ఆమోదించిన సభ

ఎస్సీ వర్గీకరణ అమల్లో దేశంలో మేమే ముందు

సుప్రీంకోర్టు తీర్పునాడే మాటిచ్చాం.. నిలబెట్టుకున్నాం

రాజకీయ జీవితంలో ఆత్మసంతృప్తినిచ్చిన రోజు ఇది

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్‌ పార్టీ తరఫున 42 శాతం సీట్లు ఇస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి శాసనసభ వేదికగా ప్రకటించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉందన్నారు. ఒకవేళ చట్టపరంగా అంత శాతం రిజర్వేషన్లు కల్పించలేని పరిస్థితి ఏర్పడితే.. తమ పార్టీ మాత్రం 42 శాతం సీట్లు ఇస్తుందని స్పష్టం చేశారు. తమ పార్టీలాగే బీఆర్‌ఎస్‌, బీజేపీ కూడా బీసీలకు 42 శాతం సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయా? అని సవాల్‌ చేశారు. చిత్తశుద్ధి ఉంటే ఇదే శాసనసభ నుంచి ఆ రెండు పార్టీలు బీసీలకు మాట ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కులగణన సర్వేపై మంగళవారం శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేశారు. బీజేపీ సభ్యుడు పాయల్‌ శంకర్‌ను అపోహల సంఘం మాట్లాడిస్తున్నట్లు కనిపిస్తోందంటూ పరోక్షంగా బీఆర్‌ఎ్‌సనుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘2011 జనగణన ప్రకారం రాష్ట్రంలో 3,50,03,674 మంది జనాభా ఉంటే.. వీళ్లు (బీఆర్‌ఎస్‌) చేపట్టిన ఇంటెన్సివ్‌ హౌస్‌ హోల్డ్‌ సర్వే ప్రకారం 3,68,76,544గా తేలింది. ఇదే డాక్యుమెంట్‌లోని పేజీ నంబర్‌ 33లో ఓసీలు 21 శాతంగా ఉన్నారు. కానీ, మా సర్వేలో ఓసీల శాతం పెరిగిందంటున్నారు. పాయల్‌ శంకర్‌ మంచోడే. కానీ, వెనుక ఉన్నోళ్లు (బీఆర్‌ఎస్‌) ఏది చెబితే అది వింటున్నట్లున్నారు? వాళ్ల లెక్క ప్రకారం.. బీసీలు 1,85,61,856 మంది అంటే... 51 శాతం. ఓసీలు 78,12,858 మంది అంటే 21 శాతం. ఎస్సీలు 63,60,158 మంది అంటే 18 శాతం. ఎస్టీలు 36,02,288 మంది అంటే 10 శాతం. మా ప్రభుత్వ లెక్కల ప్రకారం.. బీసీ జనాభా 56.33 శాతం. అంటే ఈ రోజు బీసీలు పెరిగారా? తగ్గారా? ఓసీలను వాళ్లు 21 శాతంగా చూపిస్తే.. మా సర్వేలో 15.79 శాతంగా తేలింది. ఓసీలు పెరిగినట్లా? బీసీలు పెరిగినట్లు వాస్తవాలను తెచ్చి సభలో పెట్టాం’’ అని సీఎం అన్నారు.

సభను తప్పుదోవ పట్టిస్తున్నారు..

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ సర్వే డాక్యుమెంట్‌లో నాలుగు కేటగిరీలనే చూపించారని, ముస్లిం మైనారిటీలను చూపించలేదని సీఎం రేవంత్‌ తెలిపారు. ‘‘సభను తప్పుదోవ పట్టిస్తే ఎలా? వారి డాక్యుమెంట్‌ అధికారికమా? కాదా? అనేది అక్కడ మంత్రులుగా పని చేసినవారుచెప్పాలి. మా సర్వేలో చెప్పిన సమాచారాన్ని మొత్తం మేము ఓన్‌ చేసుకుంటున్నాం. వంద శాతం ఈ సర్వేను మేము బాధ్యతగా తీసుకుంటున్నాం’’ అని సీఎం చెప్పారు. ఇంత సమగ్రంగా ప్రభుత్వం సర్వే చేస్తే.. మాజీ సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యేలు కేటీఆర్‌, హరీశ్‌రావు, పద్మారావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీ డీకే అరుణ వివరాలు ఇవ్వలేదని ముఖ్యమంత్రి తప్పుబట్టారు. పైగా తప్పుడు లెక్కలు తెచ్చి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ‘‘1931 మాత్రమే కాదు.. ప్రతి పదేళ్లకోసారి జనగణన చేశారు. 2014లో నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక 2021కు సంబంధించిన జనగణన చేపట్టడం లేదు. బలహీన వర్గాలకు హక్కులు ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో ఎప్పుడూ ఆగని జనగణనను ఎందుకు ఆపారు? అందుకే జనగణన చేపట్టాలని, అందులో కులగణనను కూడా చేపట్టాలంటూ మా పార్టీ నేత రాహుల్‌గాంధీ ప్రధానిని డిమాండ్‌ చేశారు. దానికి సమాధానం లేదు. వీళ్లు(బీఆర్‌ఎస్‌) సమగ్ర కుటుంబ సర్వే చేసి, ఒకే ఒక కుటుంబం దానిని దాచి పెట్టుకుంది. ఈ డాక్యుమెంటును బయటి గ్రూపుల్లో సర్క్యులేట్‌ చేస్తున్నారు. మంత్రివర్గ సమావేశంలో పెట్టి ఎందుకు ఆమోదించలేదు? శాసనసభలో ఎందుకు ప్రవేశపెట్టలేదు? ఎందుకు బయట పెట్టలేదు?’’ అని సీఎం ప్రశ్నించారు.


మాది అధికారిక డాక్యుమెంట్‌..

2011 జనాభా లెక్కలు తప్ప.. ఎక్కడా అధికారిక లెక్కలు లేవని ముఖ్యమంత్రి తెలిపారు. 2024లో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ఈ సర్వే మాత్రమే అధికారిక డాక్యుమెంట్‌ అని, ఇంతకుమించి అధికారిక డాక్యుమెంట్‌ లేదని స్పష్టం చేశారు. ‘‘2011 జనాభా లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో 3,50,03,674 మంది జనాభా ఉంది. ఈ రోజు 3.70 లక్షలకు పైగా జనాభా ఉంది. ఇంకా ఎక్కడా అధికారిక లెక్కలు లేవు. ఎవరైనా చెబితే అవి ఊహించినవే. సామాజిక న్యాయం చేయాలనే ఉక్కు సంకల్పంతో ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సహకరించండి. అర్థం పర్థం లేని కాగితాలు తెచ్చి, సభను తప్పుదోవ పట్టించవద్దు. సర్వేలో పాల్గొననివారు ఈ సభలోనే ఉన్నారు. ఇప్పటికైనా వారు వివరాలు ఇవ్వాలని కోరుతున్నా’’ అని రేవంత్‌ అన్నారు. హిందువులు, ముస్లింలలో బలహీన వర్గాలవారు 50 శాతానికి పైగా ఉన్నారని మొదటి నుంచి చర్చించుకుంటున్నామని, కానీ.. దీనికి ఒక సహేతుకత, పారదర్శకమైన పాలసీ డాక్యుమెంట్‌ లేదని పేర్కొన్నారు. ఈ దేశాన్ని బ్రిటి్‌షవాళ్లు పరిపాలించినప్పుడు 1931లో కుల గణననను చేపట్టారు తప్ప... జనాభా లెక్కల సందర్భాల్లో కుల గణన జరగలేదన్నారు. ఎస్సీ, ఎస్టీల వివరాలను మాత్రమే పొందుపర్చారు తప్ప... బలహీనవర్గాల వివరాలను పొందుపరచలేదని తెలిపారు. దీంతో బీసీల లెక్క లేకపోవడం వారికి ఒక బాధగా, హక్కులను కాలరాస్తున్నట్లుగా మిగిలిపోయిందన్నారు.

రాహుల్‌గాంధీ చెప్పారు..

ఎంత మంది ఉంటే అంతమేర హక్కులు ఇవ్వాలని, కులాల ప్రాతిపదికన జనాభా లెక్కలు తీయాలని తమ నాయకుడు రాహుల్‌గాంధీ చెప్పారని సీఎం రేవంత్‌ తెలిపారు. కానీ, ఇందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదన్నారు. ‘‘రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే... బలహీనవ ర్గాల లెక్క తేల్చి వారికి రాజకీయ, విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు కల్పిస్తామని తెలంగాణలో యాత్ర సందర్భంగా రాహుల్‌గాంధీ చెప్పారు. అందుకే మంత్రివర్గ సమావేశంలో సర్వేపై తీర్మానం చేశాం. కుల గణన జరగాలన్న లక్ష్యంతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశాం. ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాం. 12 సార్లు సమీక్ష సమావేశాలు పెట్టి, పకడ్బందీగా సర్వే చేశాం. ఇది చారిత్రక నిర్ణయం. దీనికి మంత్రిమండలి సమావేశంలో ఆమోదం తెలిపి, సభలో ప్రవేశపెట్టాం. బలహీన వర్గాలకు విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించాలంటే దీనికి చట్టబద్ధత కల్పించాలి. అందుకే ఈ రోజు 46.25 శాతం ఉన్న బీసీలు, బీసీల్లోని ‘ఇ’ గ్రూపులో ఉన్న 10.08 శాతం కలిపి మొత్తం 56.33 శాతం మంది బీసీలకు సముచిత స్థానం కల్పించాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, ముందుకు వచ్చింది. ఇందుకు అన్ని పార్టీలు ప్రభుత్వాన్ని అభినందించాలని కోరుతున్నా’’ అని ముఖ్యమంత్రి అన్నారు.


వ్యక్తిగత సమాచారం మినహా అంతా ఇస్తాం..

కులగణన పూర్తి నివేదికను సభలో ఎందుకు పెట్టలేదని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించడంపై ముఖ్యమంత్రి స్పందిస్తూ, ‘‘మొత్తం నాలుగు వాల్యూమ్‌లలో వేలాది పేజీల్లో నివేదిక ఉంది. అయితే నాలుగో వాల్యూమ్‌లో ప్రజల వ్యక్తిగత సమాచారం అంతా ఉంది. వ్యక్తిగత సమాచార భద్రత చట్టం కింద ఆ సమాచారాన్ని బహిర్గతం చేస్తే క్రిమినల్‌ కేసు నమోదు చేస్తారు. అందుకే ఈరోజు సభలో పెట్టలేదు. వ్యక్తిగత సమాచారం లేని మిగతా మూడు వాల్యూమ్‌లు బహిర్గతం చేసేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. సర్వేకు సంబంధించి ఏ వివరాలైనా నాతో చర్చించవచ్చు. నేను అమావాస్యకో, పౌర్ణమికో వచ్చే ముఖ్యమంత్రిని కాను.. నిత్యం అందరికీ అందుబాటులో ఉండే ముఖ్యమంత్రిని.. గత 14 నెలలుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నా’’ అని రేవంత్‌ అన్నారు. గత ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఓ ఫాల్తూ రిపోర్ట్‌ అని, అందులో ఎస్సీల్లో 82 ఉప కులాలు ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వం చెప్పినట్టుగా ఎస్సీల్లో 82 ఉపకులాలుంటే సీఎం పదవికి ఇప్పుడే రాజీనామా చేసి వెళ్లిపోతానని సవాల్‌ చేశారు. సీఎం సమాధానం తర్వాత కూడా అక్బరుద్దీన్‌ మళ్లీ అదే అంశాన్ని గట్టిగా లేవనెత్తడంతో.. రేవంత్‌ మళ్లీ స్పందించారు. ‘‘మీరు ఇక్కడ సీనియర్‌ ఎమ్మెల్యే. మేము మద్యలో బ్రేక్‌ ఇచ్చి వస్తుంటే.. మీరు మాత్రం 1999 నుంచి వరుసగా గెలిచి వస్తున్నారు. మీరు కులగణనపై ఇలా గట్టిగా మాట్లాడితే.. ప్రభుత్వానిదే తప్పని ప్రజలు భావించే ప్రమాదముంది’’ అని సీఎం నవ్వుతూ అన్నారు. అంతకుముందు కులగణనపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. బీసీ కులాల శాతంపై వస్తున్న రకరకాల వాదనలపైనా క్యాబినెట్‌ చర్చించింది. సర్వే ఎలా చేశామన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అభిప్రాయపడింది.

సర్వేలో పాల్గొననివారికి మైక్‌ ఇవ్వొద్దు

2014లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నివేదికను పదేళ్లయినా అధికారికంగా ఎందుకు ప్రకటించలేదని సీఎం రేవంత్‌ ప్రశ్నించారు. అటెండర్లు, చప్రాసీలు, డ్రైవర్లతో ఆ సర్వే చేయించారని, వారి వివరాలు కూడా ఇంతవరకు తెలియదని అన్నారు. ప్రజల వ్యక్తిగత వివరాలన్నీ సేకరించి లాకర్లో పెట్టుకున్నారని, ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆ డేటాను వినియోగించుకున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం సేకరించిన అధికారిక సమాచారాన్ని మాత్రం ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వంపై నమ్మకం లేదంటున్నవారు, సర్వేలో పాల్గొనని వారు ఈ సభకు ఎందుకు వచ్చినట్లని ప్రశ్నించారు. సర్వేలో పాల్గొనని వారికి సభలో మాట్లాడే అర్హత లేదన్నారు. వారు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వద్దని, వారికి మైక్‌ ఇవ్వద్దని స్పీకర్‌ను కోరారు. ‘‘గత ప్రభుత్వం కేవలం సెల్ఫీలు, సెల్ఫ్‌ డబ్బాల కోసమే తాపత్రయ పడింది. సీఎం జుట్టు నచ్చలేదు.. ముక్కు నచ్చలేదు అని సర్వేలో పాల్గొనకుంటే ఎలా.? సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ప్రజలకు చెప్పకుండా.. లిమ్క్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ కోసం పంపారు. ఏం పొడిచారని రికార్డు కోసం దరఖాస్తు చేశారు?’’ అని సీఎం మండిపడ్డారు.


మరిన్ని వార్తల కోసం..

PM Modi: ఎవర్నీ వదిలిపెట్టలేదు.. ఆటాడుకున్న పీఎం

Maha Kumbh Mela 2025: కుంభమేళాకు ప్రధాని మోదీ.. పవిత్ర స్నానంతోపాటు ప్రత్యేక పూజలు

Delhi Elections: ఎన్నికలకు సిద్ధం.. 35,000 మంది పోలీసులు, సీసీ టీవీ నిఘా..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 05 , 2025 | 04:22 AM