Dornakal MLA : డోర్నకల్ ఎమ్మెల్యేపై కేసు నమోదు
ABN, Publish Date - Feb 18 , 2025 | 05:08 AM
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ భూమి వివాదంలో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రాంచందర్‌నాయక్‌పై కేసు నమోదైంది. రాంచందర్‌నాయక్ సూర్యాపేటలో
సూర్యాపేట భూమి విషయంలో వివాదం నేపథ్యంలో..
సూర్యాపేట, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి) : సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ భూమి వివాదంలో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రాంచందర్‌నాయక్‌పై కేసు నమోదైంది. రాంచందర్‌నాయక్ సూర్యాపేటలో వైద్యుడిగా ఉన్న సమయంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్డులో సర్వే నెం.356లో 1000 గజాల స్థలాన్ని 2010 సంవత్సరంలో కొనుగోలు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన గుండపనేని లక్ష్మీనర్సింహారావు అదే ప్రదేశంలో సర్వే నెం.232లోని 50 గుంటల స్థలం కొనుగోలు చేశాడు. ఈ సర్వే నెం.232, 356లోని భూమి విషయంలో రామచందర్‌నాయక్, లక్ష్మీనరసింహారావుల మధ్య 2015 నుంచి వివాదం నెలకొంది. రాంచందర్‌నాయక్ 1000 గజాలు తనదేనని అంటుండగా.. లక్ష్మీనరసింహారావు మాత్రం ఈ స్థలం మొత్తం తనదేనని, విక్రేత డాక్యుమెంట్లు సైతం రద్దు చేయించానని వాదిస్తున్నారు. కాగా సూర్యాపేటలోని 356 సర్వేనెంబర్‌లో ఉన్న 1000 గజాల స్థలాన్ని విక్రయించేందుకు ఈ ఏడాది జనవరి 8వ తేదీన రాంచందర్‌నాయక్ స్థలాన్ని చదును చేయిస్తున్న క్రమంలో సూర్యాపేటకు చెందిన కొంతమంది అడ్డుకున్నారు. దీంతో చదును చేస్తున్న వ్యక్తి లక్ష్మీనరసింహారావుకు సంబంధించిన వ్యక్తులపై సూర్యాపేట పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా 9వ తేదీన కేసు నమోదైంది. జనవరి 12వ తేదీన లక్ష్మీనరసింహారావుకు చెందిన వ్యక్తులు ఫిర్యాదు చేయగా రాంచందర్‌రావుకు సంబంధించిన ఎనిమిది మంది వ్యక్తులపై కేసు నమోదైంది. ఈ ఘటనపై ఇరు వర్గాలకు పోలీసులు నోటీసులు జారీ చేసి, ఎవరూ ఆ భూమిలోకి వెళ్లవద్దని ఆర్డీవోకు నివేదిక పంపారు.
హైకోర్టులో పిటిషన్
సివిల్ వివాదంలో పోలీసులు జోక్యం చేసుకుంటున్నారని సూర్యాపేట జిల్లా ఎస్పీ, డీఎస్పీ, పట్టణ సీఐలను ప్రతివాదులుగా రాంచందర్‌నాయక్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో లక్ష్మీనరసింహారావు సైతం రాంచందర్‌నాయక్ పదవిని అడ్డుపెట్టుకుని భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని హైకోర్టులో ఇంప్లీడ్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు సూర్యాపేట జిల్లా పోలీసులకు నోటీసులు ఇచ్చింది. కాగా రాంచందర్‌నాయక్ చెప్పడంతోనే తాము ఈ పనిచేశామని ఆయన అనుచరుడు బాషిపంగు భాస్కర్ అంగీకరించటంతో రాంచందర్‌నాయక్‌పై కేసు నమోదు చేస్తూ సంబంధిత నివేదికను హైకోర్టుకు సమర్పించినట్లు సూర్యాపేట పట్టణ ఇన్‌స్పెక్టర్ వీరరాఘవులు తెలిపారు.
Updated Date - Feb 18 , 2025 | 05:08 AM